గత పాలకులకు అరవై ఏండ్లుగా అనుభవించిన అధికారం ఒక బ్రహ్మ పదార్థం. సొంత ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, సీమాంధ్రులకు తొత్తులుగా మారి, తెలంగాణను విధ్వంసక శకలాలుగా మార్చిన పాపం ఇక్కడి ప్రతిపక్ష రాజకీయ నేతలది! దొంగా.. దొంగా అని దొంగలే అరుస్తున్నారు. రైతులను కాల్చి చంపిన రాక్షసులే రక్షకులమంటూ రంకెలేస్తున్నారు. అమ్ముడుపోయినవారే అబద్ధపు ఆదర్శాలు వల్లిస్తున్నారు.
అతడు మట్టిని నమ్ముకున్న మనిషి. అతని మెతుకు, బతుకు అంతా మట్టే. పెండ్లాం మెడలో పుస్తెలతో సహా అన్నీ అమ్ముకున్నా, ఇంకా మట్టినే నమ్ముకున్నవాడు. ఏయేటికాయేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, చివరికి ప్రాణాలైనా వొదులుతున్నాడు కానీ, ప్రాణమున్నంతవరకు వ్యవసాయాన్ని వదలడం లేదు. అతడే ఈ దేశ రైతు. ఎందుకంటే అతనికి తెలిసింది వ్యవసాయమే తప్ప మరొకటి లేదు.
మన ఆకలి తీర్చడం తప్ప రైతుకు మరో విద్య రాదు. మానవ నాగరికత వికాస తొలిదశ నుంచి నేటివరకు అనేక పరిశోధనలతో, అందిపుచ్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అందరి జీవితాల్లో ఎంతో వెలుగు నిండినా, రైతుల జీవితాల్లో కమ్ముకున్న చిమ్మచీకట్లు ఇంకా తొలగిపోలేదు. 75 ఏండ్లు దాటిన స్వతంత్ర భారతావనిలో ‘దేశానికి వెన్నెముక రైతు’, ‘రైతే రాజు’, ‘జాతికి అన్నం పెట్టే అన్నదాత రైతు’ అంటూ అందమైన మాటలతో, ఆకర్షణీయమైన నినాదాలతో రైతులను ఊదరగొట్టి, వారి జీవితాల్ని మాత్రం అధఃపాతాళానికి తొక్కిన ఘనత గత ప్రభుత్వాలూ, పాలకులదే!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారు కేసీఆర్. పచ్చని పంటలతో వెచ్చగా ఉండాల్సిన రైతు బతుకు బొంబాయి, దుబాయిగా చెల్లాచెదురైన దయనీయ స్థితి ఉండకూడదన్నారు. వ్యవసాయం అంటే దండుగ కాదు, పండుగ అని నిరూపించారు కేసీఆర్. కేసీఆర్ రాష్ర్టాన్ని నిరంతర అధ్యయనంతో ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో ట్రైడిజైనింగ్ చేసి, విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. అరవై ఏండ్లలో ఎవరికీ లేని సోయిని, అధికారాన్ని అందుకున్న అనతికాలంలోనే కేసీఆర్ ప్రదర్శించి, కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళికలను సిద్ధం చేయడం ద్వారా తమ ప్రథమ ప్రాధాన్యం రైతుల సంక్షేమమేనని స్పష్టంగా తెలియజేశారు. కురిసే ప్రతి నీటి బొట్టు ను ఒడిసిపట్టుకోవడంతో పాటు సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఎత్తిపోతల ద్వారా జలాశయాలకు తరలించి, తిరిగి, వాటిని పంట పొలాలకు పరవళ్లు తొక్కించేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయడం కేసీఆర్ అమేయ మేధో సంపత్తికి, రైతుల పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనం.
ఎన్ని ఉన్నా, కరెంటు లేనిదే వ్యవసాయం ముందుకు సాగదు. విభజన తర్వాత మనకు రావాల్సిన 54 శాతం విద్యుత్తు ఇవ్వక కిరణ్‌కుమార్‌రెడ్డి తొండిచేసినా, తెలంగాణ చీకటవుతుందని పగటి కలలు కన్నా, కంటిరెప్ప వాలేంత సేపు కూడా కరెంటు పోనివ్వనని చాలెంజ్ చేసి మరీ రాష్ర్టాన్ని విద్యుత్తు సంక్షోభంలోంచి గట్టెక్కించడంతో పాటు, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు చర్యలు తీసుకున్నారు కేసీఆర్. రూ.95 వేల కోట్లతో 24,500 మెగావాట్ల కొత్త విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులు తమ ఉత్పత్తులను భద్రపరుచుకునేలా అన్ని మండలాలలో రూ.1014 కోట్ల రూపాయలతో ఆధునిక గోడౌన్లు ప్రభుత్వం నిర్మించింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందు లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను నింపి, స్థానిక నీటి అవసరాలను తీర్చడం జరిగింది.
పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ కేంద్రానికి 12 లేఖలు రాసిన చంద్రబాబుపై ఇక్కడి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాసంఘాలమని చెప్పుకొనే వారు నోరు మెదపరు. కానీ, కృష్ణా గోదావరీ నదీ జలాల్లో మనకు దక్కవలసిన 1250 టీఎంసీల నీటిని మొత్తంగా వినియోగించుకొని, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో ఆరంభించిన సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో అడుగడుగునా అడ్డుపడుతారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రైతుల పంట రుణాలు రూ.17 వేల కోట్లను ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా సింహభాగం చెల్లించినందుకు ప్రభుత్వ చర్యను అభినందించలేరు. కానీ, చివరగా మిగిలిన కొద్ది మొత్తాన్ని చెల్లించనందుకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అసత్య ప్రచారం చేస్తారు. నిజానికి 1997-2003 వరకు టీడీపీ పాలనలో 11,604 మంది రైతులు, 2004 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పాలనలో 23,406, మొత్తం వీరిద్దరి హయాంలో 35,010 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పాపం ఎవరిదో ఈ పార్టీలకు, ప్రజా సంఘాలకు తెలియదా? ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, వాటిని ఆపేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో అగ్రనాయకత్వాలను అడిగే దమ్ము ఇక్కడి పార్టీ నేతలకు ఉందా? టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సుదీర్ఘకాలంలో తెలంగాణలో ఎందుకు ఒక్క సాగునీటి ప్రాజెక్టును నిర్మించలేదు? ఎందుకు ఒక్క విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించలేదు? ఎందుకు కరెంటు అడిగిన పాపానికి తూటాల వర్షం కురిపించారు? విద్యుత్తు బకాయిలు చెల్లించలేదని, కరెంటు మోటర్లు ఎందుకు జప్తు చేశారు? ఇన్ని పాపాల ఫలితమే కదా, నిన్నటి వట్టిపోయిన తెలంగాణలోని రైతన్నల ఆత్మహత్యల విషాద సన్నివేశం.
రైతు చితిమంటల్లో చలికాచుకొనే దౌర్భాగ్యపు ఎత్తుగడలు ఎవరికీ మంచిది కాదు. పార్టీలైనా, ప్రజా సంఘాలైనా, ప్రజలైనా, ఎవరైనా నిర్మాణాత్మక సలహాలు, సూచనలతో ముందుకువస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతిస్తారు కేసీఆర్. అలాకాని పక్షంలో లోపాయికారి ఒప్పందాలతో, రక్తికట్టని రైతుబాంధవ నటనలతో, అసత్యాలకు అందమైన తొడుగులతో, ఆగమాగం చెయ్యాలని ప్రయత్నిస్తే, పాలేవో, నీళ్లేవో పసిగట్టగలిగిన తెలంగాణ ప్రజల చైతన్యంలో చావుదెబ్బ తినక తప్పదు. రండి! వచ్చిన తెలంగాణలో బతుకు పచ్చగా ఉంటుందని ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న రైతుల ఆశలకు అందరం ఆసరా అవుదాం! ఉద్యమకాలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన విధంగా ‘కలసిపోదాం లేదా సమాంతరంగా పోదాం’. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుదాం.
అంతేకానీ రైతుల జీవితాలతో రాజకీయాలు వద్దు! ఎందుకంటే అతడు మన కడుపు నింపే అన్నం ముద్ద.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
నారదాసు లక్ష్మణ్‌రావు
98490 59562