‘చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు’ అన్న చందంగా కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. డబ్బుంటే ఉపాధ్యాయ సంఘాలను తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చని ‘ఓటుకు నోటు’ సిద్ధాంతాన్ని నమ్మిన వారి ఆశలు నిజమయ్యాయి. నామినేషన్‌కు మూడు రోజుల ముందు బరిలో దిగినా బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే గెలవగలరని హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రెండోసారి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి.
ఓటరు నమోదు ప్రక్రియ మొదలు నిరంతరం ఓటర్లతోనే ఉన్న ఉపాధ్యాయ సంఘాల వ్యక్తుల ఆశలు అడియాసలయ్యాయి. విద్యా వ్యవస్థ గురించి తెలియదు, ఉపాధ్యాయుల సమస్యలు తెలియవు, విధివిధానాలు తెలియవు, కనీసం హోదా, ఏ పేరుతో పిలుస్తారో తెలియదు, ప్రభుత్వ బడుల బలోపేతానికి ఏ చర్యలు అవసరమో తెలియదు. బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు విద్యా వ్యాపారం అనే ఊబిలో చిక్కుకోకుండా ఎలా కాపాడాలో తెలియదు. మన సెలవులు, మన స్కేళ్ల్లు, మన బెనిఫిట్స్, మన పెన్షన్స్, మన సర్వీసు రూల్స్ ఏమీ తెలియవు. మన విద్యా వ్యవస్థ ఎన్ని మేనేజ్మెంట్లలో ఉన్నదో తెలియదు. అయినా, ఇవన్నీ తెలియాల్సిన అవసరం మాకేంటి? అన్నట్టు, ‘మా నోట్ల కట్టలతో ఓట్లు వేయించుకునే దమ్ముంది’ అనే ధైర్యంతో బరిలోకి దిగారు. నోట్లతో పదవి సాధించే సత్తా ఉన్నదనే నమ్మకంతో ఆట మొదలు పెట్టారు. కార్పొరేట్ ఆలోచనలను మేధావులైన అధ్యాపక, ఉపాధ్యాయ వర్గాలు నిజమని ఈ ఎన్నిక ద్వారా రుజువు చేశారు. ఉద్యోగంలో చేరింది మొదలు ఏదో ఒక ఉపాధ్యాయ సంఘంలో సభ్యత్వాన్ని పొంది, సమస్యలపై పోరాడి, దశాబ్దాల కాలం సంఘ బాధ్యతలను చేపట్టి , ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడ్డవారు ‘నోటుకు ఓటు’ అనే అస్త్రం ముందు విలవిలలాడిపోయారు.
గత 25 ఏండ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేసి పెద్ద సంఘంలో బాధ్యత నిర్వర్తిస్తూ, స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పేద విద్యార్థులు చదివే పాఠశాలలకు సౌకర్యాల కల్పనలో నేనున్నానంటూ చేయూతనిస్తూ , అనేక ఉపాధ్యాయ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తూ, అతి పెద్ద సంఘ అభ్యర్థి అయి ఉండి, ఉపాధ్యాయ అధ్యాపక వ్యక్తులకు, వ్యక్తిగతంగా కూడా ఆత్మీయులై ఉండి, ఏడాది కాలంగా ప్రతి టీచర్నీ ఆత్మీయంగా కలిసి వారితో మమేకమైన వ్యక్తి వ్యక్తిత్వం, విలువలు, సంఘ బలం.. అన్నీ నోటుకు ఓటు ముందు చిత్తుగా ఓడిపోయాయి.
సిట్టింగ్ ఎమ్మెల్సీ సేవలను కూడా ఓటుకు నోటు మింగేసింది. భావజాలం, కులవాదం, సంఘం అన్నింటినీ కాదని డబ్బు ఎవరికీ చేదు కాదని ఈ ఎన్నికలు నిరూపించాయి. డబ్బు జబ్బుకు తామేమీ అతీతులం కాదని నిరూపించారు. ఒక సాధారణ ఓటర్ కంటే దారుణంగా ఆలోచించారు. వెన్నెముక లేని వ్యక్తులుగా సమాజం ముందు నిలబడ్డారు. ఉదయాన్నే పాలవాళ్ల నుంచి, పనివాళ్ల వరకు డబ్బుకు టీచర్లు అమ్ముడుపోయారంటగా అంటుంటే తలదించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మీ కంటే ఒక సాధారణ ఓటరే నయం పార్టీకి కట్టుబడి ఉంటారని అంటుంటే తలవంచుకోక తప్పలేదు. విద్యావంతులు, ఉపాధ్యాయ అధ్యాపకుల ఆలోచన ఎంతో దూరదృష్టితో ఉండాలి. ఎంతో చాకచక్యంగా ఉండాలి. వారు తీసుకునే నిర్ణయం ఎంతో చాణక్య నీతిని ప్రదర్శించాలి. కానీ, అది జరగలేదు. కనీసం చదువుకోని సగటు సాధారణ ఓటరు స్థాయి ఆలోచన కూడా చేయలేకపోయారు.
వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తన ఓటును నోటుకు అమ్ముకోడు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన మన మేధావులు నోటుతో ఓటు కొనే వారి చెంప చెళ్లుమనిపించేలా నిర్ణయం తీసుకుని ఉండవలసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక ఎత్తుగడను ప్రదర్శించి డబ్బుతో ఓటు కొనొచ్చనే అహంకారాన్ని దించే సులభ ఉపాయం కూడా మన చేతుల్లోనే ఉంది. డబ్బు తీసుకొని ఓటు మాత్రం సేవ చేసే వారికి, దశాబ్దాలుగా సంఘ మాధ్యమంగా, ఉపాధ్యాయ సమస్యలపై పాటుపడుతున్న వారికి, మనతోపాటు ఉన్నవారికి వేసి ఉంటే రాబోయే కాలంలో నోటు ఎరవేసి ఓట్లు తన్నుకుపోయే కార్పొరేట్ గద్దలకు గుణపాఠం అయ్యేది. కానీ ఇక్కడ మన మేధావులు ధర్మబద్ధంగా ఆలోచించారు. డబ్బులు పెద్ద మొత్తంలో ఒకటోసారి, రెండవసారి కూడా తీసుకొని వాళ్ల రుణంలో పడకుండా ఓటు వేశారు. కానీ టీచర్ వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తిని మనకు అందించి మన వేలుతో మనమే పొడుచుకునే కళ్లు లేని కబోదుల్లా, వ్యక్తిత్వం లేని అమ్ముడుపోయే వ్యక్తులుగా మిగిలిపోయారు. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటును అమ్ముకొని నోటును గెలిపించిందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
టీచర్స్‌తో నిరంతరం ఉండే వారిని పక్కన పెట్టి, కార్పొరేట్ వ్యక్తిని నెత్తిన పెట్టుకున్నారు. మొత్తం 15 మంది పోటీ చేయగా దాదాపు 54 శాతం మంది ఓటర్లు టీచర్లను కాదని పరిచయం లేని వ్యక్తికి ఓటు వేశారు. అంటే డబ్బు ప్రభావం ఎంతగా పనిచేస్తుందో తెలుస్తున్నది. కేజీబీవీ, సొసైటీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ గంప గుత్తగా ఒకే వైపు వేశారన్న గుసగుస వినబడుతున్నది. సంఘ నాయకులు సైతం డబ్బుకు అమ్ముడుపోయారని విమర్శలు వస్తున్నాయి. పూర్తిగా ఓటుకు నోటు మీద ఆధారపడని నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎవరి క్యాడర్ ఓట్లు వారికే రావడంతో హోరా హోరీ పోరాటం జరిగింది. బీసీ వాదం, సంఘ బలాలు గట్టిగా పోటీ పడ్డాయి. మొత్తం మీద మేధావులు సాధారణ ఓటరు కంటే దారుణంగా ఆలోచించారని, సమాజంలో ఒక చర్చనీయ అంశంగా మారింది. డబ్బుకు గురువులు దాసోహం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది.