బీఆర్ఎస్ రజతోత్సవ సభ… పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. తనదైన శైలిలో ఉపన్యసించిన కేసీఆర్ చురుక్కు చమక్కులతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతేకాదు, పార్టీ క్యాడర్ను కాపాడుకుంటామని ధీమా ఇచ్చారు. ‘తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే రక్ష’ అని మరోసారి స్పష్టమైంది. సభలను నిర్వహించటంలో తమకు తామే సాటి అని బీఆర్ఎస్ నిరూపించుకున్నది.
బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సభకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసం గం గులాబీ శ్రేణుల్లో మాంచి జోష్ నింపింది. మొన్నటి సభ ఉద్యమ సమయంలో ఇదే వరంగల్ గడ్డపై నిర్వహించిన మహాగర్జనను తలపించింది. ఏప్రిల్ మండుటెండలను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలతో సభా ప్రాంగణం సంద్రంలా మారింది. సభ చుట్టుపక్కలా దాదా పు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇసుక వేస్తే రాలనంత జనం వరంగల్ సభలో కనిపించారు. తెలంగాణలోని పల్లెలు, పట్టణాలన్నీ గులాబీ రంగుతో నిండిపోయాయి. ఓరుగల్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుగల్లుగా మారింది. తన వాగ్ధాటితో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడినప్పుడు సభకు వచ్చిన ప్రజలు కేరింతలతో మద్దతు తెలిపారు. ఇప్పుడు ఉద్యమాలు, ఎన్నికలు లేవు, ఆ పార్టీ అధికారంలో కూడా లేదు కానీ, వరంగల్ సభ వన దేవతలైన సమ్మక-సారలమ్మ జాతరను తలపించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను కేసీఆ ర్ కడిగిపారేశారు. ఆయన ప్రసంగం వినేటందు కు సభకు లక్షలాది మంది వస్తే… టీవీల్లో, సోషల్ మీడియాలో కోట్లాది మంది ఎదురుచూశారు. ఇది కదా కేసీఆర్ చరిష్మా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరితరం కాదని ఈ వరంగల్ సభ నిరూపించింది. ముందుకు పోవాల్సిన తెలంగాణ ఎలా వెనక్కివెళ్తున్నదో వివరించిన కేసీఆర్… వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ప్రజలను, పార్టీ శ్రేణులను కేసుల పేరిట వేధిస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అణచివేతతో అడ్డుకోలేరన్నప్పుడు సభకు వచ్చినవాళ్లు చూపించిన మద్దతే బీఆర్ఎస్ గెలుస్తుందనటానికి నిదర్శనం. ఇక రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని భావిస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రస్తావించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను తెలంగాణ నుడికారంతో వివరించారు. ‘మొలక అలకరా మొగోడా అంటే ఎలుకను చూసి ఎల్లెలుకల పడ్డడట’ వంటి సామెతలతో ప్రజలను ఉర్రూతలూగించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రోజు బయట ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కానీ, ఈ ఒక్క కేసీఆర్ ప్రసంగం వాళ్లకు చెంపపెట్టు వంటిదే. ఈ సభ నిర్వహణ కలిగించిన ఊపుతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయం. ఇప్పటికే లగచర్ల, హెచ్సీయూ అంశాల్లో పోరాట పటిమ ప్రదర్శించిన బీఆర్ఎస్కు కేసీఆర్ వరంగల్ ఉపన్యాసం మరింత బలాన్ని చేకూర్చింది. పదునైన వాగ్ధాటితో, ఉరిమే ఉపన్యాసంతో ఉద్యమం నాటి కేసీఆర్ను ప్రజలు నిన్న మళ్లీ చూశారనడంలో సందేహం లేదు.