తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించనున్న మటన్ క్యాంటీన్ (మాంసం మార్కెట్లు)లను ఆరె కటికలకు కేటాయించాలి.ఆరె కటికెలు వెనుకబడిన కులాల (బీసీ) జాబితాలో డీ గ్రూప్ క్రమసంఖ్య 2 లో ఉన్నారు. ఆరె కటికల ప్రధానమైన వృత్తి మాంసం విక్రయించడం.
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరం గా, సామాజికంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులాలలో మరింత వెనుకబడిన కులం ఆరె కటికలది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 15-20 లక్షల మంది ఆరె కటికలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు కావస్తున్నా ఆరె కటికలకు చట్ట సభలలో (శాసనసభ, శాసనమండలి, పార్లమెంటులలో ) ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఆరె కటికలను రాజకీయ పార్టీలు కార్యకర్తలు గానే చూస్తున్నారు తప్ప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం లేదు.
ఆరె కటికల వృత్తులు మాంసం విక్రయించడం, ప్రభుత్వ సారాయి అమ్మడం. సారాయి నిషేధించబడి మద్యం దుకాణాలు (వైన్స్) వచ్చిన తర్వాత వైన్స్ వేలం పాటల్లో లక్షల్లో డబ్బులు కట్టలేక మద్యం దుకాణాలకు ఆరెకటికలు దూరమయ్యారు.
ఆరె కటికలకు కురుమ, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు మేకలను పెంచి పోషించి అమ్మేవారు. రానురాను అందరూ మాంసం విక్రయించడం నేర్చుకున్నారు. మేక, గొర్రె, పొట్టేలు కోయడానికి కబేళాలు వచ్చాయి. జంటనగరాలలో జియాగూడ, గౌలిపురా, బోయిగూడ (సికింద్రాబాద్) కాచిగూడలో కబేళాలు ఉన్నాయి. అలాగే నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ ఇంకా అనేక ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో కబేళాలు ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం కాలుష్యం పెరుగుతుందనే నెపంతో జంటనగరాలలోని కబేళాలను మూతబెడితే అనేకమంది ఆరె కటికెలు రోడ్డున పడ్డారు. తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరిగి వాటికి అనుమతి ఇచ్చారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఆరె కటికెలు కబేళాలలో మాంసాన్ని కొనుగోలు చేయటం, విక్రయించడం చేస్తున్నారు. దానివల్ల వారికి పెద్దగా ఆదాయం రావడం లేదు. మిగతా కులాల వారు అవసరమైన వారి ఇంటి ముందే కోసి అమ్మడం వలన ఎక్కువ లాభాలు అర్జిస్తున్నారు. ఉత్తరాదిన 18 రాష్ర్టాలలో ఆరె కటికెలు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాలలో వెనుకబడిన కులాల (బీసీ) జాబితాలో ఉన్నారు. ఒకే దేశం, ఒకే రాజ్యాం గం ఉన్నప్పుడు ఒకే రిజర్వేషన్ వర్తింపజేయాలని ఆరె కటికలు కోరుతున్నారు. ఆరె కటికలను వెనుకబడిన కులాల నుంచి ఎస్సీ జాబితాలోకి మార్చాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది. చాకలి,మంగలి వారికి ఉచిత విద్యుత్, గౌడ కులస్తులకు పింఛన్లు, చెట్టుపై నుంచి పడిపోతే ఎక్స్గ్రేషియా, రైతుల కు రైతు బంధు, రైతుబీమా మొదలైన అనేక పథకాలను అమలు చేస్తున్నది. తరతరాలుగా మాంసం అమ్మకమే ప్రధానమైన వృత్తిగా బతికిన ఆరె కటికలకు కూడా అవసరమైన పథకాలను వర్తింప జేయాలి. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మటన్ క్యాంటిన్ (మాం సం మార్కెట్లు)లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆరె కటికలు బజారున పడకుండా ఆ మటన్ క్యాంటిన్లను ఆరె కటికలకు కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆరె కటికల జనాభా ఎక్కువగా ఉం టుంది. కనుక వారి అభివృద్ధికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలి.
(వ్యాసకర్త : అఖిల భారత కటిక్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-డాక్టర్. ఎస్.విజయ భాస్కర్
92908 26988