పార్టీలు ఓడిపోవడం, ప్రభుత్వాలు పడిపోవడం, రాజ్యాలు కూలిపోవడం, రాజులు దిగిపోవడం, వెన్నుపోట్లు, పన్ను పోట్లు, ధరలు పెరగడం, డాలర్లు కరగడం, ఒకటేమిటి భుక్తాయాసం నుంచి ఆకలి కేకల వరకు.. కూలీ డబ్బుల నుంచి కుల గణనాల వరకు.. ఏదో ఒక సమస్యతో ప్రజలు చచ్చేవరకు బతకాలి కనుక బతుకుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఉన్నవాళ్లు ఉన్న పళాన ఉండలేక ఏదో ఒక సమస్యతో తమ కుటుంబాల్లో తామే నిప్పులు పోసుకుంటున్న వార్తలు పేపర్ తెరిస్తే కనిపిస్తూనే ఉన్నాయి. టీవీ పెడితే వినిపిస్తూనే ఉన్నాయి.
మీర్‌పేటలో భార్యను ముక్కలుగా కోసి వండిన సంఘటనైనా, ఆస్తికోసం తాతను 73 సార్లు పొడిచి, అడ్డం వచ్చిన తల్లిని నరకడానికైనా వెనుకాడని మనవడి వైనమైనా నిన్నా మొన్నటిదే. కులాంతర వివాహం చేసుకుందని 28 ఏళ్ల కానిస్టేబుల్ నాగమణిని ఇబ్రహీంపట్నంలో కుటుంబ సభ్యులే హతమార్చింది గత నవంబర్ లోనే. ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లారదు. రాసుకుం టూ పోతే వాయిదా కాగితాలు సరిపోవు. కూలి పనులు చేసుకునే వారి నుంచి కోటీశ్వరుల వరకు కలహాలు లేని కుటుంబాలు లేవు. కలతలు లేని కాపురాలు లేవు.
దేశంలో దినదినం పెరుగుతున్న కుటుంబ కలహాలను దృష్టిలో ఉంచుకుని కుటుంబ తగాదాలు సత్వరం పరిష్కృతమైతే జనజీవనం సాఫీగా సాగుతుందని, కలహాల్లేని కాపురాల్లో ప్రజలు దేశాభివృద్ధికి ఉపయోగపడతారని భావించి 1984లో ప్రభుత్వం కుటుంబ కోర్టుల చట్టం తెచ్చింది. రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ర్టాల్లోని హైకోర్టులను సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ కోర్టులను ఏర్పాటు చేశాయి. వైవాహిక వివాదాలు, ఇతర కుటుంబ తగాదాలు ఈ కోర్టుల్లో పరిష్కృతం అవుతాయి. న్యాయవాదుల అవసరం లేకుండా ఈ కోర్టుల్లో కక్షిదారులు తమ కేసులను తామే వాదించుకోవచ్చు. న్యాయవాదులు కుటుంబ కలహాల్లో కలుగజేసుకోకూడదని, వారు ఈ కుటుంబ కోర్టులకు రాకూడదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ చెప్తున్నది. పెండ్లిళ్లు, విడాకులు, గృహహింస, కుటుంబ, ఆస్తి తగాదాల్లో ముందుగా రావాల్సింది ఈ కోర్టులకేనని చట్టం చెప్తున్నది.
ఇలా ఏర్పడ్డ కుటుంబ కోర్టులు దేశం మొత్తం మీద 850 ఉన్నాయి. వాటిల్లో పేరుకుపోయిన కేసులు 11.95 లక్షలకుపైగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్న 189 కుటుంబ కోర్టుల్లో 3.95 లక్షల కేసులు మూలుగుతుండగా, 37 కుటుంబ కోర్టుల్లో 1.12 లక్షల కేసులతో దేశంలోనే కేరళ రెండో స్థానంలో ఉన్నది. తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే తెలంగాణలో 23 కోర్టుల్లో 18,600 కేసులు, ఆంధ్రప్రదేశ్‌లో 17 కుటుంబ కోర్టుల్లో 14,300కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టులు, కేసుల నంబర్లు పక్కన పెడితే దినదినం కుటుంబాల్లో తగాదాలు పెరుగుతున్నాయని, ప్రజలు ప్రత్యామ్నా య మార్గాలు ఎంచుకోకుండా ప్రాణాలు తీసుకుంటున్నారనేది అక్షర సత్యం.
పెళ్లయిన మొదటి వారం నుంచి మొదలు, పిల్లలు పుట్టి, వారి పెళ్లిళ్లు, వారికి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వృద్ధ దంపతులు విడాకుల కోసం, సయోధ్య కోసం కలిసి ఎలా ఉండాలన్న సలహాల కోసం అటు కోర్టులకు, ఇటు మధ్యవర్తిత్వ కేంద్రాలకు వస్తూనే ఉన్నారు. పెళ్లయిన మూణ్నాళ్లకే విడాకులు కోరిన జంట మధ్య, పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత ఓ జంట మధ్య మధ్యవర్తిత్వం నిర్వహించి, వారిని ఒకటి చేసిన దాఖలాలు మధ్యవర్తిత్వ కేంద్రాల్లో ఉన్నాయి. కాపురాల్లో కలహాలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా కోర్టులకు ఎక్కాల్సిన అవసరం లేదు. కోర్టులకు వెళ్లకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి నేడు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలకు చట్టబద్ధత కూడా ఉంది. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి నేడు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలకు చట్టబద్ధత కూడా ఉన్నది.
మొట్టమొదటగా 2002 జూలై 1న మన సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించి సెక్షన్ 89ను చేర్చారు. వ్యక్తుల మధ్య ఉన్న తగాదాలు కోర్టులో ఉన్నప్పుడు విచారణ సమయంలో కక్షిదారులు తమ సమస్య తామే పరిష్కరించుకునే అవకాశం ఈ సవరణ కల్పిస్తుంది. కేసులు సాగదీయకుండా, కక్షిదారుల సమయం డబ్బులు, ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు కాపాడుకోవడానికి మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉపయోగించుకోవాలని ఈ సెక్షన్ 89 చెప్తుంది. అటు తర్వాత ప్రతికోర్టులోను కోర్టు అనుబంధ మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పడి కక్షిదారులు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. వీటన్నిటినీ గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో మధ్యవర్తిత్వ చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు రంగంలో ఏర్పడ్డ మధ్యవర్తిత్వ కేంద్రాల్లో తీసుకున్న నిర్ణయాలు కూడా కోర్టు డిగ్రీతో సమానమని మధ్యవర్తిత్వ చట్టం 2023 చెప్తున్నది.
తమ సమస్యను గోప్యంగా తామే పరిష్కరించుకునే అవకాశాలు మధ్యవర్తిత్వ చట్టం, మధ్యవర్తిత్వ సంస్థలు కల్పిస్తున్నాయి. కోర్టులన్నీ ప్రజా కోర్టులనే విషయం కక్షిదారులు గ్రహించాలి. కోర్టుల్లో జరిగే వాదనలన్నీ కోర్టు హాల్లో ఉన్న వారందరికీ తెలియడమే కాకుండా సమస్య వదిలేసి వేరే వాళ్ల గురించి చెవులు కొరుక్కునే నైజం ప్రజల్లో ఎంతకూ పోవడం లేదు. ఆస్తి పంపకాల విషయమైనా, ఆలుమగల మధ్య మనస్పర్థలు అయినా, గోప్యంగా, గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించుకునే అవకాశాలు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రాల్లో ఉన్నాయి. మధ్యవర్తిత్వం (మీడియేషన్), ఆర్బిట్రేషన్ ఇంకా పకడ్బందీగా జరగడానికి ప్రభుత్వం నుంచి ఇంకా పకడ్బందీ సహాయం లభించాల్సి ఉంది.
కొన్ని విషయాల్లో కోర్టుల పెత్తనం ఇంకా పోవాల్సి ఉంది. మధ్యవర్తిత్వ కేంద్రాలు స్వచ్ఛందంగా పనిచేయడానికి ఆర్బిట్రేషన్ కేంద్రాలు అనుకున్నట్టు పనిచేసే అవకాశం కల్పించడానికి 2023, 2019లో ప్రభు త్వం ప్రతిపాదించిన మధ్యవర్తిత్వ కౌన్సిల్, ఆర్బిట్రేషన్ కౌన్సిళ్లు తొందరగా ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రాలకు మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది. మధ్యవర్తిత్వానికి ఇవ్వాల్సిన ప్రాచుర్యం ఇస్తే కుటుంబ తగాదాలే కాకుండా వ్యాపార, వాణిజ్య, ఆస్తి, వినియోగదారుల సమస్యలన్నీ కోర్టు బయటే పరిష్కారమై సంసారాలు రట్టు కాకుండా సమయం డబ్బు సంబంధ బాంధవ్యాలు చెడకుండా ఉంటాయి. కోర్టుల పెత్తనం ఇంకా తగ్గించి ప్రజలకు బడ్జెట్ ముఖంగా ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో వేచి చూడాలి.
– (వ్యాసకర్త: అధ్యక్షురాలు, అమిక మధ్యవర్తిత్వ కేంద్రం)
జి. జ్యోతిరావు