గద్దరన్న పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తుందని, నంది అవార్డులను పునరుద్ధరిస్తుందని తెలిసినప్పుడు ఒక సినిమా వ్యక్తిగా నేను చాలా సంతోషించాను, తెలంగాణవాదిగా కొంత సందేహించాను. నిన్న, ఇవ్వాళ గద్దర్ అవార్డుల కమిటీ ప్రకటనలు చూశాక నేను భయపడిందే జరిగింది. ఇన్ని రోజులు సినిమా అవార్డులు లేవని బాధపడినవారు, ఇప్పుడు ప్రకటించిన ఈ అవార్డులతో తెలంగాణ అస్తిత్వాన్ని సొంత మనుషులే దెబ్బతీయడాన్ని చూసి విలవిల్లాడుతున్నారు.
గతంలో ఇచ్చిన నంది అవార్డులైనా, మరే అవార్డులైనా మొదటి సార్వజనీనత- సమాజానికి వాటివల్ల ఒనగూడే ప్రయోజనం, అది అందించిన సామాజిక చేతనమే కొలబద్ద. వీటి తర్వాతే మిగతా ఏ అంశాలైనా. అయితే ఈ అవార్డులు ఆ దిశ గా తెలంగాణ సినిమాకు చేసే ప్రయోజనం ఏమిటో విజ్ఞులైన జ్యూరీ మెంబర్లు కాని, ప్రభుత్వ పెద్దలు కాని ఇదమిత్థంగా చెప్పగలరా? నాడు మద్రాస్ కేంద్రంగా తెలుగు రాష్ట్రం, అందులో భాగంగా సినీ పరిశ్రమ ఉండేదనేది జగమెరిగిన సత్యం. క్రమంగా టాలీవుడ్ మొత్తం హైదరాబాద్‌కు తరలివచ్చింది. కానీ, పెత్తనం మాత్రం ఆంధ్రా వారిదే. అందుకే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన 2001 నుంచి ‘మన తెలంగాణ సినిమా మనకు కావాలి’ అని నినదిస్తూనే ఉన్నాం. అదృష్టం లేకో, అవకాశాలు రాకో తెలంగాణ సినిమా ఇంకా తండ్లాటల్లోనే ఉన్నది. అలాంటి సమయం లో అవార్డులు ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టినవాళ్లంతా కలిసి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గద్దర్ అవార్డుల ప్రకటన చేశారు. దీన్ని చూస్తుంటే తెలంగాణ సినిమా అనే భావనను సమూలంగా తుడిసిపెట్టే దిశలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది.
తెలంగాణ నుంచి ఆస్కార్ పురస్కారం సాధించిన చంద్రబోస్, ‘మా భూమి’తో నాడే తెలంగాణ సినిమా అంటే ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పిన బి.నర్సింగరావు, కమర్షియల్ సినిమా అంటే ఏమిటో యానిమల్తో చూపించిన సందీప్‌రెడ్డి వంగా.. ఇలా చెప్పుకొంటూపోతే తెలంగాణలో ఎంతోమంది లబ్ధప్రతిష్టులున్నారు. ఎందు కు వీరిని జ్యూరీ సభ్యులుగా తీసుకోలేదనే ప్రశ్న వంటివెన్నో ఉదయిస్తున్నాయి.
2024లో ఉత్తమ నటుడిగా ఎంపికైన ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప పాత్రతో సామాజిక ప్రయోజనమేంటి? ఉత్తమ చిత్రాలుగా ‘షరతులు వర్తిస్తాయి’ వంటివి ఎందుకు పరిగణనలోకి లేకుండాపోయాయి? జనాదరణ పొందడం, భారీ కలెక్షన్లు రాబట్టడ మే ప్రామాణికం అనుకుంటే.. ఉత్తమ సిని మా అనే పేరుకు బదులు అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమా లేదా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా అనే పేరుతో అవార్డు లు అందించవచ్చు కదా. గతంలో ఉన్నవనే సాకుతో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, బీఎన్ రెడ్డి.. తదితర ఆంధ్రా ఆధిపత్యానికి సంకేతమైన పేర్లను కొనసాగించడంలోని ఔచిత్యమేంటి? తెలంగాణ సినీ ప్రముఖుల పేరుతో అవార్డులు ఇవ్వడానికి పైడి జయరాజ్, కాంతారావు ఇద్దరి పేర్లు మాత్రమే కనిపించాయా? అసలు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడటానికి సొంత జాగా ఇచ్చి, వేల మందికి గూడు కల్పించిన మహనీయుడు ప్రభాకర్‌రెడ్డి పేరుతో కనీ సం ఒక్క అవార్డు అయినా ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఎన్టీఆర్ అవార్డును బాలకృష్ణకు ఇచ్చారు. దశాబ్దంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కమర్షియల్ రైటర్ యండమూరి కంటే..
తెలంగాణ అమూలాగ్రాన్ని అద్భుతంగా వర్ణించిన ‘పూసిన పున్న మి వెన్నెల మీన’ వంటి బ్రీత్ లెస్ సాంగ్ అందించిన గోరెటి వెంకన్న.. రఘుపతి వెం కయ్య అవార్డుకు ఎందుకు అర్హులు కాదో చెప్పాలి? కనీసం తెలంగాణ సినిమా అనే పాయింట్ ఒకటుందని పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. తెలంగాణలోని నక్సలిజాన్ని, తెలంగాణ శాంతియుత పోరాటాన్ని చాటిచెప్పేలా 24 క్రాప్ట్స్ తెలంగాణ టెక్నీషియన్స్, ఆర్టిస్టులతో రూపొందిన ‘బందూక్’ చిత్రాన్ని కనీసం పట్టించుకోలేదు. ‘విరాటపర్వం’, ‘జైబోలో తెలంగాణ’ వంటి ఎన్నో సినిమాలు కనీసం స్పెషల్ జ్యూరీ అవార్డులకు కూడా పనికిరాకుండాపోయాయా? ఈ అవార్డుల సరళిలో ఒక సినిమా వ్యక్తి గా నాకనిపించింది ఏమంటే.. రాబోయే రోజుల్లో గద్దర్ అవార్డులను పొందాలంటే సమాజ ప్రగతి ప్రయోజనం కన్నా హింస ను ప్రేరేపించేలా, నేరం చేసేలా, అశ్లీలతకు, అసభ్యతకు, శృంగారానికి పెద్దపీట వేసేలా సినిమా ఉండాలనే ఒక హింట్ ఇచ్చినట్టనిపిస్తున్నది. తన జీవితాంతం నమ్మిన సిద్ధాం తం కోసం కట్టుబడిన ఒక మహా యోధుడు గద్దరన్న. ఇవాళ తన పేరిట అవార్డులు అం దుకున్న సినిమాలను చూసి ఆయన ఆత్మ కచ్చితంగా ఘోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.