‘తుపాకుల మోతలతోటి తూరుపు తెల్లారవట్టే.. గుట్టాపక్కల శవం జూసి గుర్తూ పట్టుట కష్టమాయె.. కుళ్లీపోయిన బిడ్డల ఒళ్లులు గండూచీమలు తినుడు జూసి.. కాలు మీద పుట్టుమచ్చలు తెలంగాణ జిల్లాలోన.. కన్నా కొడుకుల రూపులు తెలిపే తెలంగాణ పల్లెలోన..’ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ పల్లెల పరిస్థితికి ఈ పాట అద్దం పడుతుంది. పోలీసుల దాడులు, ఎన్కౌంటర్లతో రక్తమోడుతున్న కాలం. తినడానికి తిండి లేదు, పొలాలకు నీళ్లు లేవు, కనీసం గౌరవంగానైనా బతికే పరిస్థితి తెలంగాణల లేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందో, ఏ తల్లికి కడుపు శోకం మిగులుతుందో తెలువని భయానక పాలన అది.
పాలస్తీనా గాజాలో తల్లులు తమ పిల్లలకు కంకణాలు కడుతున్నారట. పిల్లలు ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో మరణిస్తే.. ప్రాణాలు కోల్పోయిన తమ పిల్లల మృతదేహాలనైనా గుర్తుపట్టి కడచూపుకు నోచుకోవాలన్న ఆశ వారిది. పాలస్తీనా గాజా పరిస్థితి గురించిన వార్తలు చదువుతున్నప్పుడు నాకు నాటి తెలంగాణలోని పరిస్థితి గుర్తుకువచ్చి గుండె పిసికినట్టయింది.
నిజమే.. నాడు ఎంత ఆవేదన అనుభవించాం. ఎంత దుఃఖం దిగమింగాం. మా ఆదిలాబాద్ ప్రాంతానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఆ మాటను మా ప్రాంత ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ‘అవ్వల్లారా, అయ్యల్లారా! నేను మీ పిల్లలను చదువులు ఇడిసిపెట్టి రోడ్లమీదికి రమ్మని చెప్తలేను. మీ పిల్లలను ఎన్కౌంటర్ గమ్మని చెప్తలేను. నాకు ఓటెయ్యమని అడుగుతున్న. నేను తెలంగాణ రాష్ట్రం సాధిస్తా. పచ్చని తెలంగాణను మీ చేతుల పెడుత’నని కేసీఆర్ చెప్పిన మాటలు మా మనసులను కదిలించినయి. ఆలోచింపజేసినయి. కేసీఆర్ వెంట జెండా పట్టుకనడిచినం. కేసీఆర్‌ను నమ్మినం. మా కోసం కేసీఆర్ మృత్యువు ఒడిలో తలబెట్టి సవాలు విసిరారు. అంతిమంగా తెలంగాణను సాధించారు. సాధించిన తెలంగాణను తోడేళ్ల పాలు చేయలేదు. ఎందుకంటే ప్రజల కష్టసుఖాలు కేసీఆర్‌కే తెలుసు. అందుకనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టాలని, రాష్ర్టాన్ని గట్టెక్కించాలని అందరూ కోరుకున్నరు. రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ఏమేం చేశారనేది ప్రజలందరికీ తెలుసు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కన్నబిడ్డలోలె సాకుతున్నడు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నడు. కడుపు నిండా అన్నం బెడుతున్నడు. ఇంటింటికీ మంచినీళ్లిస్తున్నడు. అన్నిటికి మించి నెత్తురోడుతున్న తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చిండు. ఈ ఒక్క కారణం చాలదా కేసీఆర్‌కు చేతులెత్తి మొక్కడానికి!
ఎక్కడ కాల్పుల శబ్దం వినబడతదో, ఏ నోట ఎన్కౌంటర్ మాట వినవలసి వస్తదో అని కన్నతల్లులు గుండె చిక్కబట్టుకొని బతుకవలసిన పరిస్థితి ఇవాళ లేదు. ఎన్కౌంటర్ జరిగిన కాడికిపోయి, దడదడలాడుతున్న గుండెతో, కన్నీళ్లను కొంగుతో అద్దుకుంటా, ఆ పడి ఉన్నది నా కొడుకు కాదు గదా అని మొహాన్ని చూడటం, ఆ కాల్చిచంపినోళ్లు పిల్లాడి మొహాన్ని చెక్కివేస్తే, కాలుమీది మచ్చల కోసం వెతకడం, ఏ తల్లికైనా ఎంత గుండెకోత! ఆమె కొడుకు కాకపోయినా, ఏ తల్లి కొడుకో కదా అనే బాధ గుండెను పిసుకుతూ ఉంటుంది! అంటూ ఒక తల్లి పడే కడుపుకోత బాధను వర్ణించాడో కవి. ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా’ అంటూ తల్లి హృదయం. అలాంటి ఎందరో తల్లుల కడుపు కోతను తెలంగాణ తల్లి అనుభవించింది. ఆ బాధ ఇప్పుడు తెలంగాణలో ఏ తల్లికీ లేదు.
ఇప్పుడు తెలంగాణ బిడ్డలు గురుకులాల్లో చదువుతున్నారు. హాస్టల్ పిల్లలకు అన్నం కూరలు కొలిచిపెట్టే దౌర్భాగ్యం లేదు. కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం తింటున్నారు. రైతుకు పంట అమ్ముడుపోదనే బాధ లేదు. వ్యవసాయం అంటే దండుగ కాదు, పండుగ. కులవృత్తులు కళకళలాడుతున్నాయి. ఫ్లోరోసిస్ బాధ లేదు. కలుషిత జలాల వల్ల రోగాలు రావడం లేదు. వృద్ధులు కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇంతకన్నా ప్రజలు కోరుకుంటున్నదేమీ లేదు.
ఈ నెల చివరన పోలింగ్ జరుగుతుంది. మనం ఎవరికి ఓటెయ్యాలి? పచ్చని తెలంగాణకు ఓటేద్దామా? నెత్తురోడుతున్న తెలంగాణకు ఓటెద్దామా? మళ్లీ నెత్తురోడే కన్నబిడ్డల కండ్ల ముందే కాటికిపోయే రక్తపు మడుగుల తెలంగాణను కోరి కోరి తెచ్చుకుంటమా? తెలంగాణను రక్తపు మడుగుల్లో ముంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా? చరిత్ర పొడుగునా తెలంగాణను నెత్తుటేర్లలో ముంచింది, దగా, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? సైనిక చర్యతో తెలంగాణను ఇండియన్ యూనియన్‌లో కలిపిన తర్వాత, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించకుండా, అనేక మందిని కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌దే కదా? రెండేండ్ల సైనికపాలన అంతా రక్తసిక్తంగా సాగింది. ఇతర ప్రాంతాల అధికారులను తెచ్చిపెట్టి తెలంగాణ ఉద్యోగులను, ప్రజలను బానిసల్లాగా చూసింది కాంగ్రెస్ పార్టీ కాదా?
1952లో ముల్కీ ఉద్యమం చెలరేగినప్పుడు, సిటీ కాలేజీలో పిల్లలను కాల్చి చంపడానికి కారణం ఈ కాంగ్రెస్ పాలకులే కదా? వద్దు వద్దని ఎంతకోరినా, తెలంగాణను బలవంతంగా ఆంధ్రాతో విలీనం చేసిన పాపం కాంగ్రెస్‌ది కాదా? పెద్ద మనుషుల ఒప్పందాన్ని కాలరాసింది కాంగ్రెస్ నాయకులే. మన పిల్లలకే మన ఉద్యోగాలు వచ్చేవిధంగా నిజాం కాలంలోనే ముల్కీ నిబంధనలు వచ్చినయి. ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని, రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. అయినా సరే, పార్లమెంటు ద్వారా చట్టం చేసి, ముల్కీ నిబంధనలు చెల్లకుండా చేసి, మన ఉద్యోగాలను మనకు కాకుండా చేసింది ఈ కాంగ్రెస్ నాయకులే గదా?. 1969 ఉద్యమం ఉవ్వెత్తున లేచినపుపడు మన విద్యార్థులను పిట్టల్లా కాల్చి చంపించింది కాంగ్రెస్ పార్టీనే. ప్రజలు అంతగా కోరుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ప్రజాస్వామ్య నీతి. కానీ ఇవ్వకుండా కాల్పులతో మారణహోమం సృష్టించింది. ఆరేండ్ల పసికూన కూడా కాల్పుల్లో మరణించింది. ఎదురైన యువకుల నొసటిపై తుపాకీ పెట్టి కాల్చిచంపడం ఎంత ఘోరం.
ఇట్లా విచక్షణారహిత అణచివేతలో వందల మంది బలయ్యారు. ఆ రక్తపు చేతులు కాంగ్రెస్ పార్టీవే. అందుకే తెలంగాణ వాళ్లకు కాంగ్రెస్ హస్తం గుర్తు రక్తంతో కనిపిస్తుంది. ఇంద్రవెల్లి కాల్పులు జరిపి అనేకమంది గిరిజనుల ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? తెలంగాణ ఇస్తమని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని, ఉమ్మడి ప్రణాళికలో పెట్టి కూడా, రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చి కూడా మోసం చేసింది కాంగ్రెస్ నాయకులే కదా? ‘మీ కోరిక ఏంటో నాకు తెలుసు, అది, నెరవేరుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సోనియా గాంధీ ఆ తర్వాత మాట మార్చి బహిరంగసభలో ప్రసంగం చివర ‘జై ఆంధ్రప్రదేశ్’ అని నినాదం చేసింది తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదు.
కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు దిగితే,తెలంగాణ ప్రకటన చేయించి, ఆ తర్వాత మొండిచేయి చూపింది కాంగ్రెస్ పార్టీయే. అందుకే కాంగ్రెస్ హస్తం గుర్తు చూస్తే, తెలంగాణ వారికి మొండి చేయి గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఊగిసలాట వల్ల ఎంతమంది పిల్లలు బలిదానాలు చేసుకోవలసి వచ్చింది! ఆ పాపం కాంగ్రెస్ నాయకులది కాదా?
ఒకవైపు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేస్తుంటే, వలస పాలకులకు దాసోహం అంటూ పదవులు పట్టుకొని వేల్లాడింది కాంగ్రెస్ నాయకులు కాదా? చిన్నారెడ్డి మొదలుకొని ప్రతి నాయకుడూ తెలంగాణ జెండా పట్టుకొని, పదవి ఇవ్వగానే, ఆంధ్రా పాలకులకు ప్రణమిల్లడం తెలిసిందే. వెన్నెముక లేని కాంగ్రెస్ నాయకులు అధిష్ఠానం దగ్గర మోకరిల్లుతారే తప్ప, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటలేరు. ఢిల్లీ పాదుషాల కాళ్లు పిసికే చేతులు, హస్తం గుర్తులు మనకు వద్దు. కష్టాలు, కన్నీళ్లు, ఎన్కౌంటర్లు, బొంబాయి దుబాయి వలసలు, ఫ్లోరోసిస్ పీడలతో కూడిన దుర్భర జీవితాలు మనకు వద్దు. మన పిల్లలను మళ్లీ ఆ దుర్మార్గుల పాలనలోకి తోయవద్దు. మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేయవద్దు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుల మాయమాటలను మనం నమ్మకూడదు. మన పిల్లలకు బతుకులకు భరోసా లేని, నెత్తురోడే కాలం మనకు వద్దు. నాటి పాపిష్టి రోజులను మళ్లీ తెచ్చుకోవద్దు. కాంగ్రెస్‌కు ఓటేసి ఆ పాడు కాలం మళ్లా తెచ్చుకోవద్దు. ఆ కష్టాలు, కన్నీళ్లు మనకు వద్దు. పచ్చటి తెలంగాణకే మన ఓటు వేద్దాం. కేసీఆర్‌నే గెలిపించుకుందాం.
(వ్యాసకర్త: టీ కేసీఆర్ సెంటర్)
-గోసుల మల్లికాయాదవ్
98492 90606