‘మాది మాకే మీది మీకే’ అని నినదించి సాధించిన తెలంగాణలోకి దొడ్డిదారిన చేరడానికి విఫలయత్నం చేస్తున్న సోదర ఆంధ్ర బీసీ కులాల పట్ల తెలంగాణ ప్రస్తుత పాలకుల వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పద వైఖరికి రాజకీయ దురుద్దేశం, అధికార యావ ప్రధాన కారణం. రెండు రాష్ర్టాల్లోని బీసీ ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడమే వారి లక్ష్యం. కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నది.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక విధంగా, బీజేపీయేతర రాష్ర్టాల్లో మరో విధంగా కమలం పార్టీ వైఖరి ఉంటుంది. అందుకు ఈ మూడు ఉదాహరణలను ప్రస్తావించాలి. మొదటిది, మయన్మార్‌కు చెందిన రోహింగ్యాలు దేశంలో వందల ఏండ్లుగా జీవిస్తున్నారని, వారిని భారత పౌరులుగా గుర్తించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు, ‘మన దేశాన్ని 200 ఏండ్లు పాలించిన బ్రిటిష్ వారు ఈ దేశ పౌరులైపోతారా?’ అని దీదీని షా ప్రశ్నించారు.
రెండవది, జోగి కులం వాళ్లు పుణె కేంద్రంగా 50 ఏండ్లుగా జీవిస్తున్నారు. స్థానికత, కులం సర్టిఫికెట్ ఇవ్వాలన్న వారి డిమాండ్‌ను మహారాష్ట్ర సర్కారు తోసిపుచ్చుతున్నది. వారు స్థానికులు కాదనేది అక్కడి పాలకుల వాదన. అయితే, జోగి కులం వాళ్లు తెలంగాణ నుంచే తమ సర్టిఫికెట్లను తీసుకెళ్తున్నారు. మూడవది, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు చెందిన ఏడు బీసీ కులాలను తొలగించినప్పుడు ఏపీ బీజేపీ ఎంపీలు స్పందించలేదు. మనం కూడా తెలంగాణలో ఉంటున్నప్పుడు ఎందుకు తొలగించాలని కనీసం ప్రశ్నించలేదు?
ఆంధ్ర కులాలను తెలంగాణలో కలపాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, తెలంగాణలో మున్నూరు కాపు కులస్తుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. అలాగే, ఆంధ్ర కులాలను కలిపేందుకు తాము వ్యతిరేకం కాదని తన అనుంగు శిష్యుల ద్వారా బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బీసీ కమిషన్‌కు చెప్పించారు.
ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రోహింగ్యాల విషయంలో బీజేపీ వైఖరి సరైందనుకుంటే, మహారాష్ట్రలోని జోగి కులం విషయంలో ఎందుకు భిన్న వైఖరిని అవలంబిస్తున్నట్టు? పోనీ, రోహింగ్యాలు ముస్లింలు అనుకున్నా, లేదా వాళ్లు మన దేశస్తులు కాదనుకున్నా, మహారాష్ట్రలోని జోగి కులం వాళ్లు హిందువులే కదా? ఆంధ్ర బీసీ కులాలు హిందువులైనప్పుడు, తెలంగాణ బీసీ కులాలు హిందువులు కాదా? తెలంగాణ ప్రజలతో మమేకం కాలేని ఆంధ్ర వాళ్లని తెలంగాణ బీసీలుగా కలపడానికి ఎందుకు అంగీకరించాలి? కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, ఏపీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, హోంమంత్రి అమిత్ షాకు మేం వేసే మౌలిక ప్రశ్న ఇదే.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలగించిన బీసీ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చడానికి సానుకూలంగా అధ్యయనం చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టో పేజీ నెంబర్ 31లో పొందుపరిచింది. అయితే, ఇక్కడ గ్రహించాల్సింది ఏమంటే.. తాము అధికారంలోకి వస్తే ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ స్పష్టంగా చెప్పలేదు. తొలగించిన కులాలు ఆంధ్ర కులాలని, వాటినే తిరిగి చేరుస్తామని ముందే స్పష్టంగా చెప్పి ఉంటే కాంగ్రెస్ గెలిచేదే కాదు. ‘లక్ష లేదా రెండు లక్షల ఓట్లున్న ఆంధ్రా ఓట్ల కోసం తెలంగాణలోని రెండు కోట్ల జనాభా ఉన్న సామాజికవర్గాన్ని వదులుకుంటారా?’ అని ఆంధ్ర వలసవాదుల అనుకూల పాలకులను ప్రశ్నిస్తున్నాం. అధికారం, ధనం కోసం అబద్ధపు హామీలు ఇవ్వడం, తప్పుడు వాగ్దానాలు చేయడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారిపోయిందని చెప్పటానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇది ముమ్మాటికీ తడిగుడ్డతో గొంతు కోయడమే.
ఆంధ్ర బీసీ కులాలను చేర్చే విషయమై ఆగమేఘాల మీద, హడావుడిగా బీసీ కమిషన్ ప్రజాభిప్రాయాన్ని ఎందుకు సేకరిస్తున్నట్టు? ఈ విషయమై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అందుకే తాము ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వచ్చిందని బీసీ కమిషన్ బుకాయిస్తున్నది. అదే నిజమైతే జిల్లాలవారీగా ఎందుకు జరపలేదు? అనేక రకాల ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు అడగలేదు? వాటన్నింటికి రాష్ట్ర సర్కారు ఇదే విధంగా ఆగమేఘాలపై జవాబులు చెప్పిందా? ఆంధ్ర కులాల చేర్పు విషయంలోనే ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?
బీసీ కులాలపై కుల బహిష్కరణలు, దాడులను నిరోధించే లక్ష్యంతో వివిధ బీసీ కుల సంఘాలతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ విషయమై బీసీలకు అవగాహన కల్పించాలని, బీసీ కులాల మధ్య సోదరభావాన్ని పెంపొందించే బాధ్యత తీసుకోవాలని కుల నిర్మూలన వేదిక తరఫున ఏప్రిల్ 7న బీసీ కమిషన్‌కు లేఖ ఇచ్చాం. ఈ అంశాన్ని కమిషన్ ఇప్పటివరకు పట్టించుకోలేదు. కానీ, ఆంధ్ర బీసీ కులాలను తెలంగాణలో చేర్చడం గురించి వెంటనే ప్రజా సేకరణ చేపట్టింది. ఆంధ్ర కులాలను కలిపే సందర్భంగా బీసీ కమిషన్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన కొంతమందిని ఉద్దేశిస్తూ ‘మీరు తెల్ల బట్టలు వేసుకోవాల్సింది కాదు, చేపలు పట్టుకోవాల్సింది’ అని కించపరచటం దేనికి సంకేతం? కమిషనే సామాజికంగా అవమానిస్తే ఎట్లా?
తెలంగాణ బీసీ జాబీతాలో చేరే 27 కులాల్లో కళింగ కులం ఒకటి. ఈ కులం గురించి బీసీ కమిషన్ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే రాష్ట్ర సచివాలయంలో ఆ కులానికి చెందిన 800 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. అంటే వాళ్ల ప్రాతినిధ్యం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవాలి. అన్నవరం, తిరుపతి దేవస్థానంలో వారు పూజారులుగా ఉండటమంటే వాళ్లు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలి. కాబట్టి, ఆంధ్ర బీసీ కులాలను చేర్చే విషయమై బీసీ కమిషన్ ద్వారా స్వాగతించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. సుప్రీంకోర్టులో అనుకూల నివేదికలను సమర్పించడాన్ని వెంటనే ఆపాలి. ఆంధ్ర వలసవాదాన్ని పీడిత కులాలపై గుదిబండగా మార్చవద్దని డిమాండ్ చేస్తున్నాం. కాదు, కూడదని ముందుకెళ్తే మరో ఉద్యమం తప్పదు. ఉద్యమం తప్పని పరిస్థితి తలెత్తితే జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి బీసీలు మరోసారి సంఘటితం కావాలి.