పార్లమెంట్లో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచి వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బీహార్‌లోని ఆరా, కరాకట్ నియోజకవర్గాల నుంచి లిబరేషన్ అభ్యర్థులు విజయం సాధించారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషిచేస్తూ ‘ఇండియా’లో భాగస్వామిగా మారింది.
మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ 1985 ఎన్నికల్లో తొలిసారిగా పాల్గొన్నది. 1989లో పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలను సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్‌ను ఆరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పంపింది. ఆ తర్వాత అసోంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు జయంత రోంగ్పి లిబరేషన్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బీహార్‌లో లిబరేషన్ గెలిపించుకున్నది. ఆ పార్టీ ప్రతినిధులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు తమ గొంతును పార్లమెంటులో వినిపించనున్నారు. ఫాసిస్టు బీజేపీని ఎదుర్కోవడం కోసం నిరంతరం పార్లమెంటు లోపలా, బయట వారు పోరాడుతారు. ప్రస్తుతం పార్లమెంట్లో సీపీఎంకు నలుగురు, సీపీఐకి ఇద్దరు, లిబరేషన్‌కు ఇద్దరు, ఆర్ఎస్పీకి ఒకరు వెరసి మొత్తం లెఫ్ట్ పార్టీల బలం తొమ్మిదికి పెరిగింది.
– మామిండ్ల రమేష్ రాజా