హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చిలో నివసించే ఒక మధ్య తరగతి కుటుంబం గురించి ఆలోచిద్దాం. ఆ కుటుంబం కష్టపడి పనిచేస్తున్నది. పిల్లలను మంచి పాఠశాలకు పంపిస్తున్నది. కుటుంబ నియంత్రణతో జీవిస్తున్నది. పన్నులను నిజాయతీగా చెల్లిస్తున్నది. ఆయా నగరాలు కలిగిన రాష్ర్టాలు మంచి దవాఖానలు కలిగి ఉన్నాయి. పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలోని పరిమితమైన నీరు, భూమికి తగినట్టుగా జనాభా తక్కువగా ఉన్నది. జీవన విధానాలు అద్భుతంగా, పరిపూర్ణంగా లేకపోయినా, ప్రజలు మంచి విద్యావంతులై, క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మిస్తున్నారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రశాంతమైన సమాజంలోకి ఢిల్లీ నుంచి ఒక పెద్ద మార్పు రాబోతున్నది. దాని పేరు డీలిమిటేషన్.
కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న డీలిమిటేషన్ సాంకేతికంగా ఒక పదంగా కనిపించవచ్చు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలని కసరత్తు చేస్తున్నది. రాష్ర్టాల జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎంపీల సంఖ్యను పెంచనున్నది. ఎక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలకు ఎక్కువ మంది ఎంపీలు, తక్కువ జనాభా కలిగిన రాష్ర్టాలకు తక్కువ మంది ఎంపీలు దక్కుతారు. ఈ పరిణామం దక్షిణాది సాధారణ ప్రజలకు ఇది తీవ్రమైన అన్యాయంగా కనిపిస్తున్నది. ఎందుకంటే జనాభా నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేపట్టిన కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ర్టాల్లో విజయవంతంగా నడిచింది. ఉత్తరాది రాష్ర్టాల ప్రజలు ప్రభుత్వాల సూచనలను లెక్కచేయకపోవడం వల్ల అక్కడి జనాభా దక్షిణాదితో పోల్చితే ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు కేటాయిస్తామంటే దక్షిణాది రాష్ర్టాలకు ఎక్కువ సీట్ల కేటాయింపు జరగకపోవచ్చు. ఫలితంగా దేశంలో ఆయా రాష్ర్టాల ప్రభావం తగ్గవచ్చు. మెరుగైన జీవనం, క్రమశిక్షణ కలిగిన విధానం, గర్వపడే అభివృద్ధికే శిక్ష విధించినట్టుగా దక్షిణాది ప్రజలు భావించాల్సి వస్తున్నది.
ప్రస్తుతం లోక్‌సభ సీట్లు 543. ప్రతీ ఎంపీ నియోజకవర్గంలోని ఒకే ప్రజల సంఖ్య దాదాపు సమానం అనుకోవచ్చు. కానీ దక్షిణాది రాష్ర్టాలు జనాభా పెరుగుదలను సమర్థంగా నియంత్రించాయి. ఇప్పటికే ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ర్టాల్లోని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిలో జనాభా నియంత్రణలో ఉండటం, ప్రతీ నియోజకవర్గానికి సగటు ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండటం కొంచెం గందరగోళంగానే అనిపిస్తుంది. కానీ ఇది నేటి వాస్తవ పరిస్థితి. దక్షిణాది రాష్ర్టాల్లో ఒక లోక్‌సభ నియోజకవర్గానికి సగటున 18 లక్షల నుంచి 22 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఉత్తరాది రాష్ర్టాల్లో ఆ సంఖ్య సగటున 14 లక్షల నుంచి 16 లక్షల మధ్య ఉన్నది.
కేంద్రం చెప్తున్న లోక్‌సభ సీట్ల పెంపు పట్ల దక్షిణాది రాష్ర్టాలు ఆందోళన చెందుతున్నాయి. అంటే, సీట్ల సంఖ్య పట్ల కాదు, కేంద్రం రాజకీయ ఉద్దేశాల పట్లనే ఈ ఆందోళన. దక్షిణాది రాష్ర్టాల్లో ప్రభుత్వాలు మారినా సామాజిక బాధ్యత కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడంలో ప్రజలు మెరుగైన భాగస్వామ్యం కనబర్చారు. బాలికల విద్య, చిన్న కుటుంబాలను ప్రోత్సహించడం, బలమైన ఆర్థిక వ్యవస్థల నిర్మాణం పట్ల శ్రద్ధ చూపారు. కేరళం అక్షరాస్యత శాతం 96%. తమిళనాడులో ప్రపంచస్థాయి పరిశ్రమలు ఉన్నాయి. కర్నాటకలోని ఐటీ రంగ అభివృద్ధి దేశ ఐటీబూమ్కు కారణంగా నిలుస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఫార్మా, వ్యవసాయ రంగాల ఉత్పత్తులకు నిలయాలుగా నిలుస్తున్నాయి. దక్షిణాది మహిళ సగటున సంతానోత్పత్తి రేటు 1.6-1.7 కాగా ఉత్తరాదిలో ఈ సంఖ్య 2.4-3గా ఉన్నది. దేశంలోని జీఎస్టీ వసూళ్లలో దక్షిణాది రాష్ర్టాల వాటా 31 శాతం. కానీ దక్షిణాది రాష్ర్టాలు చెల్లిస్తున్న పన్నుల్లో సగం కూడా కేంద్రం నుంచి తిరిగి కేటాయింపులు జరగడంలేదు. కేవలం జనాభా ఆధారంగా మాత్రమే లోక్‌సభ సీట్ల పెంపు జరిగితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ర్టాల గొంతు కుచించుకుపోతుంది. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది రాష్ర్టాల్లోని సీట్లు 130 అంటే దాదాపు 23 శాతం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇది 18 శాతం కంటే కూడా తక్కువకు పడిపోయే అవకాశమున్నది.
ఎంపీల కేటాయింపు అనేది కేవలం సంఖ్యాపరమైనది కాదు. ఇది న్యాయానికి సంబంధించిన వ్యవహారం. దశాబ్దాలుగా దక్షిణాది ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా కుటుంబ నియంత్రణ, బాలికా విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై శిబిరాలు నిర్వహించాయి. ఇవన్నీ కూడా దేశానికి మేలు చేసే అంశాలు అని ప్రచారం నిర్వహించాయి. కానీ వాటన్నింటినీ సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు లభిస్తున్న బహుమానం ఏంటంటే ఎంపీ సీట్ల కేటాయింపు, రాజకీయ అధికారంలో అన్యాయం. ఎక్కువ పిల్లల్ని కనండి, ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయంటూ ఉత్తరాది నేతలు బహిరంగ సభల్లో తరచుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తాయి. భారత్‌ను సుస్థిరంగా ఉంచేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రజలను నిరుత్సాహపరుస్తాయి.
దక్షిణాదిలోని ప్రజలు ఈ అన్యాయాన్ని తమ రోజువారీ జీవితంలోనూ చూస్తున్నారు. దక్షిణాదిలో వసూలు చేసిన పన్నులతో ఉత్తరాదిలో రహదారులు, పాఠశాలలు నిర్మిస్తుంటే ఇక్కడి నగరాల్లో ట్రాఫిక్, నీటి ఎద్దటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇక తక్కువ మంది ఎంపీలు అంటే దక్షిణాది రాష్ర్టాల పట్ల నిర్లక్ష్యం మరింత పెరగడమే అవుతుంది. పరిశ్రమల కేటాయింపు నుంచి రైతులకు న్యాయమైన ధరల అందించడం వరకు ప్రతీ విషయంలో అన్యాయం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే దక్షిణాది ప్రజలు ‘ఎక్కువ పని చేస్తాం, ఎక్కువ పన్నులు చెల్లిస్తాం, కానీ దేశ పాలనలో మాటకు విలువ తక్కువ’ అనుకోవాల్సి ఉంటుంది.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను న్యాయంగా జరుపుతామని, ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ మాటను తెలంగాణ లోని బీఆర్ఎస్, తమిళనాడు నుంచి డీఎంకే, కర్నాటక కాంగ్రెస్ నేతలు నమ్మడం లేదు. మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు చేయడం లేదని గుర్తుచేస్తున్నారు. ఆ బిల్లు అమలు చేసిన తర్వాతనే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లు ప్రతులను తమిళనాడు సీఎం స్టాలిన్ కాల్చి, నిరసనను తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ రాజకీయ ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఎక్కువగా ఎంపీ సీట్లు పెంచుకోవడం ఆ పార్టీ ఉద్దేశం అని నిపుణులు చెప్తున్నారు. దక్షిణాదిలో బీజేపీ ప్రాబల్యం తక్కువ. కాబట్టి ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి తమకు బలం ఉన్న రాష్ర్టాల్లో గెల్చుకునే సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రావాలనేది బీజేపీ రాజకీయ జిమ్మిక్కు, అప్రజాస్వామిక వైఖరి అని అభివర్ణిస్తున్నారు. తమకు ఓటు వేయని ప్రాంతాల గొంతు నొక్కి, తమకు మద్దతుగా నిలిచే వారి స్వరం పెంచడం ద్వారా అధికారం చెలాయించాలని చూడటం దారుణమని మండిపడుతున్నారు. ఆటలో గెలవడం చేతగాక, ఆట నిబంధనలు మార్చినట్టుగా బీజేపీ తీరు ఉన్నదని చెప్తున్నారు. ఇదంతా ఎన్నికల సంస్కరణ ముసుగులో అధికారాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న వ్యవహారం అని విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు.
కేంద్రం తెరపైకి తీసుకొస్తున్న సమస్యకు పరిష్కారం ఏమిటి? అంటే.. దక్షిణాది రాష్ర్టాలు ప్రత్యేక సదుపాయాలు కోరడంలేదు. సమతుల్యమైన సూత్రాన్ని పాటించాలని మాత్రమే అడుగుతున్నారు. జనాభాను ప్రాతిపదికగా తీసుకోవచ్చు, అదే సమయంలో అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అక్షరాస్యత, ఆర్థిక భాగస్వామ్యం, కుటుంబ నియంత్రణలో సత్ఫలితాలు వంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. జనాభాకు 50 శాతం, అభివృద్ధి సూచీలకు 50 శాతం ప్రాధాన్యత కల్పిస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. జనాభాకు సంబంధం లేకుండా రాజ్యసభను బలోపేతం చేయడం ద్వారా కూడా రాష్ర్టాలు తమ గొంతును వినిపించేందుకు అవకాశం కల్పించవచ్చు. ఒక మనిషి – ఒక ఓటు అనే సూత్రం ప్రకారం లోక్‌సభ సీట్ల పునర్విభజన అవసరమే. కానీ దేశం మొత్తానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ర్టాలను శిక్షించినట్టుగా ప్రక్రియ ఉండకూడదు. అభివృద్ధి చెందిన, విద్యావంతమైన దక్షిణాది ప్రపంచంతో పోటీ పడుతున్నది. అలాంటి దక్షిణాది అసంతృప్తితో ఉంటే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ అని కేంద్రం చెప్తున్న మాటలకు అర్థం ఉండదు.
దక్షిణాదిలోని ప్రజలు ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదు. దేశంలోని ప్రతి ఒక్కరికీ మంచి విద్య, వైద్యం అందాలని దక్షిణాది ప్రజలు కోరుతున్నారు. కానీ దక్షిణాది ప్రజల కఠోర శ్రమ, బాధ్యతాయుత కార్యక్రమాల అమలుకు గౌర వం ఆశిస్తున్నారు, శిక్షను కాదు. కేంద్రం తప్పనిసరిగా వినాల్సిందే. నియోజకవర్గాల పునర్విభజన అనేది సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాలి, బలహీనపర్చవద్దు. సుపరిపాలనకు అభినందించాలి, శిక్షించకూడదు. దక్షిణాది మనోభావాలను, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఒంటెత్తు పోకడలతో ముందుకు వెళ్తే ఇక్కడి ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. అది ఎవరికీ మంచిది కాదు, దక్షిణాది రాష్ర్టాలు అడుగుతున్నది ఏంటి? తమ గొంతు వినిపించేందుకు న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం. ప్రజాస్వామ్యంలో ఇది అత్యాశ అవుతుందా?
బీజేపీ మాటలు ప్రజల్లో నమ్మకం కలిగించట్లేదు. జనాభా ప్రాతిపదికన మాత్రమే డీలిమిటేషన్ చేస్తే అభివృద్ధికి శిక్ష వేసినట్టు అవుతుంది. దక్షిణాది ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వాటాకు తగ్గట్టుగా సుపరిపాలన కావాలని కోరుకుంటారు. అందుకోసం తమ గొంతు వినిపించాలని ఆశిస్తారు. డీలిమిటేషన్ కోసం జనాభా ప్రాతిపదికతో పాటు, మానవ అభివృద్ధి సూచీలను పరిగణలోకి తీసుకోవాలి, మహిళా రిజర్వేషన్‌ను అనుసంధానం చేయాలి. సబ్ కా సాత్ అంటే ఉత్తరాదిలోని అందరితో కలిసి అనేలా ఉండొద్దు. దక్షిణాదినీ భాగస్వామ్యం చేయాలి. మనుషులను లెక్కించడమే కాదు, మనుషుల కృషిని గుర్తించినప్పుడే సమతుల్యత సాధ్యమవుతుంది, ఈ కేంద్రం గుర్తించాలి. దేశం కోసం కృషి చేసే వారిని గౌరవించాలి, శిక్షించకూడదు.
-సుక్కన్న