కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి నిజాం కాలంలోనే ప్రతిపాదనలు చేశారు. అప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగమైన ప్రస్తుత కర్ణాటకలో ఉన్న యాద్గిర్ జిల్లాలోని తంగిడి వద్ద భీమా ప్రాజెక్టు, ఆలమట్టి వద్ద అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమకాలువ ద్వారా 174 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిజాం రాజు రూపకల్పన చేశారు. తుంగభద్ర నది నుంచి తెలంగాణకు 65, మద్రాసుకు 65 టీఎంసీలకు సాగునీళ్లు తీసుకునేందుకు హైదరాబాద్ సంస్థానం, మద్రాసు ప్రభుత్వం మధ్య 1944లో ఒప్పందం జరిగింది. ఈ తరుణంలో నిజాం చేతిలో ఉన్న హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనం కావడంతో నిజాం హయాంలో చేసుకున్న ఒప్పందాలు రద్దయ్యాయి. కేంద్రంలోని అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వమే దీనికి ప్రధాన కారణం.
నిందలతో ఏం కోల్పోయినమో ప్రజలకు తెలిసిన రోజు, మీ ద్రోహం తెలిసిన రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నేతలకు రాజకీయ ఉరి వేస్తారు. ఏదేమైనా దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ మాత్రమే. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్లు, 12.30 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద 2 లక్షల ఎకరాలు, భీమా, జూరాల, కోయిల్‌సాగర్ కింద మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇది కాంగ్రెస్ నాయకులకు కనపడకపోవచ్చు. కానీ, గత పదేండ్లలో పాలమూరు ప్రాజెక్టుల కింద పండిన పంటలే దీనికి సాక్ష్యం.
అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టు 86 కిలోమీటర్ల ఎగువన సిద్దేశ్వరం వద్ద నిర్మించాల్సి ఉంది. కొల్లాపూర్ దగ్గర్లోని మంచాలకట్ట సమీపంలో ఉన్న సిద్దేశ్వరం వద్ద ఆ ప్రాజెక్టు నిర్మించి ఉంటే తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందేవి. నందికొండ వద్ద నిర్మించాల్సిన నాగార్జున సాగర్‌ను 24 కిలోమీటర్ల దిగువన నిర్మించారు. తద్వారా ప్రాజెక్టుల ముంపును తెలంగాణకు మిగిల్చి, సాగు నీళ్లను ఆంధ్రాకు తరలించారు అప్పటి వలస పాలకులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన సాగునీటి హక్కుల కోసం ఆనాటి నాయకులు ట్రిబ్యునల్ ముందర సరిగ్గా వాదించలేకపోయారనేది ముమ్మాటికీ వాస్తవం. అప్పటికే సర్వే పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను ట్రిబ్యునల్ ముందు ఉంచకపోగా, వాటి రద్దు కోసం అప్పటికే చేసుకున్న ఒప్పందాలను సైతం విలువలేని వాటిగా పరిగణించేటట్టు వ్యవహరించారు. తుంగభద్ర నది మీద కుడి, ఎడమ వైపులా గల కాలువల కోసం చెరో 65 టీఎంసీలు వాడుకోవాలని నిజాం హయాంలో ఒప్పందం జరిగింది. కానీ, ఆశ్చర్యకరంగా తుంగభద్ర కుడివైపు నీళ్లు కేటాయించుకొని 60 టీఎంసీలు వాడుకుంటూ, తుంగభద్రకు ఎడమ వైపున ఉన్న తెలంగాణకు కనీసం 6 టీఎంసీలు కూడా వాడుకోలేని పరిస్థితిని కల్పించారు.
1969లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మూలంగా తెలంగాణ నష్టపోయిన సాగునీటి వివరాలను అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ట్రిబ్యునల్‌కు వెల్లడించలేదు. నాటి వలస ప్రభుత్వం వివరాలు వెల్లడించకపోయినా, సాగునీళ్లు అడగకపోయినా తీవ్రంగా నష్టపోయిన పాలమూరును చూసి 17.80 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు బచావత్ ప్రకటించారు. సాగర్ ప్రాజెక్టును కిందికి తీసుకుపోయింది చాలదన్నట్టు, ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించినప్పుడు జల విద్యుత్తు ప్రాజెక్టు పేరిట తెలంగాణ ప్రజలను నమ్మించారు. తర్వాతి కాలంలో మద్రాసు నగరం దాహార్తి తీర్చే సాకుతో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక వాటాల నుంచి ఐదు టీఎంసీల చొప్పున 15 టీఎంసీలను పోతిరెడ్డిపాడు వద్ద పొక్క పెట్టి మద్రాసుకు తరలించారు. మంచినీటి తరలింపు పేరుతో కాలువలు తవ్వుతున్న క్రమంలో ‘కడప, నెల్లూరు జిల్లాల ప్రజల కండ్లముందు నుంచి, ఇండ్ల ముందు నుంచి నీళ్లు వెళ్తున్నాయి. కరువుతో ఉన్నాం కాబట్టి, మా పంటల సాగుకు నీళ్లు ఇవ్వండని ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం’ అని ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టు సాగునీళ్ల కోసం కాదని, విద్యుత్ అవసరాల కోసమేనని చెప్పి తెలంగాణ ప్రజలను ఏమార్చి మంచినీటి పేరుతో పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి, తర్వాతి కాలంలో 11 వేల క్యూసెక్కులను 44 వేల క్యూసెక్కులకు పెంచి, అనంతరం దాన్ని మూడు పాయలు చేసి, కాలువ వెడల్పును 72 మీటర్లకు పెంచి ఏకంగా నదినే మలుపుకొనే విధంగా పోతిరెడ్డిపాడును తయారు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదే.
ఆది నుంచి శ్రీశైలం నీళ్లను తెలంగాణకు దూరం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. దానిలో అంతర్భాగమే నీళ్లు లేని జూరాల నుంచి ‘నీళ్లు తీసుకొని వెళ్లండి’ అని చెప్పడం. ‘మొదట అక్కడే నది పారుతుంది. అక్కడే ఎక్కువ మోటర్లు పెట్టండి’ అన్న వాదనను ప్రచారం చేశారు. దీంతో నీళ్లు కావాలనుకొని ఆలోచించే కొందరు నిజమైన తెలంగాణ మేధావులను కూడా ‘జూరాల నుంచి నీళ్లు తీసుకుంటే బాగుంటుండె కదా’ అని మాట్లాడే పరిస్థితికి తీసుకువచ్చారు. ఒకవేళ జూరాల నుంచి గనుక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఎత్తిపోయాలనుకుంటే తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. జూరాలలో 20 నుంచి 25 రోజులు మాత్రమే సగటున భారీ వరద వస్తుంది. ఆ తర్వాత వచ్చే నీళ్లు కనీసం మోటర్లకు సరిపోవు. భీమా ఫేజ్-1, ఫేజ్-2 కింద రెండు లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 46 వేల ఎకరాలు, జూరాల కుడి, ఎడమ కాలువలు కలిపి లక్ష 10 వేల ఎకరాలు.. ఇవన్నీ కలిపి దాదాపు 6 లక్షల ఎకరాలు జూరాల మీద ఆధారపడ్డయి. వీటికే సాగునీరు అందక క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు.
జూరాల మీద ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల పంపులు 40 నుంచి 45 రోజులకు మించి నడవడం లేదు. ఆ పంపుల సామర్థ్యం కూడా 16 నుంచి 20 మెగావాట్లు మాత్రమే. 16-20 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులే 40 నుంచి 45 రోజులు మాత్రమే నడిస్తే.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 పంపులకు సరిపడా నీళ్లు అందించగలిగే కెపాసిటీ జూరాలకు ఉందా? శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులు సగటున ఏడాదికి 230 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి. జూరాల మీద ఆధారపడిన భీమా, నెట్టెంపాడు పంపులు కేవలం 40 నుంచి 45 రోజులే నడుస్తున్నాయి. మరి దీని ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సాగునీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈ నేపథ్యంలో ‘పాలమూరు-రంగారెడ్డికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలి. శ్రీశైలం నుంచి వద్దు’ అనే చెప్పేవాళ్లు ఎవరైనా తెలంగాణ, పాలమూరు ద్రోహులే.
జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టి కోయిల్ కొండ దగ్గర, కొండాపురం వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని కాంగ్రెస్ చెప్పింది. కోయిల్ కొండ వద్ద వెయ్యి ఎకరాలు, కొండాపురం వద్ద 500 ఎకరాల అటవీ భూమి ఉంది. కేంద్ర ప్రభుత్వం వీటికి కచ్చితంగా అటవీ అనుమతులు ఇవ్వదు. జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల చేపడితే 2013 లెక్కల ప్రకారం 46 గ్రామాలు ముంపునకు గురికావడమే కాకుండా 85 వేల మంది ప్రజలు ప్రభావితమవుతారు. 77 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం మూడు లక్షల మంది ప్రభావితమవుతారు. ఇంతా చేసి నిర్మిస్తే జూరాల నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. అంటే అది పూర్తిగా నిరర్థక ప్రాజెక్టుగా నిలిచిపోతుంది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాల మూలంగా తెలంగాణ మునిగి ఆంధ్రాకు ప్రయోజనం చేకూరింది. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో కనీసం భూగర్భజలాలైనా పెరిగే అవకాశం లేకపోయింది. ఎందుకంటే అవి పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మించిన రిజర్వాయర్లలో 68 టీఎంసీల నీళ్లను నింపుకోవడం ద్వారా భౌగోళికంగా కొన్ని మైళ్ల దూరం భూగర్భజలాలు విస్తరించి మరో 10 నుంచి 12 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంటుంది. పదేండ్ల కేసీఆర్ శ్రమ ఫలితంగానే పాలమూరు పచ్చబడింది. పాలమూరు ప్రాజెక్టుతోనే ఈ ప్రాంత ముఖచిత్రం మారుతుంది. పాలమూరు పచ్చబడితే తమ ప్రాంతానికి నష్టమని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం దానికి అడ్డం పడుతున్నది. అందుకు తెలంగాణలోని ఆంధ్రా బానిసలు వంతపాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ ఖర్చులు నేటి లెక్కల ప్రకారం రూ.80 వేల కోట్లుగా అంచనా వేసి, బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు రూ.27 వేల కోట్లు మాత్రమే అని అవివేకంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.32 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టులో కీలకమైన పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్లు, విద్యుత్ స్టేషన్లు నిర్మించిన తర్వాత కాలువలకు టెండర్లు పిలిచాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గద్దెనెక్కిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ కాలువల టెండర్లను రద్దుచేసింది.
తెలంగాణలో ప్రజలకు నీళ్లు, టీఎంసీలు,క్యూసెక్కులు, ప్రాజెక్టులు, సాగునీటి విలువ,అది మార్చే ప్రజలు, ప్రాంతాల ముఖచిత్రాల గురించి తెలియజెప్పింది కేసీఆరే. ‘మనం ఎత్తున ఉన్నాం. మన ప్రాంతానికి నీళ్లు ఎలా వస్తాయి?’ అని ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడిన పరిస్థితి ఉండేది. ఆరు దశాబ్దాల పాలనలో ఏ ఒక్క కాంగ్రెస్ నేత పాలమూరు కోల్పోయిన సాగునీళ్ల గురించి ప్రజలకు తెలియజెప్పలేదు. ఒక్క జూరాల ప్రాజెక్టును ముందుపెట్టి దానినే 40 ఏండ్ల కాలంలో సాధించిన అతిగొప్ప ఘనకార్యంగా చాటుకున్నారు. కర్ణాటకకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని దానిని కూడా ఎన్నడూ నిండా నింపలేదు. చివరకు కేసీఆర్ నిలదీసిన తర్వాతనే పరిహారం చెల్లించారు.
నాటి నుంచి నేటి వరకు శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో తెలంగాణ వాళ్లు వేలు పెట్టకూడదనే ప్రయత్నాలే సాగుతున్నాయి. శ్రీశైలానికి అదనంగా తుంగభద్ర నుంచి 450 టీఎంసీల నీళ్లు వస్తాయి. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని వాదించడమంటే పాలమూరుకు ద్రోహం చేయడమే. నిందలతో ఏం కోల్పోయినమో ప్రజలకు తెలిసిన రోజు, మీ ద్రోహం తెలిసిన రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, నేతలకు రాజకీయ ఉరి వేస్తారు. ఏదేమైనా దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ మాత్రమే. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో 50 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యమున్న రిజర్వాయర్లు, 12.30 లక్షల ఎకరాలకు సాగు నీటితో పాటు కల్వకుర్తి ప్రాజెక్ట్ కింద 2 లక్షల ఎకరాలు, భీమా, జూరాల, కోయిల్‌సాగర్ కింద మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇది ప్రస్తుత కాంగ్రెస్ నాయకులకు కనపడకపోవచ్చు. కానీ, గత పదేండ్లలో పాలమూరు ప్రాజెక్టుల కింద పండిన పంటల గణాంకాలే దీనికి సాక్ష్యం. అందుకే ఏ నాటికైనా ప్రజలకు కనిపించేది సాగు నీళ్లు తెచ్చిన కేసీఆర్ మాత్రమే.
(వ్యాసకర్త: మాజీ మంత్రి, వ్యవసాయ శాఖ)
-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి