మణిపూర్ తన పేరులోని మణిని కోల్పోయింది. అక్కడ జరుగుతున్న మారణహోమం చూస్తూ ఉంటే మనుషులు ముందుకు వెడుతున్నారా, వెనక్కిపోతున్నారా అన్న భయం కలుగుతున్నది. అసలు మనిషి తత్వం బతికి ఉన్నదా అన్న అనుమానం కలుగుతున్నది.
సామాన్యులు, నిరక్షరాస్యులు, బీదరికంతో, బతుకులో కష్టాలతో జీవించేవారికి విశాల భావాలు లేకపోవచ్చు. కానీ, నాయకులకు కూడా మనసు, తెలివి కుంచించుకుపోతే ఎట్లా బతికేది? తమ పాలనలో ఉన్నవారి బాధ్యత, వారి మంచిచెడులు దిద్దాల్సిన అవసరం వారికి లేదా? ప్రకృతి ప్రకోపాలు, అనుకోకుండా జరిగే ప్రమాదాలకు వారు కారణం కాకపోవచ్చు. కానీ వాటివల్ల సామాన్యులకు కలిగే కష్టాల్లో ఆదుకోవటం, నష్టాలను పూడ్చ టం నాయకుల బాధ్యత కాదా? రోగం మాన్పలేని మందులాగ మరి వారెందుకు జనాలకు?
దేశంలో రోజూ ఎక్కడో అక్కడ బలహీనుల మీద బలవంతులు చేసే అరాచకాలు పత్రికల్లో, టీవీ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా స్త్రీల మీద అత్యాచారాలు ఎంత అమానుషం! జాతిలో సగభాగమై, జీవితాన్ని పంచుకొని పురుషుల సాంగత్యానికి, అసలు వారి పుట్టుకకే కారణమైన స్త్రీ జాతికి ఇచ్చే బహుమతి అత్యాచారమా? ఆ జరిగిన అమానుష క్రియ కంటే ఘోరమైనది వార్తలో భాష! ‘దళిత’ యువతిపై లైంగికదాడి లేక చర్చి వెనుక ‘నన్’ మీద అత్యాచారం అని రాయాలా? ఆ అనుభవం దళిత యువతికైనా, నన్కైనా, బ్రాహ్మణ స్త్రీకైనా ఒక్కలాగే బాధాకరం, అవమానం, అత్యంత దారుణం! ఎవరైనా స్త్రీయే! ఇక్కడ కూడా మనుషులు కొట్టుకుచస్తున్న కులం, వర్గం రాయడం అవసరమా?
అసలు స్త్రీల మీద, బాలికల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడవలసినది స్త్రీలు, వారి సంఘాలు కాదు. తోటి మగవారు. తన జాతివాడు చేసిన అఘాయిత్యాన్ని దిద్ది తమ గౌరవం నిలబెట్టుకోవలసింది మగజాతి. ఆడజాతి కాదు. సిగ్గనిపించటం లేదా మిగతావారికి? ఆ అత్యాచారాలు చేసినవారిని అక్కడే పట్టుకుని బుద్ధిచెప్పే బాధ్యత మిగతా పురుషులది కాదా? వారి ఆత్మగౌరవం ఏమైంది?
ఇక న్యాయస్థానాలు అన్యాయస్థానాలై పోయి చాలాకాలమైంది. అక్కడ నేరం రుజువైనా సరైన శిక్ష లేదు. ఒక్క స్త్రీ మానం హరించి ఆమెకు జీవితాంతం బాధపడే శిక్ష వేసిన వాడికి ఏడేండ్ల శిక్ష చాలా? లేక పై కోర్టుకు వెళ్లిదానిని కూడా తప్పించుకునే అవకాశం ఇవ్వాలా? ఈ అన్యాయాలు కొత్తవేమీ కావు. మహాభారతంలో ద్రౌపదికి ఇటువంటి అవమానం చెయ్యబోయిన జయద్రదుడికి ఆమె భర్తలు గుండుకొట్టి పంపించారు. కీచకుడిని అతి రహస్యంగా చంపేశారు. ఇక మణిపూర్ ఘటనలాగా పది మందిలో వివస్త్రను చేయాలని ఆదేశించినవారూ, ప్రయత్నించినవారూ, ప్రతిఘటించకుండా తలవంచుకుని కూర్చున్న అతిరథ మహారథులందరూ ధర్మయుద్ధంలో నశించారు. వారు సామాన్యులు కారు. అతిక్లిష్టమైన ప్రతిజ్ఞ చేసి జీవితాంతం నిలబెట్టుకున్న భీష్ముడు, దేవతలను కూడా జయించగలిగిన అస్త్రశస్ర్తాలు, ధనుర్విద్యాపారంగతుడు ద్రోణుడు, మహావీరుడు కర్ణుడు, ఇతర కౌరవులు-అధర్మం వైపు నిలబడ్డవారు అందరూ మరణించారు.
జన్మమెత్తిన మనుష్యులందరూ ధర్మాత్ములు కారు. కానీ, శక్తి, అధికారం ఉండి కూడా అధర్మానికి కొమ్ముకాసేవారికి అదే గతి పడుతుందనేది ఇక్కడ ముఖ్యాంశం. గత కొన్నేండ్లుగా జరుగుతున్న తతంగాలు గమనించండి. గుజరాత్లో బిల్కిస్ బానోకి ఏం జరిగింది? 2002లో ఆమెను సామూహిక లైంగికదాడి చేయడమే కాకుండా, మూడేండ్ల ఆమె కూతురితో సహా 14 మంది ఆమె కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా చంపారు. వారు ఇప్పుడు విడుదలై, సన్మానాలు పొందుతూ అతి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక అంతర్జాతీయ పతకాలు పొందిన మన ఆడపిల్లలు న్యాయం కోసం నెలల తరబడి ఆక్రోశిస్తున్నారు.
ఇప్పుడు ఈ మణిపూర్ సంఘటన జరిగిన 79 రోజుల దాకా ప్రధానమంత్రి పెదవి విప్పలేదు. ఇక్కడ మెయితీలా, కుకీలా అన్న ప్రశ్నే రాదు. స్త్రీలపై జరిగిన అతిదారుణ అత్యాచారం. మూడు హత్యలు- ఈపాటికి కేసు నడిచి శిక్షలు పడాల్సింది. ఇంటర్నెట్ లేక బయటికి కేసు రాకపోయేటప్పటికీ కన్నంలో తేలు కుట్టిన దొంగల్లాగ ప్రధానమంత్రి, మణిపూర్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, మిగతా బీజేపీ నాయకులంతా మిన్నకున్నారు. మరి విదేశాల్లో ప్రవచనాలు చెప్పే విశ్వగురు విదేశాలు కూడా తిరిగివచ్చాడు. న్యాయం చేయాలన్న సోయి ఒక్కడికి కూడా లేదు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఎగిరిపడుతున్న కాంగ్రెస్ చేసిన నిర్వాకం కూడా ఏమీ లేదు. నిర్భయ సంఘటనలో ఏం చేశారు? దేశంలో ఆమె చనిపోతే గొడవ అవుతుందని విదేశానికి పంపేశారు. ఈ రెండు పార్టీలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటమే తప్ప ప్రజలకు న్యాయం జరుగదు. పదవి పోయాక ప్రతిదీ ఇటువంటిది జరిగినప్పుడు ఇంటికెళ్లి పలకరించిన చంద్రబాబు ప్రత్యూష కేసులో ఏమి న్యాయం చేశాడు? ఈ అమానవీయ నాయకులను రాజకీయాల్లోంచి బహిష్కరించటమే సరైన శిక్ష! ఇకనైనా ఈ అత్యాచారాలు ఆపటానికి పురుషులు ముందుకురావాలని అర్థిస్తున్నాను. లేకపోతే ఫూలన్దేవీలు పుట్టుకొస్తారు. గులాబ్ గ్యాంగ్‌లు తయారవుతాయి.
కనకదుర్గ దంటు
89772 43484