భారత రాజ్యాంగం సామాజిక సమానతా ్వన్ని (ఆర్టికల్ 14), మతపరమైన వివక్షను నిషేధించినా (ఆర్టికల్ 15), దళిత క్రైస్తవులకు మాత్రం ‘మతపరమైన అడ్డుగోడ’ అడ్డుపడుతున్నది. ఇది కేవలం రిజర్వేషన్ల సమస్య కాదు. ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయం ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజ్యాంగ వైరుధ్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో క్రైస్తవులు సుమారు 2.78 కోట్ల మంది (2.3%). వీరిలో 70-80% మంది దళిత (ఎస్సీ) నేపథ్యం నుంచి వచ్చినవారు. అంటే సుమారు 2 కోట్ల దళిత క్రైస్తవులు. హిందూ దళితులతో సమానమైన ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం, కుల వివక్ష, అత్యాచారాలను ఎదుర్కొంటున్నారు. అయినా వారికి ఎస్సీ హోదా, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం రక్షణ, రిజర్వేషన్లు లేవు. ఇది రాజ్యాంగ ఆర్టికల్ 15ను నేరుగా ఉల్లంఘించడమేనని న్యాయవాదులు, కమిషన్లు వాదిస్తున్నాయి.
ఎన్ఎస్ఎస్ఓ 2004-05 డాటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని దళిత క్రైస్తవుల్లో 30.1% మంది బీపీఎల్ (పేదరికం రేఖకు దిగువన), హిందూ దళితులు 38%. అయినా దళిత క్రైస్తవులు భూమిహీనులు, మాన్యువల్ లేబర్, డ్రమ్మర్లు, కబ్బర్లు, మాన్యువల్ స్కావెంజింగ్ వంటి వృత్తుల్లోనే ఇరుక్కుపోయి ఉన్నారు. చర్చిల్లో కూడా వారికి ప్రత్యేక సమాధి స్థలాలు, ప్రార్థన స్థలాలు. ఇది మరింత వివక్షకు నిదర్శనం.
చారిత్రక ఆధారాలు: బ్రిటిష్ కాలం నుంచి సాక్ష్యం 1924లో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం G.O.Ms.No.1010 ద్వారా అణగారిన వర్గాల నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారిని కూడా ‘వెనుకబడిన వర్గాలు’గా గుర్తించి విద్యా రాయితీలు ఇచ్చింది. అంటే, 100 ఏండ్ల క్రితమే మతం మారినంత మాత్రాన సామాజిక వెనుకబాటుతనం పోదు అని ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది.
1932లో లోథియన్ కమిటీ (ఫ్రాంచైజ్ కమిటీ) ముందు రావు బహదూర్ పీటీ థామస్ ఇచ్చిన సాక్ష్యం ఇప్పటికీ కీలకం. క్రైస్తవ దళితులు ఇప్పటికీ ప్రత్యేక వాడల్లోనే నివసిస్తున్నారు. అగ్రకులాల నుంచి బహిష్కరణ ఎదుర్కొంటున్నారు. కానీ రాజకీయ సమీకరణలు (ఎంసీ రాజా-మూంజే ఒప్పందం) దళితులను హిందూ ఓటు బ్యాంకులో ఉంచడానికి మొగ్గుచూపాయి.
రాజ్యాంగ వైరుధ్యం: Article 341 vs Article 14
1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ఉత్తర్వు (Constitution (Scheduled Castes) Order) పేరా 3: హిందూ మతం కాకుండా వేరే మతం అనుసరించేవారిని ఎస్సీగా పరిగణించరు. 1956లో సిక్కులు, 1990లో బౌద్ధులకు విస్తరణ ద్వారా ప్రభుత్వం కుల వివక్ష మతాలకు అతీతం అని పరోక్షంగా ఒప్పుకున్నది. కానీ క్రైస్తవ, ఇస్లాం దళితులకు ఎందుకు వర్తింపజేయడం లేదు?
2026 మార్చి 24న సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు (Chinthada Anand vs State of Andhra Pradesh): (జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ మన్మోహన్ బెంచ్ తీర్పు.. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతం (క్రైస్తవం/ఇస్లాం) అనుసరించేవారిని ఎస్సీగా పరిగణించరు. మతం మారిన వెంటనే ఎస్సీ స్టేటస్ తక్షణం కోల్పోతారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మాదిగ (ఎస్సీ) నుంచి క్రైస్తవ పాస్టర్ అయిన చింతాడ అనంద్ కేసులో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయలేమని తేల్చిచెప్పింది. ఇది 1950 ఆర్డర్‌ను absoluteగా నిర్ధారించింది. తిరిగి హిందూ/సిక్కు/బౌద్ధ మతాల్లోకి మారినట్టయితే మాత్రమే స్టేటస్ తిరిగి వచ్చే అవకాశం ఉన్నది.
శాస్త్రీయ కమిషన్లు.. గణాంకాలు అండ్ సిఫార్సులు
‘రంగనాథ్ మిశ్రా కమిషన్ (2007): కులం భారతీయ సామాజిక లక్షణం. అన్ని మతాల్లో చొరబడింది. దళిత క్రైస్తవులు, ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం Article 14ను ఉల్లంఘించడమే. ‘సచార్ కమిటీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్: దళిత క్రైస్తవుల ఆర్థిక స్థితి హిందూ దళితులతో సమానం లేదా అంతకంటే దారుణం. ‘దేశ్‌ముఖ్ అధ్యయనం అండ్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ (2016): చర్చిల్లో ప్రత్యేక శ్మశానాలు, ప్రార్థనా స్థలాలు వివక్షకు స్పష్టమైన నిదర్శనం. ప్రస్తుత స్థితి (2026 మార్చి 26): 20 ఏండ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై కేంద్రం జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ (2022) నివేదిక కోసం వేచి ఉన్నది. కమిషన్ గడువు పలుమార్లు పొడిగించగా 2026 ఏప్రిల్ 10 వరకు ఉన్నది. ఇంకా నివేదిక రాలేదు. కేంద్రం అఫిడవిట్లో ఎస్సీల సంఖ్య పెరిగితే ప్రస్తుత ఎస్సీల హక్కులు దెబ్బతినవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణలోనూ క్రైస్తవ సంఘాలు, సివిల్ రైట్స్ యాక్టివిస్టులు మార్చి 24 తీర్పును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ సమానత్వ సూత్రాలకు గుండెలో గురి అని వారు అన్నారు.
ముఖ్యమైన అంశాలు
ముగ్గురు నేతలు భిన్న దృక్పథాలు (1930)
సామాజిక న్యాయం మత సరిహద్దులను దాటాలి.
1932లో లోథియన్ కమిటీ ముందు వినిపించిన ఆర్తనాదం 2026లోనూ వినబడుతున్నది. బాలకృష్ణన్ కమిషన్ నివేదిక, పార్లమెంటు సవరణఇవి ఈ 94 ఏండ్ల పోరాటాన్ని ముగించగలవు. రాజ్యాంగ లక్ష్యం నెరవేరాలంటే బాధితులందరికీ మతం కాకుండా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా సమాన రక్షణ ఇవ్వాలి.
(వ్యాసకర్త: జాతీయ ఉపాధ్యక్షుడు,అఖిల భారత విశ్వవిద్యాలయ ఉద్యోగుల సమాఖ్య)
డా. పుల్లా శ్రీనివాస్