ఒక పల్లెటూరి మధ్య తరగతి రైతు నగరంలో తన ధాన్యాన్ని అమ్ముకొని, వచ్చిన డబ్బును నాణేల రూపంలో మూటగట్టుకొని ఇంటికి వస్తుంటాడు. దారిమధ్యలో శిథిలావస్థలోనున్న ఒక గుడిసె ముందు అతి దైన్య స్థితిలోనున్న ఒక యాచకుడు ఆయనకు కనిపిస్తాడు. ఆ యాచకుడి దీనస్థితికి హృదయం చలించిన ఆ రైతు తనవెంట తెచ్చుకొన్న రొట్టెలను ఆ యాచకుడికి తినిపించి నీళ్ళు తాగించి సేదతీర్చి, వెళ్ళి పోయేముందు ఆ యాచకుడి భిక్షాపాత్రలో ఒక రూపాయి నాణేన్ని వేసి తృప్తిగా ఇంటికి వెళతాడు.
సాయంత్రానికి తన ఇంటికి చేరుకొన్న రైతు, తన భార్యను పిలిచి మన ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బంటూ నగరం నుంచి తాను తెచ్చిన నాణేల మూటను భార్య కందిస్తాడు. దీంతో ఆశ్చర్యపోయిన రైతు భార్య ‘ఆ డబ్బును మధ్యాహ్న మే మీరు మనిషితో పంపించారు కదా?’ అని అనడంతో ఈసారి ఆశ్చర్య పోవడం ఆ రైతు వంతవుతుంది. కాసేపటికి తేరుకొన్న రైతు, ‘నేను నగరం నుంచి ఇపుడే వస్తున్నాను. నేను డబ్బును పంపడమేమిట’ ని ప్రశ్నిస్తాడు. ‘అవునండి ఇది నిజం అంటూ భార్య లోపలికి వెళ్ళి ఒక నాణేల మూటను తెచ్చి భర్తకు అందిస్తుంది.
విషయం అర్థంకాక ఆ ముల్లెను తెరిచిన రైతుకు దానినిండా ధగధగా మెరుస్తున్న బంగారు నాణేలు కనబడడంతో ఆశ్చర్యానికి లోనవుతాడు. కాసేపటికి తేరుకొని, ఆ బంగారు నాణేలను లెక్కిస్తే అవి సరిగ్గా వంద నాణేలుంటాయి. విషయం అర్థం కాని ఆ రైతు ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడని ప్రశ్నిస్తే అతడొక బిచ్చగాడిలా ఉన్నాడని భార్య చెబుతుంది. దానితో తల గిర్రున తిరిగిన ఆ రైతుకు మస్తిష్కం లో మెరుపులాంటి ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. గబగబా తాను రూపాయి నాణేన్ని దానం చేసిన యాచకుడు ఉన్న చోటుకు వెళ్లి చూశాడు. అయితే అక్కడ యాచకుడు గానీ, యాచకుడి గుడిసె ఆనవాళ్ళుగానీ ఏమీ లేక పోవడంతో మరింత ఆశ్చర్యానికి లోనయ్యాడా రైతు. మరుక్షణంలో సర్వం బోధ పడిందా రైతుకు. భావావేశంతో ఉప్పొంగిన హృదయంతో, ఆకాశం వంక చూసి ‘భగవంతుడా నీ లీలలు అమోఘం’ అంటూ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడా రైతు.
ఈ అద్భుత సంఘటనను నిశితంగా విశ్లేషిస్తే, మనం చేసే ప్రతి మంచిపని ఏదో ఒక రోజున వందరెట్ల మంచి ఫలితాన్ని మనకందిస్తుందని అర్థమవుతుంది. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసే సంఘటన ఒకటి ఈ మధ్యనే మన భాగ్యనగరంలో జరిగింది.
ప్రస్తుతం నగరంలోని మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్ 2014లో టప్పాచబుత్ర ప్రాంతం లో విధులు నిర్వహించేవారు. ఒకనాడు ఆయన విధుల్లో ఉండగా కవిత అనే మహిళ అనారోగ్యంతో అతి దీన స్థితిలో రోడ్డు పక్కన కనబడింది. ఆమెను చూసి చలించిన రవీందర్ ఆ మహిళను దవాఖానలో చేర్పించి తన స్వంత డబ్బులతో ఆమెకు వైద్యం చేయించారు. ఆ మహిళ కోలుకొనే వరకు అన్ని విధాల సహాయం చేసిన రవీందర్ ఆమె కోలుకొన్న తర్వాత మళ్లీ ఆమెకు కనిపించలేదు. అయితే తన ప్రాణదాత రవీందర్‌ను ఆ మహిళ ఎన్నడూ మరిచిపోలేదు. గత తొమ్మిదేండ్లుగా ఆమె అతని కోసం వెతుకుతూనే ఉన్నది.
ఇక ఈ నెల 27న బస్సులో వెళుతున్న కవితకు సికింద్రాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రవీందర్ కనిపించారు. బస్సు కిటికీ గుండా ఆయనను చూసిన కవిత బస్సు ఆపించుకొని దిగి, గబగబా పరుగెత్తుకొని వెళ్లి ఇన్నాళ్లుగా తాను వెదుకుతున్న తన ప్రాణదాత రవీందర్‌ను కలిసింది. ఉప్పొంగిన భావావేశంతో ‘పోలీసన్నా ఈ రోజున నేను మీ ముందు నిలబడి ఉన్నానంటే నాకు ప్రాణదానం చేసిన మీరే కారణమంటూ’ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు అన్నా! నీకోసం ఒక వెండి రాఖీ కొన్నాను. దాన్ని తెచ్చి కడతానని ఉద్వేగంతో తెలిపింది కవిత.
తాను ఎన్నడో చేసిన సహాయాన్ని, తాను మరిచిపోయినా, కవిత వచ్చి కృతజ్ఞతలు తెలుపడంతో ఏసీపీ రవీందర్‌కు కలిగిన ఆత్మ సంతృప్తిని బేరీజు వేయడం ఎవరికీ సాధ్యం కాదు. దైన్య స్థితిలోఉన్న కవితకు సహాయమందించిన రవీందర్‌ను, చేసిన సహాయాన్ని మరిచి పోకుం డా కృతజ్ఞతలు తెలిపిన కవితను సమాజం ఎంతగానో కొనియాడింది. పత్రికా రం గం ప్రశంసించింది
ఇక ఈ సంఘటనలో ఏసీపీ రవీందర్ తెలంగాణ పోలీస్ అధికారి కావడం, తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.