తెలంగాణ తెలుగుని ఆంధ్రులు ఎలా పరిగణించాలో తెలియాలంటే భాషా సంపన్నత తెలంగాణలో ఎలా ఉండేదో తెలియాలి. 1887లో నిజాంపూర్ యూనివర్సిటీ కాలేజీగా (ప్రస్తుత నిజాం కాలేజీ) మీర్ మహబూబ్ అలీ ఖాన్ ద్వారా నవాబ్ ఫక్రుల్ఉల్ముల్క్ రాజభవనంలో ప్రారంభమైంది. అంటే అప్పటిదాకా అజ్ఞానంతో తెలంగాణలో ఉన్నత విద్యను తనే ప్రారంభించానని చెప్పే చంద్రబాబు పుట్టడానికి 63 ఏండ్ల ముందు అన్నమాట.
చరిత్ర, సంస్కృతి లాగానే ఈ రెండు ప్రాంతాల భాషలు వేరు. ‘ఆడపిల్లని తోలుకోస్తాం‘ అంటే ఆంధ్ర వాళ్లు నవ్వుతారు. ‘పశువులను తోలుకొస్తారు గానీ మనుషులనా?’ అని. ‘మరి మీరేమంటారు?’ అంటే, ‘మేం మా పిల్లని తీసుకొస్తాం’ అంటారు. ఆ మాట తెలంగాణ వారి మనసును కలచివేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పీనుగునే తీసుకొస్తారు, బతికి ఉన్న వాళ్లకు ఆ పదం వాడరు. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు అడుగుతాడు చూడండి.. ‘వచ్చాడా, తీసుకొచ్చావా’ అని. అట్లాగే అన్నమాట!
అనతి కాలంలోనే గొప్ప విద్యాసంస్థగా పేరు తెచ్చుకున్న ఈ కాలేజీ దాదాపు 60 సంవత్సరాలు మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండింది. 1924లో అంటే చంద్రబాబు పుట్టడానికి 26 ఏండ్ల ముందు స్థాపించబడిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాల అయింది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలంగాణలో వివిధ భాషలవారు ఉన్నందున చాలా కోర్సులు డిగ్రీ స్థాయిలో ఆయా మాతృభాషల్లో అందాయి. 1883 దాకా అధికార భాషగా పర్షియన్ ఉండింది. ప్రజలు ఆ భాషను కూడా నేర్చుకునేవారు. సాలార్జంగ్-1 ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదివిన కొందరు నిజాం రాష్ర్టానికి చిన్న ఉద్యోగాలకు వచ్చారు. వారు అధికార భాషగా ఉర్దూని చేయమని కోరగా, సాలార్జంగ్-1 ఒప్పుకోలేదు. ‘మా దేశంలో ఉండాలనుకుంటే మా భాష నేర్చుకోండి. లేకపోతే ఉర్దూ ఉన్నచోట ఉద్యోగాలు చేసుకోండి‘ అని నిష్కర్షగా చెప్పాడు. అయితే ఆయన 1883లో మరణించాకనే అధికార భాష ఉర్దూ అయింది. ఇండియాని కూడా కలుపుకొని ఈ నేల మీద స్థానిక భాష మాధ్యమం ఉర్దూ ఉపయోగించిన మొట్ట మొదటి విద్యాసంస్థ ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అధికార భాషతో పాటు రెండు, మూడు స్థానిక భాషలు వచ్చేవి.
అయితే 1956 నుంచి ఆంధ్ర రాజకీయ నాయకుల పెత్తనం మొదలయ్యాక తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను దూరప్రాంతాలకు బదిలీలు చేసి హైదరాబాద్‌లోనూ, ఇతర పట్టణ ప్రాంతాల్లోనూ ఆంధ్ర నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్న ఉపాధ్యాయులను నియమించారు. వాళ్లు గతిలేక వచ్చి, ఇక్కడి విద్యార్థులను ‘మీకు తెలుగు రాదు, చదవరాదు‘ అని హేళన చేసి చిన్నచూపు చూసేవారు. వరంగల్ వంటి పట్టణాల్లో కోపోద్రిక్తులైన విద్యార్థులు ఇంగ్లీషులోనూ, ఉర్దూలోనూ ఉపాధ్యాయులకు సమాధానాలు చెప్పి, వారిని ఇరుకునపెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రులకు అప్పట్లో టూటా ఫూటా ఇంగ్లీషే వచ్చేది. మొత్తానికి ఇక్కడి సాహిత్య సంపద, గొప్ప కవి పండితుల గురించి పూర్తి అజ్ఞానంలో ఉన్న ఆంధ్ర ఉపాధ్యాయులు, ఉద్యోగులు స్థానికులు మాట్లాడే తెలుగుని హేళన చేసేవారు. వారు మాట్లాడే ఆంధ్ర భాష ఉత్తమమైనదని గప్పాలు కొట్టేవారు. ఇట్లా వలస పక్షులు వాగుతుంటే కోపం వచ్చిన సురవరం ప్రతాపరెడ్డి.. తెలంగాణ కవులు రాసిన 354 కవితలతో మొట్టమొదటి ‘గోలకొండ పత్రిక’ సంపుటం వెలువరించారు. వారు పత్రికా సంపాదకులు, పరిశోధకులు, పండితులు, రచయిత, ఇంకా క్రియాశీల ఉద్యమకారులు కూడా. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పారసీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు. అయితే ఇదంతా ఆంధ్ర రాజకీయ నాయకులు తమ సభల కోసం తెలంగాణ ప్రాంతానికి వచ్చి, ఇక్కడి తెలుగువారిని అవమానించినప్పుడు జరిగింది. తర్వాత ఆంధ్ర రాజకీయ నాయకుల దుర్మార్గాలు చూడకుండానే 1953 ఆగస్టులో మరణించిన అదృష్టవంతుడు సురవరం.
వేరే భాషల వారందరూ తెలంగాణ సంస్కృతిలో ఇమిడిపోయి, ఇక్కడి తెలుగు నేర్చుకోగా; తెలుగు, ఆంధ్రం ఒక్కటేనని అబద్ధాలతో నెహ్రూని నమ్మించి ఉమ్మడి రాష్ట్రం సాధించిన ఆంధ్రవారు మాత్రం వారి స్వార్థపూరిత వ్యక్తిత్వం, ఆధిక్యతాభావం, తమ ప్రజల పట్ల ఎలా ఉదాసీనత వహించారో, అలాగే తెలంగాణ ప్రజలను వంచించి వారి భాషను, సంస్కృతిని అవమానించి ఇక్కడ ఇమడలేకపోయారు.
తెలంగాణ, ఆంధ్ర ఎంత వ్యతిరేకమైన సంస్కృతి, భాష కలిగి ఉన్నాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం. సుమారు ఆరు దశాబ్దాలు కలిసి ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య భావసమైక్యత ఏర్పడనే లేదు. చిన్న చిన్న భాషా ప్రయోగాల్లో కూడా నిప్పు పుట్టేది. ఒకసారి అసెంబ్లీ సెషన్ జరుగుతుండగా, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి విపక్ష నేత చంద్రబాబును ‘తాట వలుస్తా’ అని అన్నాడు. ఇద్దరూ రాయలసీమ వాళ్లు, ఆ మాట సీమలో తరచూ వాడతారు కాబట్టి, చంద్రబాబు భయపడలేదు. ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆ మాట తప్పనిపించలేదు. అదే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు జనాంతికంగా ‘నాలుక కోస్త్తారు’ అనగానే హాహాకారాలు! ఎందుకంటే ఆ మాట వారు వాడరు కాబట్టి. కానీ, తెలంగాణలో దాన్ని ఊతపదంలా వాడతారు. నిష్పాక్షికంగా ఆలోచిస్తే తాట వలవడం కంటే నాలుక కోస్తే తక్కువ ప్రమాదకరం. కానీ, అది వారి భాష కాదు కాబట్టి ఆ కలవరం! చరిత్ర, సంస్కృతి లాగానే ఈ రెండు ప్రాంతాల భాషలు వేరు. ‘ఆడపిల్లని తోలుకోస్తాం‘ అంటే ఆంధ్ర వాళ్లు నవ్వుతారు. ‘పశువులను తోలుకొస్తారు గానీ మనుషులనా?’ అని. ‘మరి మీరేమంటారు?’ అంటే, ‘మేం మా పిల్లని తీసుకొస్తాం’ అంటారు. ఆ మాట తెలంగాణ వారి మనసును కలచివేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో పీనుగునే తీసుకొస్తారు, బతికి ఉన్న వాళ్లకు ఆ పదం వాడరు. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు అడుగుతాడు చూడండి.. ‘వచ్చాడా, తీసుకొచ్చావా’ అని. అట్లాగే అన్నమాట!
తెలంగాణ మారుమూల పల్లెలు, స్థలాలు కబ్జా చేయడం ఆంధ్రవారికి తేలికే గానీ, కడప నుంచో, శ్రీకాకుళం నుంచో వెళ్లిన వాళ్లకి ఆదిలాబాద్ మారుమూల తండా వారి భాష గాని, ఇతర తెలంగాణ ప్రాంతంలోని స్వచ్ఛమైన, లలితమైన తెలుగును గాని అర్థం చేసుకోవడం మాత్రం సాధ్యం కాదు.
ఇంగ్లీష్, కొన్ని యూరోపియన్ భాషలలాగా అక్షరమాల ఒక్కటైనంత మాత్రాన తెలుగు, ఆంధ్రం ఒక్కటి కాదు. తెలుగు అన్న పదాన్ని కవి సుందరాచారి లాలిత్యం కోసం తన ‘తెలుగు తల్లి’ పాటలో వాడితే, రాజకీయ మోసంతో ఎన్టీ రామారావు తన పార్టీకి ఆ పేరు పెట్టాడు. నిజానికి అది ఆంధ్ర దేశం పార్టీ, ఆ తర్వాత కుప్పం నాయకుడి పార్టీ. ఆ పార్టీకి, తెలంగాణకు ఏం సంబంధం లేదు. నిజమైన తెలుగువారు తెలుగుదేశం పార్టీకి చెందరు. దానికి చెందే తెలంగాణ వారుంటే వారు మాతృ ద్రోహులు! నిజానికి ఎదుటివాడి సంస్కృతిని, భాషను గౌరవించాలంటే వారికి తమకు చెందే వాటి మీద గౌరవం ఉండాలి. ఆంధ్ర వారికి నచ్చే కళలు మిమిక్రీ, సినిమా రికార్డింగ్ డాన్స్‌లు. తెలంగాణ జానపద గీతాల్లోని లాలిత్యం, భావసంపన్నత వారికి అర్థం కావు. ఆంధ్ర వారి తెలుగు మీద ప్రజాకవి కాళోజీ చక్కటి ఛలోక్తులు విసిరేవారు.
“హైదరాబాద్‌లో ఒక ముస్లిం గనుక ‘దఫ్తర్కెళ్లి దరఖాస్త్ దాఖల్ చేశాను’ అంటే నవ్వే ఆంధ్రుడు.. ‘ఆఫీస్‌కి వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేశాను’ అంటాడు. అది తెలుగే వాళ్లకి” అని అనేవారు. ఆంధ్ర వారి ఆధిపత్య ధోరణి గురించి ఇలా అనేవారు. ‘ఇప్పుడు హైదరాబాద్ సడక్ మీద చాయ్ ఉబాలడం ఆగిపోయింది. హైడ్రాబాడ్ రోడ్ మీద టీ బాయిల్ అవుతోంది’ అని. వచ్చిన కొత్తలో కొందరు ఆంధ్ర వాళ్లు ‘హైడ్రాబాడ్’ అనేవారు. ఇప్పుడు బాడ్ మనుషులు హైడ్రాను ఉపయోగిస్తున్నారు.
2014 దాకా వారి చెత్త ఆంధ్ర సినిమాల్లో రౌడీలకు, గూండాలకు తెలంగాణ భాష వాడి నిజమైన తెలుగును అవమానించేవారు సినిమారంగ ప్రబుద్ధులు. ఆత్మగౌరవం ఉన్న వాడెవడూ ఇతరులను అవమానించడు. ఆత్మన్యూనతాభావం ఉన్నవాడు ఇతరులను అవమానించడం ద్వారా తాను గొప్పవాడని నిరూపించుకుంటున్నానని అనుకుంటాడు. కానీ, అది తన తక్కువ బుద్ధిని బయటపడేస్తుందని గ్రహించడు. ఇంకో రకం వాడు తను గొప్పవాడని నిరూపించుకోవాలని తను చెయ్యనివి, ఇతరులు చేసినవి కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. ఎవరో గుర్తొస్తున్నారు కదా! మీరు ఊహించింది కరెక్టే, సరిగ్గానే పోల్చుకున్నారు. ఈ రెండు రకాల ప్రజలతో తెలంగాణ వాళ్లు విసిగిపోయారు. ఇంక చాలు!
-కనకదుర్గ దంటు
89772 43484