తెలంగాణ నలుదిక్కులు కదనరంగాలై కలిసి నడిచిన రోజు. ఒక బక్క పలుచని మట్టి మనిషి ‘జై తెలంగాణ’ నినాదాన్ని తన గుండెల నిండా నింపుకొని, తెలంగాణ మట్టి బిడ్డల 60 ఏండ్ల గోసను ఒడిసి పట్టుకొని ఢిల్లీ గద్దెలు భీతిల్లిపోయేలా గర్జించిన రోజు, తన చావుతో తెలంగాణ గడ్డకు విముక్తి లభించాలని దృఢ సంకల్పంతో దీక్ష పూనిన రోజు ఇదే కదా.. ఇదే నవంబర్ 29. ఇది ఒక తారీకు మాత్రమే కాదు, చరిత్రకు సాక్షిగా నిలబడిన తారీకు. ఏండ్ల నాటి తండ్లాటకు పునాది వేసుకున్న రోజు. అడుగడుగునా ఆధిపత్య అవమానాల భారంతో అరిగోసపడే తెలంగాణ బిడ్డల ఆర్తనాదాలను ఆకళింపు చేసుకొని అస్తిత్వ ఉద్యమ వారసుడిగా, నిటారుగా నిలబడి ప్రభుత్వాల బెదిరింపులను తుత్తునియలు చేస్తూ తెలంగాణ లోకాన్ని అంతా ఒక తాటిపై నిలబడేలా చేసిన మన కేసీఆర్ దీక్షబూనిన రోజు నవంబర్ 29.
తెలంగాణకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలలో దోపిడీ జరుగుతున్నది. ఈ దోపిడీ పీడనల నుంచి తెలంగాణ సమాజాన్ని విముక్తం చేస్తానంటూ, సీమాంధ్ర కుట్రలకు తలొగ్గేది లేదంటు గళమెత్తి చావు నోట్లో తలపెట్టి ధైర్యంగా ముందుకు కదిలి తెలంగాణ చరిత్రకు పురుడు పోసింది కేసీఆర్. ఆయన వారసత్వపు బాటలో వెల్లువలా నాటి యూనివర్సిటీ విద్యార్థిలోకం ఉద్యమ స్ఫూర్తిని ఒడిసి పట్టినట్టుగానే కేయూలో ఉద్యమ బీజాలను ప్రసస్తి చేయడంలో కీలక పాత్రను పోషించే అవకాశం నా లాంటి విద్యార్థి నాయకులకు దక్కింది.
స్వరాష్ట్ర పోరులో స్వయంగా పాల్గొన్న విద్యా ర్థి ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాట చరిత్రను నేటి యువతకు చెప్పవలసిన బాధ్యత ఉన్నదని నేను భావిస్తున్నా. మనకాలపు చరిత్రను మనమే చెప్పకుంటే దొంగలు, ద్రోహులు చెప్పిందే నిజమైన చరిత్రగా భావించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న వారెవరూ నాడు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేయలేదు. ఆంధ్రా పాలకుల కుట్రలను తట్టుకొని కలబడి, నిలబడిన నికార్సయిన తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ ఒక్కరే. నాడు కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని తీసుకున్న నిర్ణయానికి మొదటగా కేయూ వేదికైంది.
కేసీఆర్ అల్గునూరు చౌరస్తాలో అరెస్టయి, వరంగల్ మీదుగా ఖమ్మం జైలుకు తరలిస్తుండగా నాడు కేయూ విద్యార్థి లోకం మొత్తం వర్సిటీ రెండో గేటు దగ్గర కేసీఆర్ అరెస్టును నిరసిస్తూ కాన్వాయ్కి అడ్డంగా వెళ్లి ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ అంటూ పోలీస్ కాన్వాయ్‌ని అడ్డుకోవడం ఇప్పటికీ నా కండ్ల ముందు కదలాడుతున్నది. ఆ తదనంతర పరిణామాలు రాష్ర్టాన్ని అగ్నిగుండంలా మార్చాయి. కేసీఆర్ అకుంఠిత దీక్షతో 11 రోజులు చావుకు సైతం సిద్ధపడి ‘ తెలంగాణ జైత్రయాత్రో.. లేకుంటే నా శవయాత్రో’ అంటూ పూనిన ప్రతిజ్ఞతో తెలంగాణ ప్రకటన తప్ప కేంద్రానికి వేరే గత్యంతరం లేకుండాపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు. డిసెంబర్ 9 లేకుంటే, జూన్ 2 లేదనేది కఠోర సత్యం.
నవంబర్ 29 చారిత్రక ఘట్టాలను గుర్తుచేసే రోజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ చేసిన ‘దీక్షా దివస్’ ఒక మైలురాయి. ఈ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి మరో మారు ఉద్యమ శంఖారావాన్ని పూరించే అవసరమైతే ఉన్నది. జై తెలంగాణ.
– (వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి 95530 86666