‘అంజన్నా… గమనించినవానే వొచ్చిన జన జాతరలో తొంభై శాతం మంది యువతనే’ అని ఓ జర్నలిస్టు ప్రతినిధి నిన్న కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నాతో అంటుండగనే ఒక్కసారి తలుపు ఊడిపోయిన శబ్దం వచ్చింది. ప్రధాన ద్వారం వైపు వెళ్లి చూస్తే గుండెల నిండా అభిమానంతో ఊగిపోతున్న నవతరం కనిపించింది. అప్పటికే రాత్రి 8 గంటల సమయం దాటిపోతున్నది.
ఉదయం మొదలైన జన ప్రవాహం ఆగటమే లేదు. ఏం చేసైనా సరే కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపే తిరిగివెళ్లాలని, ఆయనతో ఫొటో దిగడానికి ఎవరితోనైనా యుద్ధానికి కూడా సిద్ధపడే వచ్చారని చూసిన వారెవరికైనా అర్థమౌతున్నది. ప్రధాన ద్వారాన్ని విరగొట్టి, ఆపే ప్రయత్నం చేస్తున్న పార్టీ నాయకులతో గొడవ పడుతూ పెద్ద సార్‌ను ఎలాగైనా కలిసి తీరాల్సిందేనని వారంతా పడుతున్న తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యం వేసింది.
ఆ క్రమంలో ‘ఎప్పుడు మీరే సార్ చుట్టూ ఉంటారా..?, మమ్మల్ని కలువనియ్యరా?’ అని ఆవేశంగా అరుస్తూ, ఆపే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదికి దాడి చేసినంత పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ గమ్మత్తు సంఘటన జరిగింది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రెండు చేతులు జోడించి ‘బాబు మీకు దండం పెడతా, ఊపిరి ఆడటం లేదు, బయటకు వెళ్లండి’ అని మొక్కారు. అప్పుడు వెంటనే ఒక యువకుడు ప్రశాంత్‌రెడ్డి పాదాలపై సాష్టాంగపడి, ‘అన్నా… ఎట్లనన్న ఈ రోజు సార్‌ను కలవాలె, ప్లీజ్ నన్ను ఆపొద్ద’ని అరవడంతో ఏం చేయాలో తోచక మాజీ మంత్రి మౌనం దాల్చాడు. కొంతమంది దంపతులైతే వారి చిన్నారులను వెంట తీసుకొచ్చి, సార్‌తో ఫొటో దింపించడం కోసం, ఆశీస్సులు ఇప్పించడం కోసం తపనపడుతున్నారు. కేసీఆర్‌ను కలిసిరాగానే వెంటనే ఆ ఫొటో కావాల్నని ఫొటో తీసినవారి వెంటపడి తరుముతున్నారు. ఇలా ఎన్నెన్నో భావోద్వేగాలకు, అభిమానావేశ సన్నివేశాలకు నిన్న ఎర్రవెల్లి వేదికగా మారింది. ఊర్ల నుంచి ఉప్పెనలా కదిలివచ్చి, మమకార మహోత్సవంలో కదం తొక్కారు.
మిట్ట మధ్యాహ్నం ఊగిపోతున్న వేల మందిని కలుస్తూ, వారితో ఫొటోలు దిగుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంటల పాటు శాంతపరిచేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. చొక్కాలు చిరుగుతున్నా, చెమటతో తడిసి ముద్దవుతున్నా చల్లబడటం లేదు. వాళ్లు వెనుతిరిగే ఆలోచనే చేయడం లేదు. గుంపులు గుంపులుగా గంటల తరబడి నిలబడే నినాదాలిచ్చారు. జిందాబాద్‌లతో వ్యవసాయ క్షేత్రంలో ప్రేమను పండించారు. పెద్దసార్ను కలిసేందుకు గంటల కొద్దీ ఎదురుచూస్తూనే, చర్చల్లో మునిగితేలుతున్నారు. ఆ ముచ్చట్లపై కూడా చెవి వేసిన మాకు ‘అరేయ్ కొడుకులు, కేసీఆర్ ఫాంహౌస్ మీద అదీ, ఇదని ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిండ్రురా, ఏముందిరా ఇక్కడ’ అని గట్టిగా ఆవేశంతో మాట్లాడుకుంటున్న మాటలు వినపడుతున్నాయి. ‘ఫామ్‌హౌస్ మీదనే కాదు, మొత్తం మోసపు మాటలే చెప్పి ముంచేసిండ్రు గా.. కొడుకులు’ అంటూ రాయలేని భాషలో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. అభిమానం, ఆనందం.. ఇలా సకల భావోద్వేగాల సంబురానికి ఎర్రవెల్లి వేదికైంది. తరలివచ్చిన వేల మందిలో ఖద్దరు చొక్కాలు కొన్నే కానీ, మామూలు చొక్కాలెన్నో… మొత్తం సామాన్య నవతరమే.
వాస్తవానికి అధికారానికి దూరమై సుమారు ఏడాదిన్నర కావొస్తున్నది. ఈ 15 నెలల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై, కేసీఆర్ కుటుంబంపై రేవంత్ సర్కార్ ఎంత విషం కక్కిందో కదా..? బ్లేమ్ గేమ్నే గవర్నమెంట్ పాలసీగా మార్చుకొని, క్యాబినెట్ మొత్తం విషపు నాలుకలను బయటేసుకొని ఊరేగడం చరిత్రలోనే బహుశా ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. పాలనా వ్యవస్థలను ఉసిగొల్పి, ప్రధాన మీడియాను నోటికి తొడుక్కొని సర్కారే నిత్యం అబద్ధాలతో దాడికి దిగింది. నీళ్లల్లో విషం కుమ్మరించాలని, విద్యుత్తు వెలుగులపై అసత్యాలను ఆరవేయాలని ప్రభుత్వం పడరాని పాట్లన్నీ పడ్డది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా సందర్భం, సమావేశమేదైనా కేసీఆర్‌పై విష ప్రచారానికే రేవంత్ సర్కార్ వాడుకున్నది.
కేసీఆర్ చరిత్రలో కొసరంతకూ చేరువయ్యే చేవలేక, బీఆర్ఎస్ ప్రభుత్వ పనితనానికి ఏ కోణంలోనూ పోటీ పడలేక, పరనిందనే విధానంగా రేవంత్ సర్కార్ సుమారు ఏడాదిన్నర కాలాన్ని ఎల్లదీసింది. ఈ దుర్మార్గమైన పాలనను ఎదిరించాల్సిన బీజేపీ దిగజారి, కాంగ్రెస్ కుట్రాజకీయానికి బహిరంగంగానే దండలేసి వంతపాడుతున్నది. రెండు జాతీయపార్టీలు ఒక్కటై తెలంగాణకు, కేసీఆర్‌కు మధ్య బంధాన్ని వధించాలని ఎన్నో పన్నాగాలు పన్నారు. అసలుకు ఆకాశమే హద్దుగా హస్తం, కమలం పార్టీలు కలిసి నిలబెట్టిన అబద్ధాల దెయ్యం ముందు కేసీఆర్ కాకుండా మరొక నాయకుడైతే జనానికి దూరమైపోయేవాడు.
కానీ, తెలంగాణకు గుండె ధైర్యంగా గులాబీ జెం డాను అందించడంతో పాటు, పంజరం నుంచి విడిపించి, ఎగరేసిన తెల్ల పావురంలా, తెలంగాణకు స్వేచ్ఛా రెక్కలు సమకూర్చిన కేసీఆర్, ప్రజారాశుల అనుభవంలో ప్రగతిశీల మార్పునకు కారణమయ్యా రు. ప్రభుత్వ పాలనావ్యవస్థకు విప్లవాత్మకతను జోడించి, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు భిన్న పార్శ్వాల రాబడిని సుస్థిరం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధినే కాదు, నూతన దృక్పథాన్ని వెలిగించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకే, కేసీఆర్ కారణజన్ముడయ్యారు. పదవులకు అతీతమైన ప్రజా రాశులందరి ప్రేమను పొందారు. అందుకే నిన్నటి కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలో ప్రజా వేడుకలయ్యాయి.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్