ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్రజలు సంతోషంగా ఉండాలనే తపన ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి కేసీఆర్.
సమాజంలో అందరికంటే దీనంగా జీవిస్తున్నవారు దివ్యాంగులు. కన్నపిల్లలు పట్టించుకోక ఆలనాపాలన లేక ఇబ్బందులు పడుతున్నవారు వృద్ధులు. భర్త చనిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు ఒంటరి మహిళలు. ఇలాంటి అభాగ్యులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ‘ఆసరా’ పింఛను పథకాన్ని ప్రారంభించారు.
2014కు ముందు కాంగ్రెస్ హయాంలో వృద్ధులకు, దివ్యాంగులకు 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు. దివ్యాంగులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో దాన్ని రూ.500కి పెంచారు. ఈ అరకొర పింఛన్‌తో నానా అవస్థలు పడేవారు. తెలంగాణ ఉద్యమ సమయలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పడుతున్న బాధలు, కష్టాలను కేసీఆర్ స్వయంగా చూశారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వెంటనే వీరి బాధలను దూరం చేయడానికి రూ.200 ఉన్న వృద్ధుల పింఛన్‌ను 1000 రూపాయలకు పెంచారు. రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.1500 చేశారు.
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కేసీఆర్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆంధ్ర పాలకుల వల్ల సమస్యల నిలయంగా తెలంగాణ మారింది. ఆ సమస్యలను పరిష్కరించి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద పడింది. అలాంటి పరిస్థితుల్లోనూ ఒకవైపు రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూనే నిర్భాగ్యులకు పింఛన్లు పెంచి ఆదుకున్న మహనీయుడు కేసీఆర్.
2018 ఎన్నికల తర్వాత వృద్ధుల పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు పెంచారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.3015కి పెంచారు. ఇంతటితో ఆగకుండా చదువుకునే దివ్యాంగులకు ఈ పింఛన్ ఎటూ సరిపోదనే ఉద్దేశంతో ఎవ్వరూ అడగకపోయినా, 2023 జూన్ 9న మంచిర్యాలలో జరిగిన సభలో దివ్యాంగుల పింఛన్‌ను రూ.4016కి పెంచుతున్నట్లు ప్రకటించారు. పెరిగిన పింఛన్‌ను 2023 జూలై నుంచే అమలు చేసిన గొప్ప మనసున్న నేత కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వంలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు.. ఇలా చెప్పుకొంటూపోతే తెలంగాణలోని నిస్సహాయులందరూ కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతో గుండె మీద చెయ్యివేసుకొని సంతోషంగా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం కేసీఆర్ మీద అక్కసుతో ఎలాగైనా ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని ఎన్నికల ముందు అసత్య ఆరోపణలు చేస్తూ, అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి.. ఒకటి, రెండు హామీలను అమలుచేసి వాటిని గొప్పగా చెప్పుకొంటూ ఆసరా పింఛన్‌దారుల సమస్యలను పక్కనపెట్టారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యాక 1200 మంది దివ్యాంగులు కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఫించన్ల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఫించన్లను ఊడగొట్టే పనిలో పడ్డారు. చిన్న చిన్న లోపాలున్న పేద వ్యక్తులకు సైతం కేసీఆర్ పింఛన్లు ఇచ్చారు. పారదర్శకంగా పింఛన్లు ఇస్తామనే పేరుతో వాటిని తొలగించే పనిలో రేవంత్‌రెడ్డి నిమగ్నమయ్యారు. నిస్సహాయ నిరుపేదలకు ప్రభుత్వం ఆసరాగా ఉండాలని; సర్కారుకు, పింఛన్‌దారులకు మధ్య దళారులు లేకుండా కొంత పింఛన్లను ఇస్తూనే పింఛన్‌దారుల వయోపరిమితిని కేసీఆర్ 65 నుంచి 57కి తగ్గించారు. దీని వలన ఎంతో మందికి ఆసరా అంది ఆత్మగౌరవంతో జీవించారు.
ఇప్పుడు కొత్తగా పింఛన్ రావాలంటే దళారుల చేతులు తడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త పింఛన్లు ఇవ్వకుండా, ఉన్న పింఛన్లను తొలగిస్తూ, వచ్చే పింఛన్లను నెల ముగుస్తున్నా ఇవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల ఆలస్యమవుతున్నది. దీంతో ఆసరాపై ఆధారపడే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఎదురుచూపులు తప్పటం లేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతినెలా మొదటి తారీఖున పింఛన్లు ఇస్తామని, ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామని 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి హామీలు గుప్పించారు. ఇప్పుడు 22 నెలలు కావొస్తున్నా వాటిని అమలు చేయడం లేదు. పింఛన్ పెరుగుతుందని నమ్మిన లబ్ధిదారులు మోసపోయారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో-పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి దివ్యాంగులకు ఇచ్చిన హామీలు:
1.2016 వికలాంగుల హక్కుల చట్టం తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తాం.
2.దివ్యాంగుల నెలవారీ పింఛన్‌ను రూ.6000కు పెంచుతాం.
3. ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్ పాలసీని పటిష్ఠంగా అమలుపరచడంతో పాటు, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తాం.
4. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం.
ఇందులో ఏ ఒక్క హామీని రేవంత్‌రెడ్డి అమలు చేయలేదు. అబద్ధాలతో గద్దెనెక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. పేదల కన్నీరు, విధివంచితుల అవస్థలు అర్థం కావాలంటే స్పందించే గుణం ఉండాలి. కేసీఆర్‌లో స్పందించే గుణం కొంచెం ఎక్కువే. ఈ రోజు తెలంగాణలోని ప్రతి దివ్యాంగుడు ధైర్యంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే కారణం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు త్రీ వీలర్ వెహికిల్ రావాలంటే కత్తిమీద సాములాగ ఉండేది. ఒక దివ్యాంగుడు వెహికిల్ కోసం కార్పొరేషన్ చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి నానా అవస్థలు పడేవారు. అయినా జిల్లాకు ఒకటి రెండు ఇచ్చేవారు. ఆ వచ్చిన వాటిని 50 శాతం సబ్సిడీ కింద ఇచ్చేవారు. రుణం కట్టాలని బ్యాంకులు దివ్యాంగులను వేధించేవి.
కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 శాతం రాయితీతో ఉచితంగా టీవీఎస్ స్కూటీని దివ్యాంగులకు అనుకూలంగా తయారు చేసి ఇచ్చారు. చదువుకునే దివ్యాంగులు ఒకరి మీద ఆధారపడకుండా కాలేజీకి సొంతంగా వెళ్తున్నారు. బధిర వ్యక్తులకు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు ఇచ్చారు. దీంతో ఒకరి సహాయం లేకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో వెహికిల్ లేని దివ్యాంగుడు, ల్యాప్‌టాప్ లేని బధిరులు లేరంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క దివ్యాంగునికి లబ్ధి చేకూరిన దాఖలాలు లేవు.
కేసీఆర్ హయాంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎన్నడూ ధర్నాలు, ఆందోళనలు చేయలేదు. కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వీరందరూ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 65 లక్షల పింఛన్‌దారుల ఓట్లతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేశారు. మా నోటికాడ కూడు లాక్కున్నారని పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రతి దివ్యాంగుని గుండె ‘బాపు కేసీఆర్ మళ్లీ నువ్వే రావాలి’ అని అంటున్నది.
– (వ్యాసకర్త: రీసెర్చ్ స్కాలర్, ఓయూ)
దుర్గం వెంకన్న