అడవులు నరికి జంతువులను నిర్వాసితులను చేయరాదని మహాభారతం చెప్తుంది. ఈ రాజనీతిని నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే ఒకరి కడుపు కొట్టి మరొకరి కడుపు నింపొద్దని అర్థం. ప్రైవేటైనా, ప్రభుత్వమైనా సరే చట్టం, న్యాయం అందరికీ సమానమే. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని పదెకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జేఎన్ఏఎఫ్ఏయూ) కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇలాంటిదే. అంబేద్కర్ వర్సిటీ కడుపు కొట్టి జేఎన్ఏఎఫ్ఏయూ కడుపు నింపాలనుకోవడం సరికాదు.
Congress Govt | ఆచార్య జి.రామిరెడ్డి మేధో పుత్రిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. 1982లో దీన్ని స్థాపించారు. మన దేశంలో దూరవిద్య విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ విశ్వవిద్యాలయానిదే. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే కొఠారి కమిషన్ నివేదికను అనుసరించి ఓపెన్ యూనివర్సిటీ మౌలిక భావన గురించి 1978లోనే ఉస్మానియాలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జి.రామిరెడ్డి, ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ మొదలైనవారితో కూడిన మేధావివర్గం నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. అప్పటి విద్యాశాఖ మంత్రి భవనం వెంకట్రాం యూనివర్సిటీ ప్రతిపాదనకు సుముఖత వ్యక్తం చేశారు. 1982లో ముఖ్యమంత్రి హోదాలో భవనం వెంకట్రాం సంబంధిత తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేశారు. ఆ తర్వాత కేంద్రం, యూజీసీ అనుమతులు వచ్చాక నాగార్జునసాగర్ కేంద్రంగా రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్‌లో దీన్ని పంజాగుట్టకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ పేరిట ప్రారంభమైన ఈ వర్సిటీకి ఆచార్య జి.రాంరెడ్డి తొలి వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.
దుర్గం చెరువు సమీపంలో 53 ఎకరాల స్థలా న్ని ఎన్టీ రామారావు ప్రభుత్వం ఆ యూనివర్సిటీ కి కేటాయించింది. 1988, జూలై 2న అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. 1991 లో అంబేద్కర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు. 1992 ఆగస్టు 31న అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు చేతులమీదుగా నూత న భవనాల ప్రారంభోత్సవం జరిగింది. చిన్న నీటిబిందువుగా పుట్టిన ఈ యూనివర్సిటీ క్రమంగా మహాసాగరంగా మారింది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో దీని పరిధిలో 218 విద్యాకేంద్రాలు ఉండటం గమనార్హం.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. 2023లో న్యాక్ ‘ఎ’ గ్రేడ్ రావడం వెనుక కేసీఆర్ సర్కార్ కృషి దాగి ఉన్న ది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ వర్సిటీ పరిధిలో ప్రస్తుతం లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులెందరో ఈ వర్సిటీ నుంచి వచ్చారు. ప్రముఖ నటి, మిస్ ఆసియా దియా మీర్జా, రచయిత్రి, ఉద్యమకారిణి గోగు శ్యామల, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్‌తో పాటు ఎందరో ప్రముఖులు ఇక్కడే డిగ్రీ పట్టాలు పొందారు.
ఓపెన్ యూనివర్సిటీతో పోలిస్తే జేఎన్ఏఎఫ్ఏయూ పరిధి చాలా తక్కువ, కోర్సులూ తక్కు వే. అందులో లలిత కళలు, నిర్మాణానికి సంబంధించిన కోర్సులు మాత్రమే బోధిస్తారు. లలిత కళలకు తెలుగు యూనివర్సిటీతోనే ఎక్కువ సం బంధం ఉంటుంది. తెలుగు యూనివర్సిటీకి ప్రస్తుతం బాచుపల్లిలో 100 ఎకరాలు, నాంపల్లిలో 13 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్న ది. కానీ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 30 ఎకరాల స్థలం కూడా అందుబాటులో లేదు. అందులోనూ గుట్టలు, లోయలే ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థితిలో తాను దూర సందు లేదు మెడకేమో డోలు అన్నట్టుగా జేఎన్ఏఎఫ్ఏయూకి పదెకరాలు కేటాయించడం దారుణం.
జేఎన్ఏఎఫ్ఏయూకి స్థలం కేటాయించాలనుకుంటే ఎన్నో మార్గాలున్నాయి. స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగానే వేరే ప్రాంతంలో స్థలం కేటాయించవచ్చు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ పాత భవనాలు ఖాళీగానే ఉన్నాయి. లేదా బాచుపల్లిలోని వంద ఎకరాల్లో ఇరవై ఎకరాలు కేటాయించినా అభ్యంతరం లేదు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవసరాలకే స్థలం చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇతర సంస్థలకు కేటాయించడం సబబు కాదు. ఇది విద్యకు నోచుకోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేయడమే.
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ భూములను జేఎన్ఏఎఫ్ఏయూకి కేటాయిస్తూ తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి విద్యార్థులు, ఉద్యోగ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడేందుకు గానూ ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డాణం సమన్వయకర్తగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిరోజు విరామ సమయంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జాక్ చైర్పర్సన్ ప్రొఫెసర్ పల్లవి కాబ్డే, జనరల్ సెక్రెటరీ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు నల్లబాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా రాస్తారోకో, వంటావార్పు, ర్యాలీ, నిరాహార దీక్ష, యూనివర్సిటీ బంద్ వంటి కార్యక్రమాలను గత 55 రోజులుగా నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. ఓపెన్ యూనివర్సిటికీ ఐదెకరాలే చాలని, యూనివర్సిటీ సిబ్బం ది, ఉద్యోగులు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎం వీ రమణారెడ్డి చెప్పడం హాస్యాస్పదం. జేఎన్ఏఎఫ్ఏయూకి నగరం నడిబొడ్డునే స్థలం కావాలంటే నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీ భవన సముదాయమే సరైనది.
ప్రజా ప్రయోజనాల పేరిట జారీచేసే ప్రభు త్వ నోటీసులను, ఫర్మానాలను సుప్రీంకోర్టు ఇటీవల తప్పుబట్టిన విషయాన్ని మరిచిపోకూడదు. ఒక సంస్థకు ఇచ్చిన స్థలాన్ని వేరొక సంస్థ కు ఇవ్వడమనేది అంత సులువు కాదు. హైడ్రా ద్వారా బుల్డోజర్తో ఇండ్లు కూల్చడమంత తేలి క కాదు. అందులో ఎన్నో చట్టపరమైన, న్యాయపరమైన అంశాలుంటాయి. ‘మేం తలచుకొంటే ఏదైనా చేస్తాం’ అనేది వారి వారి ఆత్మవిశ్వాసా న్ని కాదు, అహంకారాన్ని తెలుపుతున్నది. ప్రజ లు ఓట్లు వేసి గెలిపించింది తమ బాగోగులు చూస్తారని. అంతేకానీ, ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి కాదు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేసినా చెల్లుతుందనుకోవడం మూర్ఖత్వమే. ప్రజాపాలనలో సలహాలు, సంప్రదింపులు లేకపోవడం విడ్డూరం. ఇతరుల సల హా, సూచనలు ప్రజల శ్రేయస్సు కోరేవే అయి నా.. కొన్నిసార్లు అవి వికటిస్తాయి. అందుకే..
‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగ పడక వివరింపదగున్ గని కల్ల నిజము దెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!’ అన్నాడో మహానుభావుడు.
(వ్యాసకర్త: సామాజిక, సాంస్కృతిక విశ్లేషకులు)
-డాక్టర్ వి.వి.రామారావు
98492 37663