రెండవ ప్రపంచ యుద్ధంలో కోట్లాది ప్రాణా లు బలయ్యాయి. అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ప్రపంచ మానవాళిని యుద్ధభయం నుంచి బయటపడేయడానికి 1945, అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి (క్లుప్తంగా ఐరాస) ఏర్పాటైంది. ఐరాసకు ఈ నెలతో 80 ఏండ్లు నిండను న్నాయి. ఈ ఎనిమిది పదుల ప్రస్థానంలో సంస్థ ప్రాసంగికత సంశయాత్మకం కావడం బాధాకరమైన చేదునిజం. ఒకప్పుడు ఐరాస మాట చెల్లుబాటయ్యేది. ఇప్పుడు ఐరాస గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదనడం అతిశయోక్తి కాదు. ఐరాస మానవాళిని స్వర్గానికి చేర్చేందుకు రూపొందలేదు. ‘నరకం నుంచి కాపాడటమే దాని కర్తవ్యమని’ సంస్థకు రెండో ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన డాగ్ హమర్షోల్డ్ గొప్పగా ప్రకటించుకున్నారు. కానీ, నిజంగా ఆ విషయంలో సంస్థ విజయం సాధించిందా.. అన్న ప్రశ్నకు గుండెల మీద చేయివేసుకొని అవునని చెప్పగలుగుతామా? అంటే అనుమానమే. భూమి మీద నరకమంటే ఏమిటో గాజాలో ఇజ్రాయెల్ చూపిస్తున్నది. దీనిపై ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ సమితి సంప్రదాయాలకు భిన్నంగా ఇజ్రాయెల్ ఘాతుకాలను పత్రికా సమావేశం పెట్టి మరీ చీల్చి చెండాడారు. కానీ పట్టించుకునే నాథుడెవ్వరు?
ప్రచ్ఛన్న యుద్ధం రోజుల్లో అగ్రరాజ్యాల మధ్య ఒక సమతూకం లాంటిది ఉండేది. అందుకు ఐరాస ప్రధాన వేదిక కావడంతో సంస్థ మాటకు పరువు, బరువు ఉండేవి. ఐరాస నిర్ణయాలను కాదనడానికి సభ్యదేశాలు జంకేవి. ఆఫ్రికా, ఆసియాలో ప్రాంతీయ సమస్యలు ఎదురైనప్పుడు భద్రతామండలి తీర్మానం మేరకు శాంతిస్థాపక దళాలను పంపడమూ జరిగేది. కానీ, సోవియట్ పతనంతో అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యం నెలకొనడంతో ఐరాస ప్రతిష్ఠ, పలుకుబడి క్రమంగా మసకబారాయి. ప్రపంచ దేశాలను ఏకతాటి మీదకు తెచ్చి సమస్యలను పరిష్కరించడంలో ఐరాస నిస్సహాయతలోకి జారుకున్నది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో, గాజాలో ఇజ్రాయెల్ నరమేధంలో కొట్టొచ్చినట్టు కనిపించే వాస్తవికత ఇది. భారత్ వంటి తటస్థ దేశాలకు సమితిలో తగు పరపతి లేకపోవడం, వీటో పేరుతో కొన్ని దేశాలు సమితి నిర్ణయాల ను తోసిరాజవడం, మారిన ప్రపంచ పరిస్థితుల కు అనుగుణంగా సమితిలో ప్రాతినిధ్యం మారక పోవడం ఐరాస కునారిల్లడానికి ప్రధాన కారణాలు.
ఐరాస మూలకుపడి మూలగడంలో అమెరి కా పాత్ర చిన్నది కాదు. ఇటీవల జరిగిన సర్వ ప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమితిలోకి ప్రవేశిస్తున్నప్పుడు, లోపలికి వెళ్ల్లిన తర్వాత ఎదురైన చిన్న చిన్న సాంకేతిక అసౌకర్యాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇలాంటి సంస్థ ఎక్కువకాలం మనుగడ సాగించలేదని తనదైన ధోరణిలో శాపనార్థాలు పెట్టారు. ఆయన సమితినే కాదు, పర్యావరణంపై, వాణిజ్యంపై ఏర్పాటైన బహుళపక్ష వేదికలను కూడా తిరస్కరిస్తుండటం తెలిసిందే. చివరికి అమెరికా పెంచి పోషించిన నాటో వంటి బహుళపక్ష సైనిక కూటమిని కూడా ఆయన కాదంటున్నారు.
ఐరాస వంటి బహుళ పక్ష వేదికల వల్ల తన ఆధిపత్యానికి అడ్డంకులు ఎదురవుతాయనే ధోరణి అమెరికాది. ఆ సంగతి అలా ఉంచితే మిగతా దేశాల ప్రతినిధులు మాత్రం సమితితో పాటుగా బహుళపక్ష వేదికలను కాపాడుకొని ప్రపంచాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని నొక్కిచెప్పారు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితి ప్రపంచ యుద్ధా లు రాజుకున్న రోజుల నాటికి దగ్గరగా ఉండ టం గమనార్హం. ఐరాసకు ముఖ్య దాతలైన అమెరికా, చైనా అవి ఇవ్వాల్సిన నిధుల విషయంలో భారీగా బకాయిలు పడ్డాయి. దీంతో సంస్థ నిర్వహణే కష్టసాధ్యమవుతున్నది. బడ్జెట్లో కోతలు, కార్యక్రమాల కుదింపుతో సమితి కళ తప్పింది. యుద్ధాలు, రోగాలు, పేదరికం ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో ఐరాస వంటి అంతర్జాతీయ వేదిక బలహీనం కావడం ఏ మా త్రం వాంఛనీయం కాదు. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం ముందు నాటి పరిస్థితులే ముసురుకుంటున్నాయనే మాట పదేపదే వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఐరాసను సంస్కరిం చి, బలోపేతం చేయడం ఎంతైనా అవసరం.