‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల మంది పోలీస్ అభ్యర్థులు తీవ్ర నిరాశ, ఆందోళనతో రోడ్డున పడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను మభ్యపెట్టి, తమకు అనుకూలంగా వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను విస్మరించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే జీవో 46 రద్దు చేసి నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పాలకులు నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. తమ న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాటాలు చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు బనాయించి, నిర్బంధాలకు గురిచేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి రెండేండ్లకు ఒకసారి (2016, 2018, 2022) నోటిఫికేషన్లు జారీ చేశారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో దాదాపు 45 వేలకు పైగా పోలీస్ పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో అభ్యర్థులకు పోటీ తక్కువగా ఉండేలా ప్రణాళికలు ఉండటంతో, ప్రతి నోటిఫికేషన్‌కూ సగటున కేవలం 20 మంది మాత్రమే పోటీ పడే పరిస్థితి ఉండేది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేస్తే.. నేడున్న 15 లక్షల మంది అభ్యర్థుల్లో ప్రతి ఒక్క పోస్టుకూ ఏకంగా 300 మంది పోటీ పడాల్సి వస్తుంది. ఇది నిరుద్యోగుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసే అంశం. అందుకే ఇది ప్రజా ప్రభుత్వం కాదు… నిరుద్యోగుల పాలిట ‘యమకింకర ప్రభుత్వం’ అని పోలీస్ అభ్యర్థులు మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన అభ్యర్థులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ హయాంలో మూడేండ్లపాటు వయోపరిమితి పెంపుతో పాటు, అదనంగా మరో రెండేండ్లు కలిపి మొత్తం 32 ఏండ్ల వరకు వయోపరిమితి కల్పిస్తూ విస్తృతావకాశం కల్పించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క కొత్త పోలీస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు.
జీవో నెంబర్ 31 తీసుకువచ్చి, వయోపరిమితిని రెండేండ్లు అదనంగా పెంచుతూ 34 ఏండ్లు చేశారు. కానీ, ఆ జీవో అమల్లో ఉన్న కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసగించారు. తీరా ఆ జీవో గడువు ముగిసిన తర్వాత, దానిని రెన్యువల్ చేయకపోగా.. తాజాగా జీవో నెంబర్ 87 తీసుకువచ్చి 34 ఏండ్లు ఉన్న వయోపరిమితిని కాస్తా 32 ఏండ్లకు కుదించారు. నిరుద్యోగుల వయస్సు పెరుగుతున్నకొద్దీ వయోపరిమితిని పెంచాల్సిందిపోయి, తగ్గించే విచిత్రమైన చట్టాలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బహుశా ఇదేనేమో!
పాలక ప్రభుత్వంలోని మంత్రులంతా వేలం పాట పాడినట్లుగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఏప్రిల్‌లో నోటిఫికేషన్, జూన్‌లో, సెప్టెంబర్‌లో, డిసెంబర్లో, మళ్లీ జనవరిలో అంటూ నెలల పేర్లు మారుస్తూ పోలీస్ అభ్యర్థుల జీవితాలు, వారి ఆశలతో చెలగాటం ఆడుతున్నారు. తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు తెలియజేస్త్తున్నారు. తమ ఆక్రందనలను పాలకులకు విన్నవించుకునేందుకు ప్రయత్నిస్తుంటే, సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిందిపోయి విద్యార్థులపై లాఠీచార్జీలు చేయిస్తున్నది. నిరుద్యోగులపై అక్రమ కేసులు బనాయించి, పోలీస్ స్టేషన్లలో బంధిస్తూ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నది. అభ్యర్థులు ఇస్తున్న వేలాది వినతిపత్రాలు నేరుగా చెత్తబుట్టలోకి వెళ్తున్నాయి తప్ప, సమస్యకు పరిష్కార మార్గం చూపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
తక్షణమే 19 వేల పోస్టులతో కూడిన భారీ పోలీస్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని 36 ఏండ్లకు పెంచాలి. జీవో 87 ద్వారా తగ్గించిన వయోపరిమితిని తక్షణమే రద్దు చేయాలి. వయోపరిమితి గుర్తింపు కోసం జూలై 1వ తేదీని ప్రామాణికంగా తీసుకోకుండా, జనవరి 1వ తేదీని కటాఫ్ డేట్‌గా పరిగణించాలి. దీనివల్ల వేలాదిమంది అభ్యర్థులకు చివరి అవకాశం దక్కుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు దేశంలోని పలు రాష్ర్టాల్లో ఇదే విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ గమనంలోకి తీసుకోవాలి. తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధనకు ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపనకు స్వస్తి చెప్పి తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ విడుదలకు డిమాండ్ చేస్తున్నాం!