తన అసామాన్య ప్రతిభాపాటవాలతో తెలుగువారి, అందునా తెలంగాణ జాతి కీర్తిని ఆసేతుహిమాచల పరివ్యాప్తం చేసిన విద్వన్మణులలో అగ్రగణ్యుడు మహామహోపాధ్యాయ వ్యాఖ్యానచక్రవర్తి కోలాచల మల్లినాథసూరి. మహాకవి కాళిదాసు, భారవి, మాఘమహాకవి, శ్రీహర్షుడు, భట్టిమహాకవి వంటి ఉద్దండులు రచించిన మహాకావ్యాల మహౌన్నత్యాన్ని అర్థం చేసుకునేట్టు అనితరసామాన్యమైన వ్యాఖ్యాన పరంపరను అందించిన మల్లినాథ సూరి సంస్కృత వాఙ్మయంలో, వ్యాఖ్యాన రంగంలో చక్రవర్తిత్వ బిరుదాన్ని పొందిన ఏకైకపండితుడు.
శాస్ర్తాధ్యయనానికి, వేదాధ్యయనానికి, అవధానవిద్యకు, పౌరాణికవిద్యకు, ధర్మశాస్త్రబోధనకు ప్రాచీనకాలం నుం చే ప్రసిద్ధిగాంచిన తెలంగాణాలోని మెదక్ జిల్లా కోలాచలం (ప్రస్తుతం కుల్చారం)కు చెందిన మహాపురుషుడు. మల్లినాథసూరి అపార పాండిత్యానికి ముగ్ధుడైన రాచకొండ అధిపతి సర్వజ్ఞ సింగభూపాలుడు మహామహోపాధ్యాయ, వ్యాఖ్యాన చక్రవర్తి ఇత్యాది బిరుదులతో సత్కరించినట్టు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
మల్లినాథసూరి తాత పేరు కూడ మల్లినాథుడే. ఆ కాలంలోనే తన శతావధానాలతో కవిపండితులందరి మెప్పు పొందిన మహాకవి ఆయన. కాకతీయవంశపు రాజైన వీరరుద్రుని చేత సన్మానింపబడిన మహామేధావి.
కోలాచలాన్వయాబ్దిందుః మల్లినాథో మహాయశాః, శతావధానవిఖ్యాతో వీరరుద్రాభివర్షితః అని పదయోజనాకారుడైన వెంకట నా రాయణ పండితుడు ఆ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘ప్రతాపరుద్రీయం’కు రత్నాపణ వ్యా ఖ్యానం వ్రాసిన కుమారస్వామి తను వ్యాఖ్యా తృ సార్వభౌముడైన మల్లినాథసూరి తనయుణ్ణని అనేక సందర్భల్లో తెలిపాడు. మల్లినాథుడు బాల్యంలో తనతండ్రి దగ్గరనే విద్యాభ్యాసం చేశాడని, ఆ తర్వాత అనుష్ఠానబలం తో శాస్ర్తాలన్నీ వివిధగురువుల వద్ద అభ్యసించాడని పరిశోధకుల అభిప్రాయం.
అంతవరకు అక్కడక్కడా కావ్యాలకు, శాస్త్రగ్రంథాలకు రాసిన వ్యాఖ్యానాల అసమగ్రతను, క్లిష్టతను, అన్వయ క్రమరాహిత్యన్ని గ్రహించి మహాకవుల కావ్యాలకు అతుల్యమై న వ్యాఖ్యానాలను రచించాడు. పదచ్ఛేదః పదార్థోక్తిః విగ్రహో వాక్యయోజనా, ఆక్షేపశ్చ సమాధానం వ్యాఖ్యానం షడ్విధం మతమ్ అని వ్యాఖ్యానలక్షణం చెప్పబడినప్పటికీ అది వ్యాకరణశాస్ర్తాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పబడిందే, అయితే దీన్నే ఆధారంగా తీసుకొని మహాకావ్యాలకు ఇతరశాస్త్రగ్రంథాలకు కూడ వ్యాఖ్యానం రచించి వ్యాఖ్యానానికి ఒక కొత్త రూపాన్ని లక్షణాన్ని నిరూపించిన సుధీమణి మల్లినాథసూరి.
నా మూలం లిఖ్యతే కించిత్ నానపేక్షితముచ్యతే అని దృఢంగా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మల్లినాథసూరి. ఆయన వ్యాఖ్యానవల్లరిని మల్లెపూల గుబాళింపుతో పోల్చారు వి ద్వాంసులు. ఆయనే లేకపోతే ఎన్నో మహాకావ్యాలు నూరు ఆమడల దూరంలో ఉండిపొయ్యేవి అనడంలో ఏమాత్రం సందేహం లే దు. వ్యాఖ్యానాల్లో మల్లినాథుని పాండిత్యపు లోతును గమనించుటకు యత్నిస్తే ఎన్ని శాస్ర్తాలలో ఆయనకు ఎంత దృఢమైన ప్రవే శం ఉందో మన ఊహక్కూడ అందదనడం లో ఆశ్చర్యం లేదు. వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, స్మృతులు, సం పూర్ణ వ్యాకరణశాస్త్రం, తర్కం, పూర్వమీమాంస, వేదాంతం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, ఆయుర్వేదం, జ్యోతిశ్శాస్త్రం,అశ్వ, గజ, రత్నా ది శాస్ర్తాలు, శకునశాస్త్రం, సాముద్రికశాస్త్రం, మంత్రశాస్త్రం, నాట్యశాస్త్రం ఇత్యాదుల విశేషాలన్ని సందర్భోచితంగా తన వ్యాఖ్యానాల్లో చూపెట్టిన వ్యక్తి కేవలం మల్లినాథపండితుడే. అమరకోశం, మేదినీకోశం, వైజయంతీకోశం, నానార్థరత్నమాల, విశ్వకోశం, ద్విరుక్తకోశం, యాదవ నిఘంటువు ఇత్యాది అనేకనిఘంటువుల ప్రామాణ్యాన్ని అవసరమున్న చోట ల్లా ఉదాహరించిన మహామేధావి మల్లినాథసూరి. అంతేగాక అష్టాదశ పురాణాలలోని అంశాలనెన్నింటినో సందర్భోచితంగా ప్రమాణంగా చూపెట్టిన పురాణ విజ్ఞాన సర్వస్వం మల్లినాథుడు. వ్యాకరణ విషయకమైన సందే హం ఆయా కావ్యాల్లో తలెత్తినప్పుడు సాధారణంగా పండితులు అష్ఠాధ్యాయిని, వైయాకరణ సిద్ధాంత కౌముదిని మాత్రమే అనుసరించి పదప్రయోగంలో కానీ, ధాతుప్రయోగంలో కానీ మహాకవుల ప్రయోగాలను సమర్థించలేకపోవడం సాధారణమే, కాని మల్లినాథసూరి ఐంద్రం చాంద్రం కాశకృత్స్నం కౌమా రం శాకటాయనమ్, సారస్వతం చాపిశలం శాకలం పాణినీయకమ్ అనే నవవ్యాకరణాలతో పాటు సరస్వతీ కంఠాభరణం, జైనేంద్ర వ్యాకరణం, హైమ వ్యాకరణం వంటి గ్రంథా లు, కాశికా, పదమంజరీ, మహాభాష్యాది వ్యాఖ్యానాలను కూడ ఉదాహరిస్తూ మహాకవులందరిని, వారి కవితాధారను సమర్థించిన తీరు అద్భుతం. అందుకే కాశీకి వెళ్లి మల్లినాథుని వ్యాఖ్యాసహితంగా పంచమహాకావ్యా లు మేఘసందేశం, భట్టికావ్యం అభ్యసించిన వారిని మహావిద్వాంసునిగా తలచేవారు.
ఒక కావ్యంలోని రచనాసౌందర్యం అనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆ కావ్యంలో ఉపయోగించిన భాష, సమయానుకూలంగా ఆ భాషలో కవి చూపిన మా ర్పులు, ఛందో విచ్ఛిత్తి, వర్ణనా నైపుణ్యం, అలంకా ర విన్యాసం, ఆయా పాత్రలను చిత్రించే చాతుర్యం, కథాకథన కౌశలం ఇత్యాదులన్నీ కలిసి సామూహికంగా కావ్యసౌందర్యానికి తోడ్పడుతాయి. ఎంత ప్రతిభాసంపన్నులైన కవులైనప్పటికి తమ కవితాధారాప్రవాహంలో వారు ఈ గుణాలను, ఈ లక్షణాలను గురించి ఆలోచించరు. అయి తే వీటినన్నింటిని తాను అవగతం చేసికొని, ఆ మ హాకవుల ప్రతిభాపాటవాలను సహృదయులకు ఇతోధికంగా ఆనందం కలిగించుటకు అపూర్వమైన సామర్థ్యం కావాలి వ్యా ఖ్యానకర్తకు. అటువంటి అప్రతిమ విద్వత్తు కలిగిన మహామనీషి మల్లినాథుడు మాత్ర మే.
పొంతనలేని విషమూర్ఛితములైన వ్యాఖ్యలతో అలమటించి పోయిన కాళిదాసుని మూ డు కావ్యాలకు సంజీవిని పోశాడు ఈ మల్లినాథ మహర్షి. అర్థశాస్త్ర పాటవంతో, వ్యాకరణ వైదుష్యంతో జటిలమనిపించిన భారవికవి కిరాతార్జునీయానికి ఘంటాపథం వ్యాఖ్య రచించి సులభతరం చేశాడు. అలాగే దురవగాహమైన భాషాసంపదతో నిం డిన మాఘుని శిశుపాలవధ కా వ్యాన్ని సర్వంకష వ్యాఖ్యతో అలంకరించాడు. విద్వదౌషధం అని పేరు పొందిన శ్రీహర్షుని నైషధకావ్యానికి జీవాతు వ్యాఖ్య వ్రాసి సహృదయ పాఠకులలో జీవింపజేశాడు. శాస్త్రకావ్యమైన భట్టికావ్యానికి సర్వపథీనం అనే వ్యాఖ్యానం రచించి లోకానికి మహోపకారం చేశాడు. వ్యాఖ్యానాలకు మల్లినాథసూరి పెట్టిన పేర్లే వాటి ఔచిత్యాన్ని, సార్థక్యాన్ని, సామర్థ్యాన్ని కూడ తెలుపుతాయి. ఆ మహాకవుల కవిత్వంలోని సౌందర్యాన్ని ఆవిష్కరించడంలో ఎంత నైపుణ్యాన్ని చూపిస్తాడో వాటిలో దాగి ఉన్న దోషములను అతి సున్నితంగా చూపే ప్రజ్ఞ కూడ కనబరుస్తాడు. సంపాదకుల పొరపాట్లతో కావ్యం మధ్యలో వచ్చి చేరిన ప్రక్షిప్తాలను గమనించి ఇది ఖచ్చితంగా కాళిదాసు రచన కాదని నిరూపిస్తాడు. అసాధారణమైన లోకజ్ఞానం, విభిన్నమైన సంప్రదాయాలు, విశిష్టమైన ధర్మసూక్ష్మాలు, ఖగోళశాస్త్రం, భూగోళశాస్త్రం, వేదవిహితమైన కర్మలు మొదలగు వాటితో మల్లినాథసూరి వ్యాఖ్యానం ఒక విజ్ఞాన విపణి. ఆధునికులవలే, పాశ్చాత్య విద్వాంసులవలే ఏ గ్రంథాన్నైనా ఉదాహరిస్తున్నపుడు ఆ సందర్భాన్ని తెలుపకుండా పేజీ నంబరు వేసి వదిలిపెట్టకుండా ఆయా గ్రంథాల్లో చెప్పిన అంశాలను సుస్పష్టం చేసి అధ్యయనపరులకు పరమానందాన్ని కలిగించిన మహోపకారి మహామేధావి మల్లినాథసూరి.
పదహారు గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాసి, స్వయంగా కూడ ఎనిమిది గ్రంథాలు రచించాడు మల్లినాథసూరి. వీటిలో అనేక గ్రంథాలు ఇంకా ముద్రించబడలేదు.
ఈవిధంగా అసామాన్యమైన విద్వత్తు కలిగినవాడు, వేదవేదాంగాది చతుర్దశ విద్యలతో పాటు సంస్కృతంలోని సర్వవిధశాస్త్ర పారంగతుడు, వ్యాఖ్యానరచనలో అగ్రగణ్యుడు, తాను జన్మించిన మెదక్ జిల్లాలోని కోలాచల (కుల్చారం)లో మహామహోపాధ్యాయ కోలాచల మల్లినాథసూరి పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బహుధా అభినందనీయులు.
విజయతాం శ్రీకోలాచల మల్లినాథ విబుధః
జయతు తెలంగాణా, జయతు సంస్కృతమ్
(వ్యాసకర్త : డైరెక్టర్,సంస్కృత అకాడమీ, ఓయూ)
– ఆచార్య కశోజ్జుల నీలకంఠం