అభద్రతను కప్పిపుచ్చుకొనే ఆరాటం!
ప్రజల సామూహిక మనస్తత్వం, గత అనుభవాల నుంచి పుట్టిన విశ్వాసం, నాయకుడిపై ఉన్న భావోద్వేగ అనుబంధం ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ప్రజల మనసులలో పాతుకుపోయిన రాజకీయ నమ్మకాలను పదవుల ఎరతో కదిలించగలమని భావించడం రాజకీయ విభ్రమే. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలకే వెనుకాడుతున్న కాంగ్రెస్ నాయకత్వం.. సిరిసిల్లలో కేటీఆర్‌ను, సిద్దిపేటలో హరీశ్‌రావును ఓడిస్తామంటూ తొడలు కొట్టడం మచ్చర్ పహిల్వాన్ మల్లయుద్ధానికి సవాల్ విసరడం వంటిదే.
ప్రజల సామూహిక మనస్తత్వం, గత అనుభవాల నుంచి పుట్టిన విశ్వాసం, నాయకుడిపై ఉన్న భావోద్వేగ అనుబంధం ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ప్రజల మనసులలో పాతుకుపోయిన రాజకీయ నమ్మకాలను పదవుల ఎరతో కదిలించగలమని భావించడం రాజకీయ విభ్రమే. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలకే వెనుకాడుతున్న కాంగ్రెస్ నాయకత్వం.. సిరిసిల్లలో కేటీఆర్‌ను, సిద్దిపేటలో హరీశ్‌రావును ఓడిస్తామంటూ తొడలు కొట్టడం మచ్చర్ పహిల్వాన్ మల్లయుద్ధానికి సవాల్ విసరడం వంటిదే.
ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. కానీ ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్లు ఇస్తామన్నారు. వాళ్లు గాజు కండ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నరు. రైతు భరోసా విషయంలో అన్నదాతల్లో ఉన్న సందేహాలు ఎప్పుడు తీరుతాయో? నిరుద్యోగభృతి హామీ సంగతేమిటి? విద్యార్థులకు ప్రకటించిన విద్యా కార్డులు ఎక్కడివరకు వచ్చాయి? ప్రజల చేతికి అందని, కడుపు నింపని ఉత్తుత్తి హామీలతో ఒరిగేగేమిటి? ఒరిగిందేమిటి?
మూడేండ్ల పాలనలో సొంత ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు కట్టబెట్టలేని నాయకత్వం, ఇప్పుడు ప్రత్యర్థుల కంచుకోటల్లో కొత్త పదవుల హామీతో పాగా వేయాలనుకోవడం అవివేకం. రాజకీయాల్లో పదవికి అధికార బలం ఉంటుంది. కానీ మట్టి మనుషులతో పెనవేసుకున్న అనుబంధానికి అంతకుమించిన శక్తి ఉంటుంది. పదవి పోతే అధికారిక హోదా పోతుంది. కానీ జనంతో సంబంధం బలంగా ఉంటే రాజకీయ ఉనికి శాశ్వతంగా కొనసాగుతుంది.
సిద్దిపేటలో హరీశ్‌రావుకు ఉన్న పట్టును ఈ కోణంలోనే చూడాలి. ఆయన బలం కేవలం రాజకీయ ఓటు బ్యాంక్ లెక్కల్లో కనిపించేది కాదు. గ్రామీణ కార్యకర్తలతో, స్థానిక కుటుంబాలతో ఏండ్ల తరబడి పెనవేసుకున్న అనుబంధాల్లో కనిపిస్తుంది. కరువుతో అల్లాడిన బీడు భూములకు కేసీఆర్ పాలనలో గోదావరి జలాలను మళ్లించి, సిద్దిపేటను సస్యశ్యామలం చేసిన తీరు రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. కార్యకర్తలను పేరుపెట్టి పలుకరించడం, వారి ఇంటి స్థితిగతులను గుర్తుంచుకోవడం, వ్యక్తిగత సమస్యలపై స్పందించడం ఆయన రాజకీయ శైలిలో భాగం. ఒక నాయకుడిని తమ ఇంటి మనిషిగా భావించినప్పుడు ప్రజలతో ఏర్పడే బంధం ఎన్నికల ప్రచారాలకు అతీతంగా విస్తరిస్తుంది.
ఇక్కడ కొన్నేండ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తు చేయాలి. అప్పటికి కమ్యూనికేషన్ విప్లవం ఇప్పటిలా విస్తరించలేదు. అప్పుడప్పుడే సామాన్యులకు మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్న రోజులు. జనానికి రూపాయి కాయిన్బాక్సులే ఆధారం. ఓ రోజు నాసర్‌పురా గ్రామం మొత్తానికి నీటి సరఫరా నిలిచిపోయింది. ఆ ఊరికి చెందిన యాదమ్మ అనే మహిళ ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని అనుకున్నది. కానీ ఆమెకు మున్సిపల్ అధికారులు, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ కూడా గుర్తుకురాలేదు. కాయిన్ బాక్స్ ఫోన్లో రూపాయి వేసి నేరుగా హరీశ్ రావుకే ఫోన్ చేసింది.
తన ఇంటికి నల్లా నీళ్లు రాలేదని గోడు వెల్లబోసుకున్నది. హరీశ్‌రావు వెంటనే స్పందించారు. ముందుగా ఆమె ఇంటికి రెండు క్యాన్ల నీళ్లు పంపించారు. ఆ తర్వాత నీటి సరఫరా ఎందుకు నిలిచిపోయిందో అధికారులను ఆరా తీశారు. సమస్య ఏమిటో స్థానికులకు వివరించాలని కౌన్సిలర్‌ను పంపించారు. ఒక మహిళ ఇంటికి నల్లా నీళ్లు రాకపోతే గుర్తుకొచ్చేంతటి అనుబంధం ఆయనకు ప్రజలతో ఉండేది. ఇప్పటికీ ఆయనకు ‘కాయిన్‌బాక్స్ మంత్రి’ అనే పేరున్నది
ఇదే తరహాలో సిరిసిల్లలో కేటీఆర్‌కు నేతన్నలతో ఉన్న అనుబంధాన్ని పరిశీలించాలి. ఒకప్పుడు సమైక్య పాలకుల ఏలుబడిలో ఆత్మహత్యలతో ‘ఉరిశాల’గా మారిన సిరిసిల్లను, కేసీఆర్ పాలనలో బతుకమ్మ చీరల ఆర్డర్లు, నూలు సబ్సిడీలు, ఆధునిక పవర్‌లూమ్‌లతో ‘సిరిశాల’గా మార్చిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుంది. అక్కడ వేలాది కుటుంబాలకు పవర్లూమ్ పరిశ్రమే జీవనాధారం. నేతన్నల సమస్యలు కేవలం ఒక వృత్తికి సంబంధించినవి మాత్రమే కావు. ఆ కుటుంబాల ఆర్థిక భద్రత, పిల్లల చదువులు, సామాజిక జీవనం అన్నీ వాటితో ముడిపడి ఉంటాయి. మార్కెట్లు, కార్మికుల అడ్డాలు, నేతన్నల కూడళ్లలో వారితో కలిసిపోయి మాట్లాడిన సందర్భాలు కేటీఆర్ స్థానిక సంబంధాలను తెలియజేస్తాయి. సీఎంఆర్ఎఫ్ సాయం, స్థానిక సమస్యలపై స్పందన, రైతుల కష్టాల్లో క్షేత్రస్థాయికి వెళ్లడం, కార్యకర్తలతో నిరంతర అనుబంధం కలిగి ఉండటం ఆయన రాజకీయ పునాదిలో భాగమయ్యాయి. ఇలాంటి గట్టి బంధాన్ని ఒక్క మంత్రి పదవి హామీతో తెంపగలమని రేవంత్‌రెడ్డి భావించడం పగటి కలలు కనడమే అవుతుంది.
రేవంత్‌రెడ్డి ముందు ఉన్న అసలు సవాల్ హరీశ్‌రావును, కేటీఆర్‌ను ఓడించడమా? రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకున్నది. రైతన్న నిలువెల్లా గాయపడుతున్నడు. రుణమాఫీ అందక సగం మంది రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఆ అన్నదాతలను ఒడ్డుకు చేర్చేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళికలు అత్యవసరం. ఆ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేంటి?
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. కానీ ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్లు ఇస్తామన్నారు. వాళ్లు గాజు కండ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్నరు. రైతు భరోసా విషయంలో అన్నదాతల్లో ఉన్న సందేహాలు ఎప్పుడు తీరుతాయో? నిరుద్యోగభృతి హామీ సంగతేమిటి? విద్యార్థులకు ప్రకటించిన విద్యా కార్డులు ఎక్కడివరకు వచ్చాయి? ప్రజల చేతికి అందని, కడుపు నింపని ఉత్తుత్తి హామీలతో ఒరిగేదేమిటి? ఒరిగిందేమిటి? ప్రత్యర్థి కంచుకోటపై యుద్ధం ప్రకటించే ముందు సొంత ఇంటి గోడలు బలంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సొంత గూడు చక్కదిద్దుకోకుండా, సొంత సైన్యంలోనే బీటలు వారుతుంటే ప్రత్యర్థుల కోటలు బద్దలు కొడుతామనుకోవడం రాజకీయ భ్రమ. ముఖ్యమంత్రితో కలిపి 18 మందికి అవకాశం ఉన్నా మంత్రివర్గంలో ప్రస్తుతం 16 మందే ఉన్నారు. రెండు స్థానాలు మూడేండ్లుగా ఖాళీగానే ఉన్నయి. సొంత ఎమ్మెల్యేలకే మంత్రులుగా కుర్చీలు వేయలేని కాంగ్రెస్ నాయకత్వం, కొత్తగా మరో రెండు పదవులు కట్టబెడుతామంటూ హామీలు ఇవ్వడం విడ్డూరం. పాలనపై ప్రజల విశ్వాసాన్ని సంపాదించకుండా నియోజకవర్గాల గెలుపు గురించి మాట్లాడటం నీటిపై రాతలు రాయడమే.
రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ దానికి ప్రాతిపదిక కూడా ఉండాలి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 స్థానాలు దక్కాయి. ఇప్పుడు మరో 26 స్థానాలు అదనంగా గెలుచుకుంటామని రేవంత్‌రెడ్డి బీరాలు పలుకుతున్నరు. అసలు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటి? మళ్లీ గెలుస్తామని ఎలా అనుకుంటున్నరు? మూడేండ్ల పాలనలో ప్రజల జీవితాల్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? ఇచ్చిన హామీలను అమలు చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారా? లేక బీఆర్ఎస్పై చేసే రాజకీయ విమర్శలతోనే గెలుస్తామని అనుకుంటున్నరా?
ఒకవైపు 90 సీట్ల గెలుపుపై కాంగ్రెస్ నేతలు కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిద్దిపేటలో హరీశ్‌రావును, సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిస్తే మంత్రి పదవులు ఇస్తానని హామీలు గుప్పిస్తున్నారు. ఈ రెండు ప్రకటనల మధ్యే అసలు వైరుధ్యం కనిపిస్తున్నది. నిజంగానే ప్రజలు కాంగ్రెస్ పాలనకు పట్టం కడుతారనే నమ్మకం ఆ పార్టీ నాయకులకు ఉంటే ప్రత్యర్థుల నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఇలాంటి ప్రత్యేక తాయిలాలు ఎందుకు? ఓ వైపు గెలుపుపై గాంభీర్యం ప్రదర్శిస్తూ.. గెలిపిస్తే పదవులిస్తామనే ప్రలోభాలు మరోవైపు ఎందుకు? దీన్ని ఆత్మవిశ్వాసం అంటరా? లేక క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ అభద్రతను కప్పిపుచ్చుకొనే ఆరాటం అనుకుంటరా? ప్రజలకు స్పష్టంగానే అర్థమవుతున్నది.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

