పారిస్ : యూరప్ దేశాలు హీట్ డోమ్ వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రచండ వేడి గాలులను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్‌లో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. గత నాలుగేండ్లలో ఎన్నడూ లేని విధంగా యూకేలో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, స్పెయిన్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏదైనా ఒక ప్రాంతంలో వేడిగాలులు కేంద్రీకృతం అయి, భారీగా ఉష్ణోగ్రతలు పెరగడాన్ని హీట్డోమ్గా పేర్కొంటారు. నార్త్ ఆఫ్రికా దేశాల మీదుగా వచ్చే ప్రచండ వేడిగాలులు పశ్చిమ యూరప్‌పై ఏర్పడిన అధిక పీడన వ్యవస్థ కింద చిక్కుకుపోవడంతో ఇక్కడ హీట్ డోమ్ ఏర్పడింది. సాధారణంగా సమ్మర్లో యూరప్ దేశాల్లో 17 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈ హీట్ డోమ్ వల్ల టెంపరేచర్ పెరుగుతున్నది.
యూకే, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, ఐర్లాండ్ లాంటి దేశాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటతిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియా లాంటి దేశంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం. యూరప్ దేశాల్లో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా పెద్దగా నమోదు కావు. కానీ హీట్ డోమ్ కారణంగా యూరప్ అట్టుడికిపోతున్నది. ఇప్పటికే ఆయా దేశాలను వాతావరణ శాఖ అధికారులు, సైంటిస్టులు ఈ వారం ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. స్కూళ్లు, హాస్పిటళ్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఔట్ డోర్ జాబులు చేసేవారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇటలీలో మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎలాంటి పనులు చేయొద్దని, ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ వారం మొత్తం పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి.