పురాతన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో ఆనాటి నుంచి ఉన్న భౌగోళిక చిత్రం గురించి సుస్పష్టంగా వివరించారు ఆ కవులు, రచయితలు. ప్రస్తుతం భారతదేశం పేరిట ఒక్క దేశంగా ఏర్పడిన ప్రాంతం విదేశీ దండయాత్రల ముందుదాకా అనేక రాజ్యాలుగా ఉండి వివిధ వంశాలకు చెందిన రాజుల పరిపాలనలో ఉన్నది.
మొఘలులు, తర్వాత బ్రిటిష్ వారు పాలించిన కాలంలోనే ఈ ప్రాంతాలన్నీ ఒకే పరిపాలనలోకి వచ్చి ఒకే దేశంగా రూపుదిద్దుకున్నాయి. అయితే శతాబ్దాల కాలం వివిధ రాజ్యాలుగా ఉండి, ఇప్పుడు మనం రాష్ర్టాలుగా పిలుస్తున్న ఈ ప్రాంతాలన్నీ వారివారి సొంత భాష, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనుసరించటంతో, ఈ రోజుకీ ఏ రెండు రాష్ర్టాలు ఒకేలా ఉండవు.
ఒకే దేశంగా రూపుదిద్దుకున్న భారతదేశం అద్భుతమైన వైవిధ్యం కలిగి ఉంటుంది. మరి ఇటువంటి దేశానికి ఎటువంటి పాలకులు ఉండాలి? స్వతంత్ర దేశంగా ప్రకటితమైన భారతదేశం 1947 నుంచి ఈనాటిదాకా సరైన పాలన రుచి చూడలేదు. ఏ దేశమైనా ఆయా పౌరుల జీవన విధానం ప్రకారం విధానాలను తయారు చేసుకొని వాటిని అనుసరిస్తూ జీవిస్తే, ప్రజల సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత జీవితం ఆనందదాయకమవుతుంది. దానికి సరైన విద్యావిధానం తోడైతే ఆ సమాజంలో మేధావులు తయారవుతారు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతారు.
మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఈ రోజుదాకా పైన చెప్పిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, తాము రూపొందించిన విధానాలను ప్రజల మీద రుద్దుతూ పరిపాలన సాగించారు అందరు ప్రధానులూ. కేంద్ర ప్రభుత్వాలు కూడా. ఈ అంశం అర్థం చేసుకోవటానికి ఒక్క ఉదాహరణ చూద్దాం! ప్రజల మేధస్సు వికసించటానికి విద్య ఒక్కటే మార్గం. సరైన విద్యా విధానం ద్వారానే ఒక జాతిని బలోపేతం చేయగలం. 1950 నుంచి కూడా ఏ విద్యావేత్త దేశీయ, స్థానిక అంశాలు పరిగణిస్తూ విధానాలు రూపొందించలేదు. నెహ్రూ విదేశాల్లో చదువుకొని, ఆ విద్యారంగ విధానాలకు ఆకర్షితుడై వాటిని మన విద్యారంగంలో జొప్పించాలని చూశారు కానీ, ఇక్కడి వైవిధ్యాల ప్రకారం విద్యారంగాన్ని రూపొందించాలని భావించలేదు. అసలు విద్య గరపటానికి అతి ముఖ్యమైన మాధ్యమం విషయంలోనే తప్పటడుగులు వేసినవారికి, ఇక ఉన్నత విద్య గురించి ఏం అర్థమవుతుంది? ప్రపంచంలో ఏ దేశంలోనైనా కనీసం 3 లేదా 4 భాషలు మాట్లాడేవారుంటారు. కానీ, ఒక్క భాష మాతృభాషగా కలిగినవారు 70 శాతం పైన ఉంటారు.
మిగతావారు పుట్టినప్పటి నుంచి ఈ అత్యధికులు మాట్లాడే భాష మధ్య పెరుగుతారు కాబట్టి వారికి తమ మాతృభాషతో పాటు ఈ భాష కూడా వస్తుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ తమ జాతీయ భాషగా గుర్తించిన అత్యధికులు మాట్లాడే భాషనే తమ విద్యారంగంలో మాధ్యమంగా చేసుకుంటారు. విద్య పూర్తిచేశాక, అవసరమైన విదేశీ భాష-ఇంగ్లీషు వంటిది నేర్చుకొని ఉద్యోగ ఉపాధులు వెతుక్కుంటారు. అందుకే వారికి తమ భాష వస్తుంది, అవసరార్థం పట్టుదలగా నేర్చుకున్న ఇతర భాషా వస్తుంది. మరి మన విధానం చూడండి. భారతదేశంలో భాషల అవసరాన్ని గుర్తించినా, సరైన విధానం లేక ప్రాథమిక దశ నుంచీ చిన్న పిల్లలకు విద్య చాలా భారమవుతున్నది. దీనికి గల కారణాలు కనుక్కోవడం కష్టం కాదు. ఇతర దేశాల్లో ఒకటో తరగతిలో చేరి బోధనకు అలవాటుపడిన పిల్లలకు రెండో తరగతి నుంచి విజ్ఞాన, సామాజిక శాస్ర్తాల్లో చిన్నచిన్న విషయాలు బోధిస్తారు. అవి కూడా ఆ పిల్లలకు, జీవితాలకు పనికివచ్చేవి. చిన్న చిన్న సైన్స్ ప్రయోగాలు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు పాటించాల్సిన భద్రతా విధానాలు వారి మాతృభాష ద్వారా, ఆచరణాత్మకంగా చేయిస్తూ బోధిస్తారు.
అందుకే వారికి విద్య, బోధన, తాము నేర్చుకోవటం చాలా సరదాగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇక మన దేశంలో ప్రాథమిక విద్యార్థుల పాట్లు చూద్దాం. ఇక్కడ 3 భాషలు- మాతృభాష, జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు- ఒకటో తరగతి నుంచీ తప్పనిసరిగా నేర్చుకోవాలి. బాగానే ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు భాషలను త్వరగా నేర్చుకుంటారు గనుక. వీటికి తోడు ఒక లెక్కలు మాత్రం ఇంగ్లీషులో పెట్టి వారికి ప్రయోగాత్మకంగా నేర్పిస్తే బాగుంటుంది. కానీ, అది చేయరు. ఒకటో తరగతి నుంచి ఈ భాషలకు తోడు సైన్స్, సోషల్ స్టడీస్, జనరల్ నాలెడ్జి, ఇంకా మోరల్ సైన్స్ వంటివి రెండు, మూడు సబ్జెక్టులు తగిలిస్తారు. విదేశీ విద్యావేత్తలు ఈ విధానాన్ని చూసి నవ్వుతారు. భాషే సరిగా రానివాడికి సైన్స్, సోషల్ స్టడీస్ వంటి విషయాల ఆధారిత సబ్జెక్టు పెట్టకూడదని భాషావేత్తలు, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు చెప్తారు. కనుక, మన దేశంలో ప్రాథమిక దశలో 3 భాషలు, లెక్కలు మాత్రం బోధించి, చిన్న పిల్లలకు ఆటలు, పాటలు, సంగీతం, నృత్యం, చిత్రకళ వంటివి నేర్పితే వారికి ఉత్సాహం పెరుగుతుంది. కళలు, భాషల ద్వారా భావనాశక్తి పెరుగుతుంది.
విద్యార్థులకు ముఖ్యంగా నేర్పవలసిన నైపుణ్యాలు మన దేశ విద్యా విధానంలో అసలు కనపడవు. అవి- ఒక విషయాన్ని వివరించే నైపుణ్యం, విశ్లేషించే నైపుణ్యం, సృజనాత్మక, భావనాత్మకంగా ఆలోచించే విధానం. వీటిని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. అందుకే పట్టభద్రులై మంచి మార్కులు తెచ్చుకున్న యువత కూడా ఇంటర్వ్యూలలో విఫలమవుతారు. టెక్నికల్ విషయాలు- తాము చదువుకున్నవి- చెప్పగలరు కానీ, ‘నీ గురించి చెప్పు’ అంటే తడబడతారు. ఎందుకంటే పుస్తక పాఠ్యాంశాల గురించి తప్ప వారు ఏమీ ఆలోచించలేరు.
ఈ నైపుణ్యం కొరవడిన కారణంగానే ఇప్పుడు మానవ సంబంధాలు కూడా కుంచించుకుపోతున్నాయి. విద్యారంగంలో ఉన్న అనేక లోపాల్లో ఇదొక ముఖ్యమైన, చిన్నది మాత్రమే! ఇంకా అనేకం ఉన్నాయి.
మరి ఈ వైవిధ్యభరితమైన దేశానికి, ప్రతి రాష్ట్రం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రగతిపథంలో పయనించాలంటే మార్గం ఏమిటి? ప్రజలందరూ ఇప్పటిదాకా పాలించిన రెండు జాతీయపార్టీలను విస్మరించి, తమ ప్రాంతీయత అర్థం చేసుకునే పార్టీని ప్రతి రాష్ట్రంలో ఎన్నుకోవాలి. వివిధ పార్టీలు కలిసి కేంద్రంలో పాలన చేపట్టాలి. అమెరికాలో ఉన్నట్టు ఆ స్థానిక ప్రజల సంస్కృతిని బట్టి ప్రతి రాష్ర్టానికి ఒక రాజ్యాంగం రూపొందించుకోవాలి. విద్యావిధానం దగ్గరి నుంచి, నీటిపారుదల, గనులు మొదలైన అన్నిరంగాల మీద ఆ రాష్ర్టానికే అధికారం ఉండాలి. ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో పాలుపంచుకున్న ప్రతి రాష్ట్రం ఇతర రాష్ర్టాల వైవిధ్యాన్ని గౌరవించి నిలబెట్టాలి. అన్ని రాష్ర్టాలు తమ ఆదాయంలోంచి 10 శాతం ఈ కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వాలి. అంతర్రాష్ట్ర సమస్యలు తీర్చటానికి ఈ డబ్బును వాడుకోవాలి. దీనివల్ల ప్రతి రాష్ట్రం తన వనరుల మీద, పాలన మీద, విధానాల మీద పూర్తి అధికారం కలిగి ఉంటుంది. ఇతర రాష్ర్టాల వలన తనకు కావాల్సిన విషయాలను చర్చల ద్వారా తీర్చుకోవాలి. నిర్ణయించుకోవాలి. కేంద్ర, రాష్ర్టాల మధ్య వైషమ్యాలు ఇప్పుడున్నట్టు ఉండే అవకాశం అసలు ఉండదు. పరస్పర గౌరవం ఈ ప్రభుత్వంలో ముఖ్యమైనది.
అయితే ఇటువంటి పాలన, తమ కరుడుగట్టిన విధానాల ద్వారా ప్రవర్తించే కాంగ్రెస్, బీజేపీలకు అర్థం కాదు, చేత కాదు. అందుకే ఒక కొత్త పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల నాయకులతో కేసీఆర్ వంటి విశాల భావాలు, సమానత్వ గౌరవం, మానవీయత కలిగిన నాయకుడు నడిపే పార్టీగా కేంద్రంలో అధికారంలోకి రావాలి. ప్రతి రాష్ట్రం తన ప్రతిపత్తిని నిలబెట్టుకుంటూ, ఇతర రాష్ర్టాల పట్ల స్నేహ సౌహార్ద్రాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రగతి సాధించిన రాష్ర్టాలు ఇతర రాష్ర్టాలకు తమ విధానాల గురించి వివరించడం, వారికి సహాయం చేయటం చాలా అవసరం. మన ముందు ఇప్పటి పాలకుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల 140 కోట్ల జనాభా ఉన్న మనకు నోబెల్ బహుమతి వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించేవారు లేకపోవడం విషాదం. కేవలం 20 లక్షల జనాభా ఉన్న దేశంలో 4, 5 నోబెల్ బహుమతులు పొందినవారు ఉండటం ఇక్కడున్న రాజకీయ, సామాజిక, విద్యా విధానాల ఫలితమే అన్నది గ్రహించాలి. అందుకే మన దేశంలో కూడా ఒక్కొక్క రాష్ట్రం తన మీద తను శ్రద్ధ పెడితే, మన యువత మేధావులవుతారు, అంతర్జాతీయ సంస్థల కూలీలు కాకుండా ఉంటారు!
సార్వత్రిక ఎన్నికలొస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో. ప్రజలందరూ అప్రమత్తమై, ఇప్పటిదాకా బాగా పాలించిన పార్టీ- వీలైతే ప్రాంతీయ పార్టీని బలోపేతం చేసి గెలిపించుకోవటం ముఖ్యం. విఫలమైన రెండు జాతీయ పార్టీలుకాంగ్రెస్, బీజేపీలను కేంద్రంలో అధికారంలోకి రానీయకూడదు. రాష్ర్టాల్లో గెలిచిన ఈ ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారం చేపట్టి భారతదేశాన్ని రాష్ర్టాల సమాహారంగా తీర్చిదిద్దాలి. ఇప్పుడున్న వివక్షాపూరిత, అవినీతి పరిపాలనను కేంద్రంలో రూపుమాపాలి.
-కనకదుర్గ దంటు
89772 43484