కోడిని ఎదురుగా వేలాడదీసి అన్నం తినే సీన్ ఓ సినిమాలో ఉంటుంది. చికెన్ తింటున్న భావనతో భోజనం చేయాలనేది ఆ సినిమాలోని ఆలోచన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తున్నది. ఎంతోకాలంగా ఊరించి ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకొన్నది. ఒక డీఏ తక్షణమే అమల్లోకి వస్తే, మరొకటి వచ్చే ఏప్రిల్ నుంచి అమలుచేస్తారు. ఆ డీఏ గురించి నేడే ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడే క్యాబినెట్ మీటింగ్లో చర్చించి ఎందుకు ఆమోదించాలి? ఏప్రిల్ వరకు మళ్లీ క్యాబినెట్ సమావేశం జరుగదా? ఇది కేవలం ఉద్యోగులను మభ్యపెట్టడానికే అనేది స్పష్టం. ఈ ప్రకటన ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిదే.
‘మేం అధికారంలోకి వచ్చాక మా ప్రభుత్వం ఉద్యోగులను గుండెల్లో పెట్టుకుంటుంది. వారి సంక్షేమమే మా ధ్యేయం. ప్రభుత్వ రథచక్రాలు వారు. పెండింగ్ లో ఉన్న డీఏలు సకాలంలో చెల్లిస్తాం. పీఆర్సీ, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం’.. ఇది 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం. కానీ, అప్పటినుంచి కనీసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మాట్లాడటానికి కూడా ప్రభుత్వానికి తీరికలేదు. సమావేశం ఉందని ప్రకటించడం, వాయిదా వేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటించగానే ఓ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్టు, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటనలు విడుదల చేయడం షరా మామూలైంది. ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించిన ప్రతిసారి ‘మీకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నాం’ అంటూ మంత్రులు మాట్లాడుతారు. అంటే మొదటి తేదీన జీతం విడుదల చేయడాన్ని ఉద్యోగులు తమ అదృష్టంగా భావించాలా? అది తాము పనిచేసిన నెల రోజులకు ఇచ్చే భత్యం కాదా? దానిని ఒక వరంగా సంతోషపడి, ఇతర డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టకూడదా? ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉన్నది. దేశంలోనే ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ ఉంచిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే.
‘అసలు మిమ్మల్ని చర్చలకు పిలవడమే గొప్ప, తీపి కబురు’ అంటూ ఉప ముఖ్యమంత్రి సెలవిచ్చారు. అందులో అర్థం ఏమంటే.. ‘మీకు ఇంకేమీ ఇవ్వబోవడం లేద’ని. డీఏ పరిస్థితి ఈ విధంగా ఉంటే పీఆర్సీ ఒక ఎండమావిలా కనిపిస్తున్నది. మెరుగైన ఫిట్మెంట్ ఆశించి భంగపడటమే అవుతుంది. అదేమిటో అర్థం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి డబ్బులు ఇవ్వాలని ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది ఉండదు, ఒక్క ఉద్యోగుల విషయంలో తప్ప. మరి వాగ్దానాల వర్షం కురిపించిననాడు ఆర్థిక పరిస్థితి కనిపించలేదా? ఎక్కడి నుంచైనా నిధుల వరద వస్తుందని కాంగ్రెస్ పార్టీ కల కన్నదా? అనవసర వ్యయాలకు నిధులు మళ్లిస్తూ ప్రాధాన్యాంశాలను పక్కనపెడితే అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రభుత్వ పథకాలను రచించేది, రూపకల్పన చేసేది, అమలుపరిచేది, ప్రజల వద్దకు పోయి, వారికి వివరించి పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేది ప్రభుత్వ ఉద్యోగులే. వారి సంక్షేమాన్ని విస్మరిస్తే అది అనర్థాలకు దారితీస్తుంది. తియ్యటి మాటలతో కాదు, చేతలతో వారిని సంతృప్తిపరచాలి.
ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. వారికి రావలసిన బకాయిలు మాత్రమే కోరుతున్నారు. ఏడాది దాటినా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ విడుదల చేయకపోవడం దారుణం. సొంత ఇల్లు, కూతురి పెళ్లి లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నవారి ఆశలు అడియాశలయ్యాయి.
ఉద్యోగుల బకాయిల కోసం రూ.700 కోట్లు చొప్పున ప్రతి నెల విడుదల చేసేందుకు క్యాబినెట్ ఆమోదించింది. ఆ రకంగా 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు నెలవారీగా రూ.700 కోట్లు సర్దితే, భవిష్యత్తులో రిటైరయ్యే ఉద్యోగులు వారి బెనిఫిట్స్ ఎప్పుడు పొందుతారు? మెడికల్ బిల్లులు కూడా మంజూరు కాకపోవడంతో మూడు దశాబ్దాలకుపైగా సర్వీస్ చేసిన వారు నేడు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కునారిల్లుతున్నారు. వారు ప్రభుత్వం వంక ఆశగా ఎదురుచూస్తున్నారు. కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం రూపుదాల్చబోతున్నదట. ఈ పథకంలో ఉద్యోగులు ప్రతినెల రూ.500 చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమచేసి వారికి అత్యవసర వైద్యసేవలు, ఆరోగ్య బీమా సౌకర్యాలు అందించబోతున్నది. ఇందుకోసం ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానున్నది. ప్రభుత్వం ఎంత గొప్పగా చెప్పుకొన్నా పైవేవీ కొత్త విషయాలు కావు. కొత్తగా చేపట్టిన సంక్షేమ పథకం ఏమీ లేదు. డీఏ, పెన్షనర్ల బకాయిలు ప్రభుత్వం వద్ద ఏండ్లుగా పెండింగ్లో ఉన్నవే. ఆరోగ్య పథకం కూడా గత ప్రభుత్వమే రూపొందించింది. అంటే అప్పుడు విడుదలైన ఉత్తర్వులు ఇప్పుడు అమలు కాబోతున్నాయి. ఆర్భాటం కోసమే ఉద్యోగులకు తీపికబురు, వారిని ఉద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది.
‘నన్ను కోసుకొని తిన్నా రూపాయి రాదు. ఉద్యోగులారా.. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు ప్రజల మీదనా?’ అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను గాయపరిచింది. ఆ గాయానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక లేపనం పూసింది. ఇది బెల్లమెయ్యక బూరెలు చేయడమే తప్ప, ఉద్యోగులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కొన్ని నెలలుగా ఉద్యోగ వర్గాలను ఊరిస్తూ చివరికి ఒక డీఏతో సర్దుకోమని చేతులెత్తేశారు. ఒక డీఏ ప్రకటిస్తే ఉద్యోగులు వారి లెక్కల్లో వారు ఉంటారన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉన్నది. ఇక పీఆర్సీ, ఇతర సమస్యల ఊసే లేదు. అంటే ఉద్యోగులు మళ్లీ పోరాట పంథా ఎంచుకోవడమే వారి ముందున్న తక్షణ కర్తవ్యం.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కాలం నుంచి ఉద్యోగ వ్యతిరేక వైఖరి, వారి సమస్యల పట్ల సాచివేత ధోరణి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనుభవమే. కొత్త రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన మొదటి పీఆర్సీ, ఫిట్మెంట్ ఉద్యోగులను ఆనందంలో ముంచెత్తగా, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మాటల మూటలే తప్ప, అందులో అన్ని రిక్తహస్తాలే! ఇవన్నీ కంటితుడుపు చర్యలేనన్నది బహిరంగ రహస్యం.
-శ్రీశ్రీ కుమార్