రాష్ట్రంలోని వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలలో పెడుతున్న తిండి తినలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. మాకు నాణ్యమైన భోజనం పెట్టాలని వారు ఏడుస్తూ డిమాండ్ చేస్తుండటం చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. తరచుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో కలిపి దాదాపు 48 మంది విద్యార్థులు మరణించడంబాధాకరం. ఈ ఘటనలపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన కారణంగా 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతున్నది. గత నవంబర్ 6న మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినుల ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30న కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు దవాఖాన పాలయ్యారు.
ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, తీవ్ర కడుపు నొప్పితో 6వ తరగతి విద్యార్థి మృతిచెందడం బాధాకరం. మార్చి నుంచి నవంబర్ 15 వరకు దాదాపు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏప్రిల్ 14న భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా, 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందాడు. రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టళ్లలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు.
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, ప్రభుత్వ వసతిగృహాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఉన్న నిర్లక్ష్యం అధికారులదా, లేక ప్రభుత్వానిదా అంటే కచ్చితంగా ప్రభుత్వానిదేనని చెప్పాలి. వసతి గృహాల్లో భోజనం బాగుండటం లేదని విద్యార్థులు ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చితే ప్రభుత్వం చెల్లించే డబ్బులు ఏ మూలకు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు భోజనంలో నాణ్యతను తగ్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో సరుకులను నిల్వచేస్తూ, కుళ్లిన కూరగాయలు, పుచ్చిపోయిన పప్పులతో వంటలు చేస్తుండటం కూడా ఒక కారణమేనని తెలుస్తున్నది. ఘటనలు జరిగినప్పుడు మినహా మంత్రులు, సంబంధిత అధికారులు వసతిగృహాలలో పర్యవేక్షణ చేయకపోవడం వల్ల నిర్వాహకులు ఇష్టారీతిన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఏకరువు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రమత్తులోంచి మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
హాస్టళ్లు, గురుకులాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతున్నది. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. హాస్టళ్లు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ప్రశ్నిస్తే.. ‘మాకు దొడ్డు బువ్వనే పెడుతున్నారు’ అని చెప్తున్నారు. కొన్ని నెలలుగా ఎంఎల్ఎస్ (మండల్ లెవెల్ స్టాక్) కేంద్రాల నుంచి పిట్టలు కట్టిన, పురుగు పట్టిన, మక్కిన బియ్యాన్ని అనుమతిస్తున్నారని తెలుస్తున్నది. వీటిపై ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కారణం ఏమిటా అని ఆరా తీస్తే వారికి ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని తెలుస్తున్నది.
ఏం చేయాలో తెలువని విద్యార్థులు పెట్టిందే తిని తరచుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇన్ని జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. హాస్టళ్ల కోసం ప్రత్యేక అధికారులను నియమించి, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే విద్యార్థులను కాపాడుకున్న వారమవుతామని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.