ప్రస్తుతం తెలంగాణలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీ నాయకులు ప్రజా జీవితాన్నే కాకుండా భావ చైతన్యాన్ని తీసుకువచ్చి మానసిక స్థాయి పెంచటానికి నిత్య ప్రయత్నం చేస్తుంటే ఒక స్థాయి కూడా లేని ఈ వి(ష)పక్షాలు ఆ ప్రక్రియకు శతవిధాలా సైంధవులవుతున్నారు. వీరందరి భాషణలు వింటూంటే ఒక మనమే నమ్మలేని అనుమానం కలుగుతున్నది. వారి మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరిందేమో అని తీవ్రమైన ఆలోచన వస్తున్నది.
సబ్బండ వర్ణాలకు కేసీఆర్ ఎటువంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టారో ప్రజలంతా తెలుసుకోవాలి. వివిధ వర్గాల్లో అర్హులకు పలు సంక్షేమ పథకాలే కాకుం డా, చనిపోయినవారికి గౌరవ ప్రదమైన వైకుంఠధామాలు నిర్మించారు. అంతేకాదు, చరమాంకంలో ఉన్న రోగులకు కూడా చికిత్సతో పాటు ఆత్మీయత నందించటానికి పాలియేటివ్ కేర్ సెంటర్లను కూడా శ్రద్ధగా నడిపేటట్టు పర్యవేక్షిస్తున్నారు. దేశంలో ఉన్న ఇటువంటి సెంటర్లలో 20 శాతం మన రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణం కాదా?
కేసీఆర్ దార్శనికత, వారి నిబద్ధత, పథకాలు రూపొందించటంలో నిపుణత, వాటిని అమలుపరచటంలో చూపే దక్షత, చొరవ… ఇవన్నీ తమకు లేవు, రావు అని గ్రహించిన వారందరూ, ‘అటునుంచి నరుక్కు రావాలి’ అన్న సామెత అనుసరిస్తున్నారు. అదేమంటే, కేసీఆర్‌కు ప్రజాభిమానం తగ్గాలి. అది తగ్గాలంటే మార్గం ఒకటే! ప్రజల ఆలోచనాశక్తిని హరించి, భావోద్వేగాలు పెంచి, వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని ద్వేషించేటట్టు చేయటమొక్కటే ఆ మార్గం. ఎందుకంటే కేసీఆర్ ఏ బహిరంగసభలో అయినా రెండు విషయాల గురించే మాట్లాడతారు. తమ ప్రభుత్వ పథకాల వివరణ, ప్రజలు ఆ ప్రభుత్వ పథకాలను విశ్లేషించి, చర్చించి వాటి ఆవశ్యకతను గ్రహించి, వాటిని సరిగా ఉపయోగించుకోవాలని. వారి భాషణ స్థాయి ఈ రోజున భారత రాజకీయ నాయకులలో ఎవరికీ లేదు.
ఆఖరికి ప్రధానమంత్రి కూడా తొమ్మిదేండ్లలో తాము ఏమి సాధించామో చెప్పకుండా, చాలాకాలం పరిపాలించిన కాంగ్రెస్ వైఫల్యాలను మాత్రమే చెప్తూ కాలం గడిపేస్తున్నాడు. ఎందుకంటే ఒక్క రంగంలోనైనా తాము సాధించింది ఉందని చెప్పే వీలు లేక. ధరల నియంత్రణ, ఉద్యోగ కల్పన కాంగ్రెస్‌కు చేతకాలేదని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ రెండూ తమ పాలనలో ఎలా ఉన్నాయో వివరించగలరా? అందుకే వారికి వేరే విషయాలు అవసరమవుతాయి. అవేమిటి? భారతదేశం వెలిగిపోతుంది. ఇతర దేశాలన్నీ భారత్‌ను చూసి అసూయతో ఉడికిపోతున్నాయి. ఈ ప్రగతి అంతా మోదీ ఘనతే. కాబట్టి మనం వారి నీడలోనే కలకాలం బతకాలి. మోదీ కొంచెం జరిగాడంటే దేశంలోని హిందుయేతరులు వీరిని మింగేస్తారు. ఇదే భాషణ. ఇవే మాటలు ఎక్కడ చూసినా. ఈ భయం కల్పించటానికి, దానిని నిలబెట్టడానికి బీజేపీ సదా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మిగతా విషయాలను ప్రజలు పట్టించుకోకూడదని!
ఇక మన రాష్ట్రస్థాయికి వస్తే విపక్షాలకు అవగాహన స్థాయి రాజకీయంగా లేకపోయినా వైరి పక్షాలన్నీ అనుసరించే పంథా ఒక్కటే. ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తిగత దూషణలకు దిగజారడం. దీనివల్ల ప్రభుత్వం అధికారం కోల్పోకపోవచ్చు. ఎందుకంటే ప్రజాచైతన్యం పెరిగిన తెలంగాణలో ఎవరి ప్రభుత్వం బాగుందో, తమకు మేలు చేస్తుందో అన్న సోయి బాగానే ఉంది. కానీ ప్రజలకు జరిగే నష్టం మాత్రం అపారం. ఒక సకారాత్మక సమాజంగా మారాలంటే ప్రజలకు కావలసినది ముఖ్యంగా విచక్షణ, వివేకం. ఈ రెండూ పెంచాలని ఒక పక్క కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఆ వివేకాన్ని హరించే ఆవేశం రగిలించి, భావోద్వేగాలు రెచ్చగొట్టి సామాన్య ప్రజల మానసిక స్థాయిని దిగజార్చే మార్గాలు అనుసరిస్తున్నాయి ఈ వైరిపక్షాలన్ని గంపగుత్తగా!!
ఒక తమాషా పోలిక గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్టీపీ, బహుజన సమాజ్ పార్టీ… ఈ పార్టీల నాయకులందరి భాషణలు గమనించండి. కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రగతిభవన్ పేల్చేస్తానం టే, బీజేపీ అధ్యక్షుడు కొత్త సచివాలయ శిఖరాన్ని పగలగొడుతాడట. ఇక వలస పార్టీ అధ్యక్షురాలు ఒక ఎమ్మెల్యేకు విడాకులివ్వమని వారి భార్యను రెచ్చగొడుతున్నది.
నాగరిక స్త్రీలెవరూ తలెత్తుకోలేని భాషలో ఆవిడ ప్రసంగాలు చేస్తుంటే చప్ప ట్లు కొట్టే వాళ్లను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తున్నది. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారని ఆవిడ పిటిషన్ వేస్తే జడ్జిగారి ముందు ఆవిడ ప్రసంగాలు పెట్టారు పోలీసులు. ఒక్క నిమిషమే విని, ఇక వినలేక ఆ గౌరవ జడ్జి గారు తక్షణం ఆవిడ టేపులను ఆపమని ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఇలా కోర్టును ధిక్కరిస్తూ, నాగరిక ప్రపంచం తల దించుకునే భాషను వాడుతున్న వారి సంస్కారాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? వారిని ప్రజలు ఎట్లా ఆదరిస్తారు?
ఇక బీఎస్పీ అధ్యక్షుడి స్వరస్థాయి చూస్తే అమాయకులను ఆగం చేసే పథకంలా కనిపిస్తున్నది. ప్రసంగాలు చేసేవారి స్వరం, భాష గురించి మానసిక శాస్త్రవేత్తలు చాలా చక్కగా వివరిస్తారు. తాము చెప్పేది అబద్ధమని తెలిసినవారు దాన్ని ఎదుటివారికి గట్టిగా చెప్తారు. ఒక అసభ్య భాష వాడేవారిని ఎదుర్కొనలేక, ఆ స్థాయికి దిగలేక నోరుమూసుకుంటారని భావిస్తారు. ‘చూశారా, నా మాటలకు. ఆరోపణలకు ఈ నాయకులు సమాధానం చెప్పలేకపోయా రు’ అని ప్రజలను ఇంకా రెచ్చగొడతారు. సమాధానాలు లేక కాదు, అటువంటి బురదలోకి దిగడం ఇష్టంలేక నిశ్శబ్దంగా ఉన్నారని, ఉంటారని వారికి తెలుసు. కానీ ప్రజలను మోసం చేయటానికే ఈ విచిత్ర విన్యాసాలు. ఇక అభ్యంతరకర భావాలను ప్రజల్లోకి చొప్పించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.
నిరూపణ చేయలేని ఆరోపణలు చేస్తా రు. అబద్ధాలు చెప్తారు. ప్రజలు ఒక్క సంగ తి గ్రహించాలి. ఈ నాలుగు పార్టీల అధ్యక్షుల్లో ఏ ఒక్కరైనా ఒక ప్రజావేదిక మీద, గౌరవప్రద భాషలో తెలంగాణలో జరుగుతున్న ప్రగతి, లేక వెనుకబాటుతనం లేక ప్రభుత్వ వైఫల్యం గురించి ఏ బీఆర్ఎస్ నా యకుడితోనైనా చర్చించగలరా? వారు రోడ్ల మీద, తాము తెచ్చుకున్న మనుషుల మధ్య మాట్లాడిన మాటలు నిరూపించగలరా? రోడ్డు మీద సభ జరిగితే, పచ్చటి పొలం పక్కో, డబుల్ బెడ్రూం ముందో నుంచుని కూడా గొంతు చించుకొని అబద్ధాలు చెప్పవచ్చు. కానీ ఒక బహిరంగ చర్చలో చెప్పగలరా?
ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ఒక బాధ్యత ఉన్నది. అదేం కష్టమైంది కాదు. ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలన, తొమ్మిదేండ్ల తెలుగుదేశం పాలన ఎలా ఉన్నాయో, తెలంగాణ వ్యవసాయ పరిస్థితి, హైదరాబాద్‌లో ఆంధ్రవారి ఆధిపత్యం ఎలా సాగాయో గుర్తుంచుకోవాలి. 2014 నుంచి రాష్ట్ర పరిస్థితిలో ప్రజా జీవనంలో ఏ మార్పులు వచ్చాయో గమనించాలి. 1956 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, 2014 నుం చి ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి బేరీజు వేసుకోవాలి. అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో వలె నాయకు లు అందుబాటులో లేకుండా లేరు. వా రు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. సందేహా లు, సమస్యలు వారితో చర్చించాలి. కేవ లం పాదయాత్రల పేరుతో విషాన్ని చిమ్ముతున్న ఈ పార్టీ అధ్యక్షుల మాటలు గుడ్డిగా నమ్మకూడదు. 54 ఏండ్ల ఉద్యమ ఫలితాన్ని అనుభవిస్తూ ఈ విజయాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. తెలివి తప్పి ఈ మాటలు నమ్మకూడదు. నిబద్ధత లేని ఈ ప్రసంగాల కుట్రలు ఛేదించాలి.
సబ్బండ వర్ణాలకు కేసీఆర్ ఎటువంటి మానవీయ పథకాలు ప్రవేశపెట్టారో ప్రజలంతా తెలుసుకోవాలి. వివిధ వర్గాల్లో అర్హులకు పలు సంక్షేమ పథకాలే కాకుం డా, చనిపోయినవారికి గౌరవ ప్రదమైన వైకుంఠధామాలు నిర్మించారు. అంతేకాదు, చరమాంకంలో ఉన్న రోగులకు కూడా చికిత్సతో పాటు ఆత్మీయత నందించటానికి పాలియేటివ్ కేర్ సెంటర్లను కూడా శ్రద్ధగా నడిపేటట్టు పర్యవేక్షిస్తున్నారు. దేశంలో ఉన్న ఇటువంటి సెంటర్లలో 20 శాతం మన రాష్ట్రంలోనే ఉండటం గర్వకారణం కాదా? ఈ మానవీయ పరిపాలన ఎక్కడ? దాన్ని పాడు చేయడానికి వచ్చిన ఈ మూకలు ఎక్కడ? పాదయాత్రలు చేసినంత మాత్రాన ఈ పరిపాలనాదక్షత వస్తుందా?
పాదయాత్రలు చేస్తున్న ఈ వైరిపక్షాల నాయకులు చెప్పులు, బూట్లు లేకుండా వారి యాత్ర చేస్తే బాగుంటుందేమో! ఎందుకంటే సాయుధ పోరాటం, సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలతో పునీతమైన ఈ నేల మట్టి వారి కాళ్లకు అంటితే, తెలంగాణ రాష్ట్రం మీద, ఇక్కడి ప్రజల మీద కొద్దిగానైనా అభిమానం కలుగుతుందేమో! జై తెలంగాణ!
కనకదుర్గ దంటు
87772 43684