గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, బీసీ, మైనార్టీ, సంచార జాతుల ప్రజలకు వ్యవసాయ సీజన్లో తప్ప వేరే రోజుల్లో కూలీ పనులు లభించక పస్తులుండవలసి వస్తుంది. అందువల్ల కమ్యూనిస్టు పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాట ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఆనాడు వామపక్షాలకు చెందిన 61 మంది పార్లమెంట్ సభ్యులు యూపీఏకు మద్దతిచ్చినందు వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లు 2006లో ఆమోదం పొందింది. పార్లమెంట్లో కమ్యూనిస్టుల బలం తగ్గిన తరువాత ఆ చట్టం ఆచరణలో అనేక అవరోధాలను ఎదుర్కొంటున్నది. చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనల అమలులో అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయి.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాత ఉపాధి హామీ పథకం పట్ల ఆసక్తి చూపడం లేదు. గతంలో ఆయన ఒకసారి ఈ పథకంపై పార్లమెంటులో మాట్లాడుతూ ‘ఈ పథకాన్ని తప్పక కొనసాగిస్తానని, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తరువాత కూడా దేశంలో పేదరికం ఉన్నదనేందుకు ఈ పథకం ఒక స్మారక చిహ్నం లాంటిదని’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కానీ ఇదే పథకం కరోనా కాలంలో గ్రామీణ ప్రజలకు సంజీవనిలా పని చేసింది. నాటి కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే వారంతా కాలినడకతో సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఆ సమయంలో గ్రామాల్లో ఉపాధి కల్పించింది ఈ పథకమే. తాము ఈ పథకానికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులు కేటాయించామని ఆనాడు పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గర్వంగా చెప్పుకున్నారు.
అలాంటిది ఈసారి 2023-24 కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లే కేటాయించారు. గత బడ్జెట్ కంటే రూ. 30వేల కోట్లు తక్కువ. 2022-23లో ఈ పథకానికి బడ్జెట్లో రూ.73వేల కోట్లే కేటాయించగా, పెరుగుతున్న అసమానతలు, ద్రవ్యోల్బణం కారణంగా అనివార్యంగా రూ.89,400 కోట్లకు పెంచుతూ కేటాయింపులను సవరించారు. సవరించిన సుమారు రూ. 90వేల కోట్ల కంటే రూ.30వేల కోట్లు ఈసారి తక్కువగా బడ్జెట్లో కేటాయించబడ్డాయి. పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ అనే సంస్థ అంచనా ప్రకారం పెరిగిన ధరలు, పెంచాల్సిన ఉపాధి దినసరి రేటు ఆధారంగా 2023-24 బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కనీసం రూ.2.72 లక్షల కోట్లు కేటాయించాలి. కానీ ఈ వాస్తవాన్ని కేంద్రం విస్మరించింది. కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటును తగ్గించి చూపేందుకే సామాన్యులకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకానికి నిధులు మూడోవంతు తగ్గించారు. అదేదో సంపన్నులపై సంపద పన్ను వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చనే ఆలోచన కేంద్రానికి ఎందుకు రాదో?
మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేవలం శతకోటీశ్వరుల సంపద పెంచేందుకు అవసరమైన విధివిధానాలు, చట్టాలను రూపొందించడంలోనే నిమగ్నమైంది. వారికి జాతి సంపదను బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నది. దీంతో అసమానతలు విపరీతంగా పెరిగి ఒక్క శాతం శతకోటీశ్వరుల చేతిలో 40 శాతం దేశ సంపద పేరుకుపోయింది. 50 శాతం ప్రజల చేతుల్లో 3 శాతం మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత మునుపెన్నడూ లేని రీతిలో పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ప్రజలకు ఊతమిచ్చే చర్యలు తీసుకోవడంతో పాటు పట్ట ణ ఉపాధి పథకం కూడా తీసుకురావలసిన పరి స్థితులు నెలకొన్నాయి. మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తక్కువ చేస్తూ, క్రమంగా ఉపాధి పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తున్నది.
ప్రతి ఏటా కూలీల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొత్త జాబు కార్డులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. జాబుకార్డులు ఉన్న కూలీలకు పని కల్పించడంలోనూ విఫలమవుతున్నది. కూలీలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలని నిబంధనలు ఉన్నా రెండు నుంచి నాలుగు నెలలపాటు కాలయాపన చేస్తున్నారు. పూర్తి చేసిన పనులకు కూడా కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. ఉదాహరణకు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుకల్లాలను చేపట్టింది. అది రైతుకు ఉపయోగ పడేదయినప్పటికీ, బీజేపీయేతర ప్రభుత్వం ఉన్నందున చెల్లించలేమని కేంద్రం నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో ఉపాధి హామీ పథకం హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో అమలవుతున్నది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో మొత్తం 1,17,74,442 జాబ్ కార్డులున్నాయి. పనులను పర్యవేక్షించ డానికి మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసి స్టెంట్ల తో పాటు సోషల్ ఆడిట్ అంటే సామాజిక పరిశీలన చేయాలనే ఉత్తర్వులున్నా పట్టించు కోవడం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న కూలీలకు మాత్రం రేటు పెంచడం లేదు. ప్రతి జాబ్‌కార్డు హోల్డర్‌కు సంవత్సరాని కనీసం 200 రోజులు పని కల్పించాలనే నిబంధన ఉన్నా 100 రోజులు కూడా పని కల్పించటం లేదు. కూలీ రేట్లు నేటి ధరల ప్రకారం కనీసం రూ.600 పైన ఉండాలి. కూలీ రేట్లు పెంచాలని, 100 రోజుల పని కల్పించాలని వామపక్షపార్టీలు, వ్యవసాయ కార్మికులు ఎంత పోరాటం చేసినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉన్నది. సంవత్సరంలో కనీసం 300 రోజులు పని కల్పించినప్పుడే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది.
కార్పొరేట్ సంస్థలకు సంపద పెంచడంపైనే కేంద్ర పాలకుల దృష్టి ఉండటం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను గమనిస్తే గ్రామీణ ప్రాం త ప్రజలకు మొండి చెయ్యి చూపింది. పేదల బ్రతుకులెలా ఉన్నాయో సామాజిక ఆర్థిక సర్వే చేయిస్తే నిజనిజాలు తేటతెల్లమవుతాయి. గ్రామీణభారతం ఎంతటి దయనీయస్థితిలో ఉన్నదో అర్ధమవుతుంది. కేంద్రం ఇజిఎస్ కేటాయింపులపై పునరాలోచించి జనాభా పెరుగుదల, వలస కార్మికుల సంఖ్యను ఆధారం చేసుకొని కేటాయింపులను సవరించి కూలీలకు పనులు కల్పించాలి.
(వ్యాసకర్త: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు)
-చాడ వెంకటరెడ్డి