తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇటీవల తీసుకున్న నిర్ణయం- లిథియం రంగంలోకి అడుగుపెట్టడం. ఇది సాధారణ పెట్టుబడి నిర్ణయం కాదు. సంస్థ భవిష్యత్తు దిశను మార్చే కీలక మలుపు. ఈ నేపథ్యంలో ఎలాంటి అనుభవం, పెద్ద మొత్తంలో పెట్టుబడి, ఒక అనామక సంస్థ, ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ (భారతీయ బ్యాటరీ ముడిపదార్థాల స్టార్టప్)తో కుదిరిన లిథియం రిఫైనరీ ఒప్పందం ఎంతవరకు ప్రయోజనకరం? ప్రమాదకరం? అన్నది కార్మికవర్గాల్లో, ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్న. రూ.10 లక్షల అధీకృత మూలధనం, రూ.లక్ష చెల్లించిన మూలధనంతో, 2023లో ప్రారంభమైన సంస్థతో, సింగరేణి కాలరీస్ వారు రూ.2,250 కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడం పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. గతంలో ఎలాంటి పారిశ్రామిక అనుభవంలేని ఒక సంస్థతో, ప్రపంచంలోనే అత్యంత విలువైన, ఆధునికమైన లిథియం లాంటి ప్రమాదకరమైన ధాతువును శుద్ధి చేసే ప్రాజెక్ట్ నెలకొల్పడానికి, సింగరేణి సంస్థ ఒప్పందం చేసుకోవడం పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నది. ఇందులో పారిశ్రామిక లాభాలకన్నా, రాజకేయ లాభాలే ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ప్రపంచం వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు సాగుతున్నది. లిథియం లేకుండా ఈ మార్పు అసాధ్యం. ఈ నేపథ్యంలో దేశీయంగా లిథియం ఉత్పత్తి చేయాలన్న లక్ష్యం సూత్రప్రాయంగా సరైనదే. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, భవిష్యత్తు ఎనర్జీ అవసరాలకు సిద్ధం కావడం సింగరేణి తీసుకున్న నిర్ణయానికి బలం చేకూర్చే అంశాలు. లిథియం పరిశ్రమ ఎన్నో ఒడిదోడుకులను ఎదుర్కొని నిలదొక్కుకోవాల్సిన పరిశ్రమ. దీనివల్ల కాలుష్యం కూడా ఎక్కువే. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ ప్రయోగం సక్రమంగా అమలవుతుందా? లేక, రాజకీయ అవసరాలకు ఏర్పడ్డ మరో సంస్థానా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ సంస్థ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ బొలీవియాలోని ప్రభుత్వ లిథియం సంస్థ యాసిమియంటోస్ డిలిటియో బొలీవియానోస్ (వైఎల్బీ)తో కీలక వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ద్వారా లిథియం ముడి పదార్థాల సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయటంతోపాటు, లిథియం-అయాన్ బ్యాటరీల కోసం అవసరమైన క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (సీఏఎం) ఉత్పత్తిపై దృష్టి పెట్టనున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా, బొలీవియాలోని పోటోసీ ప్రాంతంలోని లా పాల్కా వద్ద ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్‌లో ఆల్ట్‌మిన్ అభివృద్ధి చేసిన పేటెంట్ పొందిన సీ-ఎల్ఎఫ్పీ (కార్బన్ పూత పూసిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సాంకేతికతను వినియోగిస్తారు. ఇది సురక్షితమైనది, ఖర్చు తక్కువగా ఉండేది కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), శక్తి నిల్వ వ్యవస్థల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా దేశాలు ఈ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగా, భారతదేశం కూడా సొంత నిల్వలను వెలికితీసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ భాగస్వామ్యం బొలీవియాలో మొదటిసారిగా స్వదేశీ లిథియం-అయాన్ బ్యాటరీ తయారీకి దారి తీస్తున్నది. ఇప్పటివరకు ప్రధానంగా ముడి లిథియం ఎగుమతులపైనే ఆధారపడిన బొలీవియా, ఇప్పుడు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశిస్తున్నది. ఆల్ట్‌మిన్ సంస్థ స్థాపకుడు మౌర్య సుంకవల్లి చెప్తున్న వివరాల ప్రకారం ఈ ఒప్పందం ద్వారా కంపెనీ గ్లోబల్ స్థాయిలో విస్తరించడంతో పాటు, 2030 నాటికి 10 జీఈడబ్ల్యూహెచ్. వరకు ఎల్పీఎఫ్ బ్యాటరీ మెటీరియల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఈ ఒప్పందంలో మొదటగా భాగస్వామి ఎంపికపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఆల్ట్‌మిన్ ఒక కొత్త సంస్థ. పెద్ద స్థాయి పారిశ్రామిక ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం లేదు. ప్రభుత్వ రంగ దిగ్గజమైన సింగరేణి, ఇటువంటి కీలక ప్రాజెక్ట్‌లో ఒక స్టార్టప్‌పై ఆధారపడటం ఎంతవరకు సురక్షితం? అనేది ప్రశ్న. ఈ సంస్థలో ఉన్న భాగస్వాముల అనుభవం శూన్యం. ఇందులో రాజకీయ నాయకుల స్వార్థమే తప్ప, సింగరేణి సంస్థ భవిష్యత్తు మాత్రం కనబడటం లేదని కార్మికవర్గాలు విమర్శిస్తున్నాయి.
భారతదేశంలో పెద్ద ప్రాజెక్టులు ఆలస్యం కావడం కొత్త విషయం కాదు. ఖర్చులు పెరగడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం, అనుమతుల ప్రక్రియలు నిలిచిపోవడం- ఇవి అన్నీ సాధారణ సమస్యలు. ఈ ప్రాజెక్ట్ కూడా ఆ గండాలను దాటుతుందా? లేక అదే దారిలో నడుస్తుందా? సింగరేణి సంస్థలో వేలాది మంది కార్మికులు కోల్ మైనింగ్‌లో నైపుణ్యం కలిగినవారు. కానీ లిథియం రిఫైనింగ్ పూర్తిగా వేరు రంగం. కొత్త నైపుణ్యాలు అవసరం. ఈ మార్పులో ప్రస్తుత కార్మికులకు స్థానం ఏమిటి? వారికి రీస్కిల్లింగ్ అవకాశాలు కల్పిస్తారా? లేక ఈ మార్పు వారికి ప్రమాదమవుతుందా? అయితే ఈ నిర్ణయాన్ని పూర్తిగా తప్పు అని కూడా చెప్పలేం. మొత్తానికి ఈ లిథియం ప్రాజెక్ట్ ఒక అవకాశం, ఒక ప్రమాదం. సరైన ప్రణాళిక, పారదర్శక అమలు, బాధ్యతాయుత నిర్వహణ ఉంటే ఇది తెలంగాణను ఎనర్జీ రంగంలో ముందుకు తీసుకెళ్లగలదు. కానీ అదే నిర్లక్ష్యం, ఆలస్యం, అనుభవ లోపం ఉంటే ఇది వేల కోట్ల రూపాయల ప్రయోగంగా మిగిలిపోవచ్చు. ఈ పరీక్షలో విజయం సాధిస్తుందా? లేక మరో ప్రభుత్వ ప్రయోగంగా మిగిలిపోతుందా? కాలమే సమాధానం చెప్తుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-సీహెచ్‌వీ ప్రభాకర్‌రావు
93915 33339