ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తన మంత్రులు ఒకటి కాకుంటే ఒక సవాలుకైనా నిలవగలరేమోనని గత ఏడాది కాలంగా ఎదురుచూస్తుండగా వారు ఇంతవరకు ఏ ఒక్కదానికీ నిలవడం లేదు. ప్రతిపక్షాల సవాళ్లకే కాదు, స్వయంగా తాము విసిరే సవాళ్లపై కూడా బహిరంగ చర్చకు రమ్మన్నా ముందుకు రాకపోవడం గమనించదగ్గది. అందువల్ల, తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల కలుగుతున్న అప్రతిష్ట ఒకటి కాగా, చర్చకు నిలవలేని సవాళ్లు తాము విసరడం, ఇతరుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుకువచ్చే ధైర్యం చేయలేకపోవడంతో మరింత అప్రతిష్టకు గురవుతున్నారు.
వాస్తవానికి రాజకీయవాదుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు, బహిరంగ చర్చకు సిద్ధమా? తేదీ, సమయం, స్థలం చెప్పండి? మధ్యవర్తుల పేర్లు సూచించండి తరహా మాటలకు విలువ లేకుండాపోయింది. ఒకప్పుడు అసలు ఇటువంటి సవాళ్లు ఉండేవి కావు. ఉన్నా అతి అరుదుగా. అందుకు కారణం అప్పటి రాజకీయాలు, నాయకుల స్థాయి వేరు. ఆ కారణంగా ఎవరైనా ఆ విధంగా మాట్లాడితే ప్రజలు ఆసక్తిగా వినేవారు. నిజంగానే చర్చ జరుగుతుందేమో, ఎవరేమంటారో, ఏమి విషయాలు బయటకు వస్తాయో, వివాదం ఎట్లా తేలుతుందో అనుకొని ఎదురుచూసేవారు. అటువంటి చర్చలు ఎన్నడూ జరగలేదు. అయినప్పటికీ ఆయా నాయకుల పట్ల ప్రజలకు గౌరవం తగ్గలేదు. ఆ నాయకుల వ్యవహరణాస్థాయి ఆ విధంగా ఉండేది.
కాలం గడిచిన కొద్దీ ప్రజలకు నాయకుల పట్ల దృష్టి మారింది.గౌరవ విశ్వాసాలు పోతున్నాయి. అందుకు కారణం నాయకులు ఒకవైపు తమ అసమర్థ పాలనతో, ఇంకొకవైపు హామీలను అమలు చేయకపోవడంతో, మరొకవైపు వ్యక్తిగతమైన తీరుతెన్నులతో ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటుండటం. ఆ విధంగా గౌరవ విశ్వాసాలను కోల్పోయే వారి సవాళ్లకు మాత్రం విలువ ఎట్లా ఉంటుంది? వారు చేసే సవాళ్లకు ఉండదు, ఇతరుల సవాళ్లకు తాము
నిలవగలరని కూడా ప్రజలు భావించరు. ప్రస్తుతం జరుగుతున్నది అదే.
ఇందులో గమనించవలసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడి తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పాలించినప్పుడు ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలైతే వచ్చాయి గానీ బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాళ్లు అంతగా వినరాలేదు. వచ్చినా బలహీనంగా, మొక్కుబడి కోసం అన్నట్లు. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అమలైనవి చాలా ఉండగా, కానివి తక్కువ అవటం. రెండు, అసలు హామీ ఇవ్వకపోయినా ఎంతో భారీ పథకాలు అనేకం అమలుకు తెచ్చి ప్రజలను ఆశ్చర్యపరచడం. ఆ విధంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై సవాళ్లు విసిరే ఆస్కారం లేకుండాపోయింది. ఎవరైనా వేసినప్పటికీ పైన అన్నట్లు బలహీనంగా. అంతిమంగా, ప్రజలు విశ్వసించే పరిస్థితీ లేదు.
అటువంటి స్థితిలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిందన్నది తప్పకుండా ప్రశ్నే. అందు గురించి చాలా చర్చలు జరిగాయి. వాటన్నింటి సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, అప్పటి పాలనలో స్వల్పస్థాయిలోనైనా కొన్ని పొరపాట్లు జరగగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మితిమీరిన హామీలు ప్రజలను, ముఖ్యంగా గ్రామీణులను, వారి పేదరికం మూలంగా ఆకర్షించాయి. ఆ తరహా హామీల అమలు సాధ్యాసాధ్యాలను హైదరాబాద్ నగర ప్రజల వలె గ్రామీణులు అంచనా వేయలేకపోయారు. దానితో హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలలో వచ్చిన కాంగ్రెస్ అనుకూల ఫలితాలే ఇక్కడా కనిపించాయి. ఈ మాట జనాంతికంగా కాంగ్రెస్‌వారు కూడా అంగీకరిస్తున్నదే.
ఆ విధంగా ఎన్నికలైతే గెలిచారు గానీ, హామీలు, వాటి అమలు, అందు గురించిన సవాళ్లూ ప్రతిసవాళ్ల దశ ఆ తర్వాత సుమారు ఆరు నెలలు గడిచినప్పటి నుంచి మొదలైంది. ఇక్కడ చర్చిస్తున్నది ఈ దశ గురించే. బీఆర్ఎస్ పాలనాకాలంలో తొమ్మిదిన్నర ఏండ్లపాటు లేనన్ని సవాళ్లు ప్రతిసవాళ్లు కాంగ్రెస్ ఏడాదిన్నరలోనే ఎందుకు తలెత్తుతున్నాయన్నది ప్రాథమికమైన ప్రశ్న. అందుకు జవాబును కనుగొంటే ఇతర ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఇన్నిన్ని సవాళ్లు, ప్రతిసవాళ్లు ఏడాదిన్నరలోనే ఎందుకు వస్తున్నాయంటే, ప్రభుత్వం తన హామీలను అమలు చేయలేకపోతున్నది. పైగా తన వైఫల్యానికి నెపాలు గత ప్రభుత్వంపై వేస్తున్నది. అదే అన్నింటికి మూలం. అమలు వంద రోజుల్లోనే చేయగలమని ఆరంభించినవారు ఆ వంద రోజులు గడిచినాక వాయిదా వేయటాలు మొదలుపెట్టారు.
వాయిదాల ప్రకారం ఎదురుచూసిన ప్రజలు విసుగెత్తటంతో, చేయకుండానే చేశామంటూ బుకాయించటం సాగించారు. కొన్నింటికైతే అసలు జోలికి పోవడం లేదు. కొన్నింటిని మొదట ప్రకటించిన దానికన్నా కుదించివేశారు. కొన్నింటిని ఒక మేర చేసి పూర్తిగా చేశామనే వాదనలు మొదలుపెట్టారు. కొన్ని అబద్ధాలను మళ్లీ మళ్లీ చెప్తూ, అవి నిజమని ప్రజలు నమ్మగలరనే భ్రమలకు లోనయ్యారు.
ఆ విధంగా తాము సృష్టించుకున్న ఊబిలో తామే చిక్కుకుని, అందులోంచి బయటకు వచ్చే మార్గం లేక, గత ప్రభుత్వపు అప్పుల మూలంగానే హామీలు నెరవేర్చలేకపోతున్నామనే వాదనలు మొదలుపెట్టారు. అప్పుల మాట ఎన్నికల ప్రచార సమయంలోనే తెలుసు గదా అన్న ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోయారు. తాము అంటున్న అప్పుల స్థాయికి, రిజర్వ్ బ్యాంకు చెప్తున్నదానికి పోలిక లేదు ఎందువల్ల అని అడిగినా జవాబు లేదు. చివరకు పలు సందర్భాల్లో చర్చలు, స్వయంగా రేవంత్ ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలు ఏమిటన్నది ప్రజలకు అర్థమైపోయింది. హామీలు గాని, వాటిని అమలు చేయకుండానే గాని, లేదా పాక్షికంగా మాత్రమే చేసిగాని, అంతా చేసినట్లు దబాయిస్తున్నారన్న మాట ప్రజలకు మొదటి ఆరు నెలలు గడిచిన తర్వాత నుంచి తెలిసివచ్చింది. ఆ విధంగా విశ్వసనీయత అంతర్థానమైంది.
సవాళ్లు, ఎదురుసవాళ్లు, ప్రతిపక్షబీఆర్ఎస్ సవాళ్లలో ఒక్కదానికైనా నిలవలేకపోవడం ఆ విధంగా మొదలైంది. ఉదాహరణలు కొద్దిగా చెప్పుకొందాం. రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేశామన్నది రేవంత్‌రెడ్డితోపాటు ఆయన మంత్రులు కొందరు బయటనే గాక అసెంబ్లీలోనూ పలుమార్లు చేసిన ప్రకటన, వాదన కూడా. దానిపై బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్‌రావులు వేర్వేరు సందర్భాల్లో ఆయన ఎదుటనే మాట్లాడుతూ సూటిగా సవాళ్లు విసిరారు.
రైతు రుణమాఫీ పూర్తిగా జరిగినట్లు మొత్తం రాష్ట్రంలో కాదు గదా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గాని, చివరకు ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గాని తేలినట్లయితే తను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అసలు రాజకీయాల నుంచే శాశ్వతంగా విరమించుకోగలనని కేటీఆర్ సవాల్ చేయగా, ముక్కు నేలకు రాయగలనని హరీశ్ అన్నారు. ఆయా సమయాల్లో సభలోనే ఉండిన ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందనలు వినిపించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత అనే ప్రశ్నపై కూడా చర్చల సవాళ్లకు ప్రభుత్వ పక్షం ముందుకురాలేదు. అదే విధంగా ఉద్యోగ నియామకాలు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఆరోపణలకు సంబంధించి కూడా ప్రజలకు ఇటువంటి పరిస్థితి కనిపించింది. ఉదాహరణకు కార్ రేస్ అంశం. విచారణలు, రుజువులు ఏమీ లేకుండానే కేటీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేయడం రేవంత్‌రెడ్డికి, తన మంత్రులకు, పార్టీ నాయకులకు ఒక అసమర్థపు క్రీడగా మారింది. ఈ కేసుపై తాను, ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి న్యాయమూర్తి సమక్షంలో గాని, మరెక్కడైనా గాని లైడిటెక్టర్ పరీక్షకు నిలవాలని, ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో ప్రజల దృష్టికి వెళ్లాలని, అందుకు సిద్ధమేనా అని కేటీఆర్ ప్రతీసారి సవాలు చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చ జరపాలని సైతం కోరారు. ఇందుకు కూడా అవతలి పక్షం నుంచి స్పందన లేదు. కాళేశ్వరం తదితర నీటిపారుదల పథకాలు, ఉద్యోగ నియామక సంఖ్యల విషయంలో కనిపిస్తున్నదీ అదే. రూ.90 వేల కోట్లతో నిర్మించిన పథకంలో లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసినప్పుడే ప్రజల దృష్టిలో తమ పరువుతో పాటు రాహుల్‌గాంధీ పరువు కూడా పోయింది.
మొదట చెప్పుకొన్నట్లు, వెనుకటి తరంతో పోల్చితే ఈ తరం నాయకుల విశ్వసనీయత, గౌరవ మర్యాదలు క్షీణిస్తున్నందున, వారు చేసే సవాళ్లకు కూడా ప్రజలు విలువ ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తగినంత విశ్వసనీయతను సంపాదించుకున్నందున దానితో పోల్చి చూస్తున్న ప్రజలు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్ల గాని, వ్యక్తిగతంగా ఆయన పట్ల గాని ఎటువంటి నమ్మకాన్ని చూపటం లేదు. రెండు వైపుల నుంచి తరచు వినవచ్చే సవాళ్లపైన ప్రజల నమ్మకం కూడా అందుకు అనుగుణంగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఎదుటిపక్షం సవాళ్లకు నిలవలేకపోవడమే గాక, స్వయంగా తాము విసిరే సవాళ్లపై చర్చలకు అయినా సిద్ధపడకపోవడం వారికి తమ వైఫల్యాలు, బలహీనతలు ఎటువంటివో బాగా తెలుసుననడానికి రుజువు అవుతున్నది. అధికారపక్షపు ఈ పరిస్థితి ప్రజలకు ఈ సరికి బాగా అర్థమైంది. అందుకే కావచ్చు ఈ సవాళ్లు, ప్రతిసవాళ్ల పట్ల మొదట కొంత ఆసక్తి చూపినవారు క్రమంగా పట్టించుకోవడం మానివేశారు. అది కూడా రేవంత్‌రెడ్డికి మేలే. ప్రజలు పట్టించుకుని చూస్తే తన కష్టాలు మరింత పెరుగుతాయి గనుక.
-టంకశాల అశోక్