ఈ నెల 23న దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 26 లక్షల విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు ‘చలో ఢిల్లీ- సేవ్ పవర్ సెక్టర్-సేవ్ ఇండియా’ (ఢిల్లీ వెళ్దాం- విద్యుత్ సంస్థలను, దేశాన్ని కాపాడుకుందాం) నినాదంతో ‘నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్’ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ రాష్ట్రంపై దండయాత్రకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కింద పేర్కొన్న ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా సమ్మె చేసి వందలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ యావత్ జాతికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత రైతుల డిమాండ్ మేరకు వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రధాన భాగస్వామ్యపక్షాలతో చర్చించిన మీదటే ముందుకెళ్తామని రాతపూర్వకంగా ‘సంయుక్త కిసాన్ మోర్చా’కు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది రైతులు, పేద ప్రజలు, విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టడమే కదా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పరిచిన ప్రణాళికా సంఘం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల ప్రధాన లక్ష్యం దేశంలోని అన్నివర్గాల ప్రజల ఇండ్లలో వెలుగులు నింపడమే కదా? భారత రాష్ట్రపతి స్వగ్రామానికి 2022లో కరెంటు ఇచ్చిన పాలకులు, కోట్లాదిమందికి కరెంటు అనే కనీస అవసరం తీర్చకుండానే విద్యుత్తు సంస్థలను, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్మివేయపూనుకోవడం అమానవీయమే కాదు, కుట్ర కూడా.
దేశం మొత్తమ్మీద 400 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్నది. దేశ అవసరాలకు 215 గిగావాట్లు సరిపోతుంది. కానీ ఇప్పటికీ రైతులకు అరకొర విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అదీ డిమాండ్ లేని సమయాల్లో ఇవ్వడం జరుగుతున్నది. అత్యధిక జనాభా కలిగిన యూపీలో 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం కూడా 62 లక్షలకు పైగా కుటుంబాలు కరెంటు బుగ్గలకు నోచుకోకపోవడం దేనికి సంకేతం? ఎవరి వైఫల్యం?
తెలంగాణ లాంటి నూతన రాష్ట్రం 27 లక్షల వ్యవసాయ పంపుసెట్లు కలిగి ఉన్న రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తుంటే, ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్లో 4 నుంచి 7 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. అది కూడా మీటర్లు పెట్టి మరీ విడతలవారీగా ఇస్తున్నారు. ఇది వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఇంకా 75 లక్షల మంది రైతులు డీజిల్ ద్వారా పంపుసెట్లను నడిపి పంటలు పండిస్తున్న దౌర్భాగ్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? పేద ప్రజలకు, రైతులకు అవసరమైనంత కరెంటు అందించే యజ్ఞం ఏడున్నర దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయి ఉండగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అందినకాడికి విద్యుత్ సంస్థలను దోచిపెడుతున్నా రు. ఇప్పటికే ప్రైవేటీకరించిన ముంబయి, చండీగఢ్, లక్నో, ఒడిషా తదితర చోట్ల ప్రజలకు, విద్యుత్ వినియోగదారులకు ఒనగూడిన లాభాలేమిటో చెప్పి ప్రైవేటీకరణ ముందుకువెళ్లాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. ప్రైవేటీకరించిన ముంబయిలో యూని ట్ రేటు రూ.12 వరకు ఉన్నది. వందల కోట్ల రూపాయల లాభాలతో దేశంలోనే అతి తక్కువ ధరకు విద్యుత్ సరఫరా గావిస్తున్న ఛండీగఢ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలను నామమాత్రపు బుక్ వాల్యూకే ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం దేనిని సూచిస్తున్నది?
పుదుచ్చేరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అమ్మివేయడానికి అక్టోబర్‌లో ఓపెన్ టెండర్లు పిలిచారు. విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉండగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మె చేశారు. వారం పాటు కొనసాగిన ఈ సమ్మె దెబ్బకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నివాసంలో, ఆఫీసులో చీకట్లు కమ్ముకున్నాయి. కరెంటు కోతలతో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. సెల్ఫోన్ల వెలుతురులో ముఖ్యమంత్రి తన కార్యాలయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి టెండర్‌ను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల సందర్భంగా విద్యుత్ సవరణ బిల్లుకు వ్యక్తిగతంగా తాను కూడా వ్యతిరేకమని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు విధిలేని పరిస్థితుల్లో టెండర్లను పిలిచినట్లు చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ గత అసెంబ్లీ సమావేశంలో స్వల్పకాలిక చర్చను చేయడమే కాకుండా బిల్లును ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసి పంపింది. రైతులకు, పేద ప్రజలకు, ఉద్యోగులకు శాపంగా పరిణమించనున్న విద్యుత్ సవరణ బిల్లును ఏకపక్షంగా తిరస్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు ప్రజలు, ఉద్యోగ సంఘాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఏ దేశ ప్రగతికైనా కొలమానం ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం. మన దేశ తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1255 యూనిట్లు ఉండగా, ఎనిమిదేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణలో మాత్రం 2126 యూనిట్లుగా ఉండటం ఈ రాష్ట్రం సాధించిన అభివృద్ధికి సూచిక కాదా? అత్యల్ప తలసరి విద్యుత్ వినియోగం బీహార్, యూపీ లాంటి రాష్ర్టాల్లో ఉండటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? తెలంగాణలో పారిశ్రామిక, గృహ, వాణిజ్య, వ్యవసాయ ఇలా ప్రతీ వర్గానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ను అందివ్వడం చూడలేని కేంద్ర ప్రభుత్వం ఇక్కడి విద్యుత్ సంస్థలపై ముప్పేట దాడి చేస్తున్నది. ఇప్పటికే పనులు పూర్తికావస్తున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రుణాలను నిలిపివేయడం, కారణాలు లేకుండా కక్షసాధింపుతో ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్సేంజీ నుంచి విద్యుత్ క్రయవిక్రయాలు జరుపకుండా ఆంక్షలు విధించడం, థర్మల్ కేంద్రాలు తప్పనిసరిగా విదేశీ బొగ్గును వాడాలనే నిబంధనలు విధించడం, ఎలాగైనా సరే విద్యుత్ సరఫరాల్లో అంతరాయాలు కలిగించే ప్రయత్నాలు ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం అవలంబించాల్సిన పద్ధతులు కావు.
ఇప్పటికైనా కేంద్రం దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్ సంస్థలకు చేయూతనందించాలి. లేనిపక్షంలో భవిష్యత్‌లో తెలంగాణ సమాజం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.
(వ్యాసకర్త: అధ్యక్షులు, టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్)
-తుల్జారాంసింగ్ ఠాకూర్
78930 05313