‘నిశ్శబ్దాల అవనిలో శబ్దం పుట్టించినోన్ని.. శతాబ్దాలుగా శ్రమకు శ్రీకారం చుట్టినోన్ని.. మాదిగోన్ని, మహా ఆదివాణ్ణి..’ అని గొంతెత్తి చాటిన ఎర్ర ఉపాలి మాటలను ఈ సందర్భంలో మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రను పరిశీలిస్తే మాదిగలు తమ శ్రమను సమాజానికి అనేక విధాలుగా అందించారు. శుభకార్యాల నుంచి చావుల వరకు, పండుగల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల వరకు తమ డప్పుతో సమాజాన్ని చైతన్యం చేయడం మాదిగల అసమాన కృషికి నిదర్శనం. సాంస్కృతిక విప్లవాలకు మాత్రమే తెలంగాణ పుట్టినిల్లు కాదు. ఇది అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలకు జన్మనిచ్చిన నేల. ఈ పోరాటాలకు ప్రాణం పోసింది మాదిగ డప్పే. ఈ రోజుకీ పీడిత జనాల్లో చైతన్యం నింపే ప్రధాన సాధనంగా డప్పు కొనసాగుతున్నది. ఆ డప్పును పుట్టించిన మాదిగ కులం ఇప్పుడు తమ హక్కుల సాధన కోసం గొప్ప ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘లక్షల డప్పులు-వేల గొంతులు’ కార్యక్రమం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారబోతున్నది. మాదిగ కళాకారులు పాడిన ప్రతి పాట, వేసిన ప్రతి దరువు, సమాజంలోని అసమానతలపై ప్రశ్నించి, హక్కుల కోసం చేసే ఉద్యమానికి ప్రేరణనిచ్చాయి.
సామాజిక అసమానతలను ఎదిరించి, ప్రజలను చైతన్యం చేయడంలో మాదిగ కళాకారుల సహకారం వెలకట్టలేనిది. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మాదిగల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 30 ఏండ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నది. ఇది తొలుత దండోరా ఉద్యమంగా ప్రారంభమై, సామాజిక న్యాయ సాధనగా విస్తరించింది. ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అనేక కులాలను చైతన్యం చేస్తున్నది. గత డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ ఉద్యమం గ్రామాల గడపలను దాటి, అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో లక్ష మందితో భారీ ర్యాలీతో ముగియనున్నది. ఇప్పటికే అనేక కుల సంఘాలు, హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాయి.
– డాక్టర్ సుమన్ దామెర, 99086 47775