పోయిన ఆదివారం రాహుల్‌గాంధీ ఖమ్మం వచ్చారు. బీఆర్ఎస్ సర్కారుపై కడుపులో ఉన్న అక్కసు కక్కివెళ్లారు. నిన్న ప్రధాని మోదీ వరంగల్ వచ్చారు. ఆయన కూడా బీఆర్ఎస్పై విషం కక్కి వెళ్లిపోయారు. కానీ, ప్రజలంటున్నారు వీరిద్దరూ ఒక్కటేనని..
వారం రోజుల్లో రాహుల్, మోదీ తెలంగాణకు వచ్చివెళ్లారు. ప్రజాప్రతినిధిగా ఏ పదవి, పార్టీ పరంగా పర్టికులర్ హోదా లేకుండానే రాహుల్‌గాంధీ తెలంగాణ డౌరా చేశారు. మోదీ అలా కాదాయే. ఆయన మన దేశ ప్రధానమంత్రి. తన సారథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నదాయే. రాష్ట్రంలోని కడమ ప్రాంతాలకు అటుంచి, తాను దిగిన వరంగల్ జిల్లాకు తమ హామీ చిట్టాలోని కనీసం ట్రైబల్ యూనివర్సిటీ తేలేదు. వయ్యారమే తప్ప, బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేకపాయే. తన గుజరాత్లో రూ.20 వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు గానీ, మన వరంగల్ మీద మాత్రం మనస్కరించలేదు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు బదులు సుగంధ ద్రవ్యాల యూనిట్ ఇచ్చినట్టు, వరంగల్‌కు కోచ్ ఫ్యాక్టరీకి బదులు విడిభాగాల తయారీ సెంటర్‌ను కేటాయించారు. ‘బీడి బిచ్చం- కల్లు ఉద్దెర’ నానుడి మాదిరిగా చేసిన బాసలను కాదని, మొక్కుబడి తంతుకే పరిమితమయ్యారు.
రూ.521 కోట్ల అంచనా వ్యయంతో కేవలం రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను మంజూరుచేశారు. రూ.20 వేల కోట్లు ఎక్కడ. రూ.521 కోట్లు ఎక్కడ. ఇక జాతీయ రహదారుల వ్యవస్థ విస్తరణ అనేది రొటీన్ అంశమే. ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని సాక్షాత్తూ పార్లమెంటులోనే తెలంగాణ రాష్ట్రం గురించి అనరాని మాటలని మన ప్రజలను బాధ పెట్టినందుకైనా ప్రత్యేకంగా అభివృద్ధి ప్రాజెక్టులు ఇచ్చేందుకు చేతులు రాలేదు. పైగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిందించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని రాహుల్‌గాంధీ బేస్‌లెస్‌గా పలికారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని స్ఫురించేలా మోదీ మాట్లాడారు. ఈ అంశంలో మోదీ, రాహుల్‌గాంధీ జుగల్బందీగా ఆలపిస్తున్నారు.
ఒకరిద్దరు కార్పొరేట్ దోస్తుల లాభం కోసమే శ్రీలంకలోనూ మన దేశ ప్రతిష్ఠను మసకబార్చింది కేంద్రంలోని మోదీ సర్కార్. 55 ఏండ్ల పాటు తరతరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పేజీల కొద్దీ అవినీతి జాడలే. అందుకే దానికి స్కాంగ్రెస్ అనే పేరొచ్చింది. సూడ సక్కదనమైన పార్టీలు తమవని అన్నట్టుగా కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ మొదలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న భారత రాష్ట్ర సమితి మీద పడ్డాయి. తెలంగాణ ప్రజలు తమను ఎలాగూ ఆదరించడం లేదని గ్రహించిన బీజేపీ, కాంగ్రెస్‌లు నిరాశ నిస్పృహలతో అల్లాడుతున్నాయి. జనంలో విశ్వాసం, పలుకుబడి చూరగొనలేక , బీఆర్ఎస్-కేసీఆర్ లక్ష్యంగా వ్యక్తిత్వ హననమే తమ పంథాగా మసులుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ తాము సమాన దూరమేనని, ఎవరికీ బీ టీం కాదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పునరుద్ఘాటిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల దుష్ప్రచారాల వల్ల అపోహలు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. నాలుగు ఓట్లు దక్కుతాయన్న చౌకబారు ఎత్తుగడలు, వ్యవహార దక్షత లేని వ్యూహాలతో ఆ రెండు పార్టీలు ఓటర్లను తికమక పెట్టేందుకు విఫలయత్నాలను వీడటం లేదు. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ దిక్కుమాలిన ప్రాపగాండకు ఒడిగట్టింది. అదే సమయంలో బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ గోబెల్స్ పబ్లిసిటీ చేస్తున్నది. కడపటి ఖమ్మం సభలో కాంగ్రెస్ రాహుల్‌గాంధీ చెప్పిందీ, తాజాగా హనుమకొండ మైదానంలో బీజేపీ మోదీ అన్నదీ ఒకటే. ఎదుటి పార్టీతో బీఆర్ఎస్కు చెలిమిని పరస్పరం అంటగడుతున్నాయి.
ఈ సీజన్లో జూన్ మొత్తంలో, జూలై తొలి వారంలో వానలు కురవక కాలం ఎత్తిపోతున్న తరుణంలో ఎత్తిపోతల పథకాల ఫలాలను తెలంగాణ రైతాంగం అనుభవంలోకి తెస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిరంతరం నిరాధారమైన, పేలవమైన ఆరోపణలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోంటే, జనానికి మంచి చేయడమే లోకంగా నిమగ్నమయ్యారు కేసీఆర్.
తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పరిరక్షిస్తూ, పెంచుతూనే దేశ ప్రజల బంగరు భవిత కోసం తపిస్తున్నారు. అలాంటి కేసీఆర్‌పై ఎక్కడికి పోయినా విషం కక్కుతున్నారు మోదీ. ఇటీవల అక్కడెక్కడో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోనూ, ఇపుడు వరంగల్ లోనూ అదే ధ్వనించారు ప్రధాని. తన 25 నిమిషాల ఉపన్యాసంలో ఎక్కువ సేపు కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. ఇదైనా కాంగ్రెస్ కడుపు మంట చల్లారుస్తుందో లేదో? నిజానికి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలతో మాత్ర మే పొత్తున్నది, ఉంటుంది. బీజేపీ అంటున్నట్టు కాంగ్రెస్‌తో కానీ, కాంగ్రెస్ చెప్తున్నట్టు బీజేపీతో కాని జట్టుకట్టదు.
(వ్యాసకర్త:ఇండిపెండెంట్ జర్నలిస్ట్)