ఉద్యమ నాయకుడు, రాష్ట్ర నిర్మాతను కాదని అనుభవమే లేని నేతకు తెలంగాణ ప్రజలు అధికారాన్ని అప్పగించారు.
బీఆర్ఎస్ అమలు చేస్తున్న వాటి కంటే కాంగ్రెస్ ఇంకా ఎక్కువ చేస్తుందని ప్రజలు భావించడమే అందుకు కారణం.
అయితే, కొత్త పథకాలు కనిపించకపోగా, ఉన్నవి కూడా కనుమరుగవుతుంటే కలిగే నిరాశ అంతాయింతా కాదు.
ప్రజాస్వామ్యయుత పాలన లేకపోతే పురోగతి అన్నదే ఉండదు. అందుకే కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఏముందిలే గర్వకారణం? అన్న అభిప్రాయమే వినిపిస్తున్నది. ఏడాదిలోనే యాష్టకు వచ్చిందని అనేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
భూమి అంటే తెలంగాణ రైతులకు ప్రాణం కన్నా ఎక్కువ. అదొక వారసత్వ సంపద, బాధ్యత కూడా. పిల్లలకు ఏమిచ్చినా ఇవ్వకున్నా గుంట స్థలమైనా వారి చేతిలో పెట్టాలన్న పట్టుదల అందరికీ ఉంటుంది. అందుకే పైసాపైసా కూడబెట్టి ఎంతో కొంత పొలం కొనాలని చూస్తారు. తమ జీవనాధారమైన భూమిని బలవంతంగా గుంజుకో వాలని చూస్తే వారు ఊరుకుంటారా? అసలు భూ సేకరణ చేయాల్సిన పద్ధతి ఇదేనా? రైతుల సమ్మతి లేకుండా భూములను చెరబట్టాలని చూస్తే చరిత్ర పునరావృతమవుతుంది. ఉమ్మడి ఏపీలో ఎన్నోసార్లు అదే జరిగింది. భూసేకరణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఎన్నెన్నో సంఘటనలు ఉదాహరణగా ఉన్నాయి. అదీ గిరిజనుల భూములను తీసుకునేటప్పుడు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలో చెప్పాల్సిన పనిలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలోనే ఈ చరిత్రను విస్మరించారు. సుదూరప్రాంతాలకు వలస వెళ్లి, కూడబెట్టిన సొమ్ముతో కాస్త పొలం కొనుక్కుంటే.. దాన్ని కూడా పరిశ్రమల కోసం సేకరిస్తామంటే కడుపు మండదా? ఎంతోకొంత పరిహారం ఇస్తామంటే సరిపోతుందా? పరిశ్రమకు కావాల్సిన అన్ని పరికరాలను మార్కెట్ ధరకు కొనుగోలు చేస్తారు. మరి కీలకమైన భూమికి మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరను చెల్లిస్తారు. భూ యజమానుల అభిప్రాయాలకు చోటే లేదా? ఇదెక్కడి న్యాయం? పరిశ్రమలకు ఉండే లాభాపేక్ష రైతులకు ఉండదా? అసలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం ఎందుకు భూమి సేకరించి ఇవ్వాలి? వ్యవసాయం ఉపాధి మార్గం కాదా? వాస్తవానికి, సమస్య ఉన్న చోటే సమాధానమూ దొరుకుతుంది. పరిశ్రమను ఎందుకు పెడుతున్నామో రైతులకు ముందుగా చెప్పి ఉంటే సమస్యే ఉండేది కాదు. కానీ, ప్రభుత్వం అలా చేయలేదు.
తాజాగా రాష్ట్రంలో నడుస్తున్న మరో వివాదం మూసీ సుందరీకరణ. పోనీ ప్రభుత్వం చెప్పినట్టుగా పునరుజ్జీవమే అనుకున్నా.. దానికి ప్రాతిపదిక ఏమిటి? దానిపై మొదట ఏదైనా శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశారా? అంటే ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. మరి పాలకుల అసలు ఉద్దేశం ఏమిటి? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఆక్రమణలంటూ ఇళ్లను కూల్చివేస్తుండటం విచారకరం.
మూసీ చుట్టుపక్కల ఇళ్లు కట్టకున్నవారెవరూ కబ్జాదారులు కాదు. అవన్ని సొమ్ము చెల్లించి కొనుక్కున్న స్థలాలే. ప్రభుత్వ అధికారులు కూడా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒకప్పుడు అప్పటి అధికారులు అనుమతులు ఇచ్చిన ఇళ్లను ఇప్పటి అధికారులు అక్రమ ఇళ్లుగా ముద్రవేసి కూల్చివేస్తుండడంతో పాలనా వ్యవస్థపైనే ప్రజలకు అనుమానం వస్తున్నది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా మల్లన్న సాగర్ నుంచి మంచినీరు తెచ్చి నదిలో నింపుతారట. కాళేశ్వరం మహా ప్రాజెక్టులో చివరి భాగమే మల్లన్న సాగర్. హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం కోసం మల్లన్నసాగర్‌ను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. ఆ ప్రాజెక్టే ఇప్పుడు మూసీకి వరంగా మారింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందంటూ చేసిన విషప్రచారంలో వాస్తవమెంత? అన్నదానిపై కాంగ్రెస్ నేతలే ఇప్పుడు సమాధానం చెప్పాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన కూడా వివాదాస్పదం అయింది. దానిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇది సాక్షాత్తూ రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టదలచిన ప్రాజెక్టు. వచ్చే ఏడాది చేపట్టనున్న జాతీయ స్థాయి జనాభా లెక్కలపై ప్రభావం చూపేది కూడా. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాల్సిన ఈ కార్యక్రమం ఆదిలోనే విమర్శలపాలైంది. తగిన కసరత్తు చేయకుండానే కాంగ్రెస్ సర్కార్ దీనిపై ముందుకెళ్లింది. కులగణన అంటే కులం వివరాలు మాత్రమే అడుగుతారని అంద రూ అనుకున్నారు. నిజానికి ఇది సామాజిక-ఆర్థిక సర్వే. కులంతో పాటు ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా అడిగి తెలుసుకుంటారు. ఆ వివరాలు తెలిస్తేనే సదరు సామాజికవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందో ప్రభుత్వానికి తెలుస్తుంది. అయితే, ఈ విషయమై కనీసం అవగాహన కలిగించలేదు. విధివిధానాల రూపకల్పన, సర్వేలో ఏయే అంశాలు సేకరించాలనే విషయంపై అభిప్రాయాలు సేకరించలేదు. వాటిని రూపొందించిన తర్వాత అయినా ప్రజాభిప్రాయం తీసుకోలేదు. సోషల్ మీడియా యుగంలో ఈ విషయాన్ని విస్మరించడం ప్రభుత్వం చేసిన తప్పిదం. అందుకే, సర్వేకు వెళ్తున్న అధికారులకు సమాధానాలు చెప్పకుండా ప్రజలే వారిని ప్రశ్నిస్తు న్నారు. అది జరగకపోవడం వల్లనే తొలిరోజు నుంచే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది.
భూసేకరణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేందుకు ఎన్నెన్నో సంఘటనలు ఉదాహరణగా ఉన్నాయి. అదీ గిరిజనుల భూములను తీసుకునేటప్పుడు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలో చెప్పాల్సిన పనిలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలోనే ఈ చరిత్రను విస్మరించారు. సుదూరప్రాంతాలకు వలస వెళ్లి, కూడబెట్టిన సొమ్ముతో కాస్త పొలం కొనుక్కుంటే.. దాన్ని కూడా పరిశ్రమల కోసం సేకరిస్తామంటే కడుపు మండదా?
ప్రజల్లో వ్యతిరేకతకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. తమను మధుర లంబాడీలుగా గుర్తించాల్సి ఉండగా కేవలం మధుర అని నమోదు చేస్తుండటం పట్ల ఆదిలాబాద్ జిల్లాలో ఓ సదరు సామాజికవర్గం ప్రజలు ఎన్యూమరేటర్లకు సహకరించడం లేదు. సర్వే ప్రతుల్లో విశ్వబ్రాహ్మణ అన్న మాట లేకపోవడం పట్లా అభ్యంతరాలు వస్తున్నాయి. పంచ శిల్పులను విశ్వబ్రాహ్మణులుగా గుర్తించాల్సి ఉన్నా అలా చేయడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సామాజిక-ఆర్థిక సర్వేకు ప్రజలందరూ సహకరించారు. ప్రజల గోప్యతకు భంగం కలగకుండా అవసరమైన వివరాలే తీసుకుని, పథకాలను రూపొందించి అమల్లోకి తెచ్చింది బీఆర్ఎస్ సర్కార్.
పథకాల విషయానికి వస్తే మునుపటి ప్రభుత్వం కన్నా మెరుగ్గా ఉంటాయని ప్రజలు ఆశించారు. కానీ, ముందునుంచీ అమల్లో ఉన్న ఫథకాలనే కాంగ్రెస్ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదు. అలా చేస్తే ప్రజల్లో అసంతృప్తి కలగకుండా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పథకాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రైతుబంధు గురించి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా రైతుబంధు ఇవ్వలేదు. గత యాసంగికి ఇచ్చిన రైతుబంధు నిధులను కేసీఆర్ సర్కారే సమకూర్చి పెట్టింది. రుణమాఫీ కారణంగా నిధులు లేక ఇవ్వలేకపోయామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధును ఎగ్గొట్టి రుణమాఫీ చేస్తారా? అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఈ పథకాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రవేశపెట్టలేదు. ఉద్యమ సమయంలో రైతుల కష్టాలను స్వయంగా చూసిన ఆయన అందుకు పరిష్కార మార్గంగా దీన్ని రూపొందించారు. పెట్టుబడులకు సొమ్ము లేక, అప్పు పుట్టక, సతమతమయ్యే రైతుల కష్టాలను గట్టెక్కించడానికి తీసుకొచ్చిందే రైతుబంధు పథకం.
కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన మరో పథకం రైతుబీమా కూడా కాంగ్రెస్ పాలనలో ఉనికి కోల్పోతున్నది. ప్రమాదవశాత్తు మృతిచెందిన, సహజంగా మరణించిన రైతు కుటుంబాలకు రూ.5.లక్షల చొప్పున కేసీఆర్ సర్కార్ ఆర్థిక సాయం అందజేసింది. కర్మకాండ ముగియకముందే వ్యవసాయ అధికారి ఇంటికి వచ్చి మరీ అప్పట్లో చెక్కు అందించేవారు. కానీ, ఇప్పుడు ఏ ఒక్క రైతు కుటుంబానికి బీమా సొమ్ము అందడం లేదు. ధాన్యానికి మద్దతు ధర, సన్నాలకు రూ.500 బోనస్ విషయంలోనూ గందరగోళమే. సీజన్ ముగుస్తున్నా వీటిపై స్పష్టత లేదు. ధాన్యం కొనకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షకు తోడు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు అసలే ఇవ్వడం లేదు. ఇలా ఏ పథకాన్ని చూసినా అమలులో లోటుపాట్లు కనిపిస్తుండటంతో ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి భారీ పథకాలను కేసీఆర్ సర్కార్ చేపట్టినప్పడు స్పష్టమైన కార్యాచరణ ఉండేది. ఆ పథకాల ఫలితాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించేవి. వాటి ప్రభావం ప్రజల జీవితాలపై ఉండేది. ప్రస్తుతం పథకాలే కాదు.. ప్రజల ఇతర సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. హైదరాబాద్‌లో అయిదు నిమిషాల పాటు కరెంటు పోతే చాలు.. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదనే మాటలు వెంటనే ప్రజల నోటి వెంట వస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కి ఏడాదవుతున్నా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. మంత్రిగా కూడా అనుభవం లేని ముఖ్యమంత్రి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు, మరో నాలుగు శాఖలు కూడా ఉండటం గమనార్హం. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీసుల వ్యవస్థపై ప్రభావం పడుతున్నది. రాజకీయ కారణాలతో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 26 సార్లు ఢిల్లీ వెళ్లారు. అయినా మంత్రివర్గ విస్తరణ సమస్య కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తే పాలన ఎలా ఉంటుందో చెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణ.
కాంగ్రెస్ సర్కార్ ధోరణిని తెలంగాణ సమాజం మొదటి నుంచీ గమనిస్తూనే ఉన్నది. అనుభవం, అవగాహన లేకపోవడమే కాంగ్రెస్ వైఫల్యాలకు ప్రధాన కారణం. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ తొలి నుంచి సలహాలు, సూచనలు ఇస్తూనే, వివిధ అంశాలపై విమర్శిస్తూనే ఉన్నది. కానీ, వాటిని రాజకీయ విమర్శలుగా కాంగ్రెస్ కొట్టిపారేస్తున్నది. అంతేకాదు, ఎదురుదాడి చేస్తోంది. రుణమాఫీ అమలుపై హరీశ్‌రావు రైతులతో కలిసి పెద్ద ఉద్యమమే చేశారు. అందుకే ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని తొలి గడువు, తాజాగా డిసెంబరు 9 నాటికి పూర్తవుతుందని రెండో గడువు పెట్టుకుంది. అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చడం కూడా ప్రస్తుతానికి ఆగింది. ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ తన ధోరణిని మార్చుకోవాలి. లేకపోతే కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817