కుట్రల క్రీనీడలు అలుముకున్న తెలంగాణ నీటి హక్కుల చరిత్రలో ఆ క్రీనీడలను చీల్చుకుంటూ సాగిన యోధుడు కేసీఆర్. నాడు సమైక్య పాలకులు శ్రీశైలాన్ని విద్యుదుత్పత్తి నెపంతో కట్టి తర్వాత తెలుగుగంగను తెరపైకి తెచ్చి, ఆ ముసుగులో లక్షలాది క్యూసెక్కుల నీళ్లను బేసిన్ అవతలికి తరలించే పోతిరెడ్డిపాడును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లను సృష్టించారు. మన నోటి కూడును ఎత్తుకుపోయారు. అది వారి వ్యూహం.. వారి ప్రాంతం పట్ల వారికి ఉన్న ‘ప్రేమ’. అదే వ్యూహంతో, అదే పంతంతో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు ఎడారి కావొద్దని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేసీఆర్ ప్రాణం పోశారు.
పాలమూరు వలసల దుఃఖాన్ని చూసి కన్నీరు కార్చిన కన్ను అది.. నల్లగొండ ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కిన నల్లగొండ బిడ్డల వెన్నుపూసల విలవిలలను ఆలకించిన చెవి అది. అందుకే, అనేకానేక అడ్డంకులను ఛేదించి ప్రాజెక్టు పనులను ముందుకు ఉరికించారు. ఏ ప్రాజెక్టు కట్టినా ఆంధ్రప్రదేశ్ పాలకులు అడ్డుపడతారని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆంధ్ర పాలకులు అనుసరించిన ‘ముందు ప్రాజెక్టు కట్టడం – ఆపై కేటాయింపులు సాధించడం’ అనే ‘ఫైట్ అండ్ గెయిన్’ స్ట్రాటజీనే కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి విషయంలో అవలంబించారు.
7.5 టీఎంసీల తాగునీటి అవసరాల సాకుతో, ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించి ముందుకు నడిపించేందుకు కేసీఆర్ ఒక పకడ్బందీ వ్యూహానికి శ్రీకారం చుట్టారు. దాని వెనుక భవిష్యత్తులో 173 టీఎంసీల సాగునీటిని మళ్లించి, కరువు కోరల్లో చిక్కుకున్న పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే అంతర్లీన వ్యూహం ఉంది.
కానీ, దురదృష్టవశాత్తు.. ఇంటికి వెలుగు కావాల్సిన దీపమే ఇల్లంతా కాలబెట్టినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ అండ్ కో మన రాష్ట్ర నీటి హక్కుల కోసం పన్నిన వ్యూహాలను ప్రత్యర్థులకు విడమర్చి చెప్తున్నారు. రాష్ట్ర రహస్యాలను రచ్చకీడుస్తున్నారు. దాన్ని నేరంగా చిత్రీకరిస్తూ ‘ఆత్మద్రోహం, జనద్రోహం జలద్రోహాల’కు పాల్పడుతున్నారు. యుద్ధరంగంలో ఉండాల్సిన సేనాధిపతే, కోవర్టుగా మారి కోట రహస్యాలు చేరవేస్తున్న తీరును చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోతోంది. 5 టీఎంసీల తాగునీటి కోసం తెలుగుగంగ అన్నది ఎటువంటి వ్యూహమో.. 7 టీఎంసీల తాగునీటి కోసం పాలమూరు-రంగారెడ్డి నిర్మాణం అటువంటి వ్యూహమే. బేసిన్లో ఇప్పటికే నిర్మాణమై ఉన్న ప్రాజెక్టుకు నీళ్లివ్వకుండా బేసిన్లో లేని ప్రాంతాలకు ఎట్లా ఇస్తారనే న్యాయమైన, బలమైన వాదనను రేపు కేడబ్ల్యూడీ 2 ముందు వినిపించడం కోసం, కృష్ణాలో మన నీటిహక్కులను స్థిరపరచడం కోసం ముందుచూపుతో పాలమూరు-రంగారెడ్డి నిర్మాణం చేసిండ్రు కేసీఆర్.
బనకచర్ల, నల్లమల సాగర్ పేరు ఏమైనా కావచ్చు, చంద్రబాబు అదే పాత కుట్రను అమలు చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించి, అనివార్యతను క్రియేట్ చేసి, హక్కులు సాధించుకోవాలని చూస్తున్నారు. కానీ, రేవంత్ సర్కార్ మాత్రం ఆ కుట్రలకు అడ్డుకట్ట వేయలేకపోగా కేసీఆర్ వ్యూహాలను దెబ్బతీసేలా, తెలంగాణను నిరాయుధంగా మార్చేలా వ్యవహరిస్తున్నది. బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి ఆడిన నాటకం అంతాఇంతా కాదు. ‘ఢిల్లీకి వెళ్లను.. బనకచర్లపై రాజీపడను’ అంటూ వీరడైలాగులు వల్లించారు.
తీరా చూస్తే గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి ఆ మీటింగ్‌లో వాలిపోయారు. ఎజెండాలో బనకచర్ల లేదంటూ అబద్ధాలు చెప్పారు. కానీ, ఎజెండా కాపీలు బయటకొచ్చి ఆయనను దోషిగా నిలబెట్టాయి. ‘కమిటీ వేయనివ్వను’ అని గర్జించి, లోలోపల లొంగిపోయి కమిటీకి అంగీకరించారు. ఆ కమిటీకి బాబుకు విశ్వాసపాత్రుడైన ఆదిత్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా నియమించారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని, హక్కులను ఢిల్లీ నడివీధిలో
తాకట్టు పెట్టడం కాక మరేమిటి?
ఇక రాయలసీమ ఎత్తిపోతల (ఆర్ఎల్ఎస్) పనులపై రేవంత్‌రెడ్డి చెప్పిన ‘వినయ విధేయ’ కథ అతిపెద్ద ప్రహసనం. ‘చంద్రబాబు నా వినయపూర్వక వినతిని ఆలకించి, నా మీద ఉన్న గౌరవంతో ప్రాజెక్టు ఆపేశారు’ అని ఆయన చెప్పుకొంటే.. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెంప మీద గట్టిగా చరిచింది. “మేము ఆపింది నీ గౌరవం కోసం కాదు.. నాడు 2020లోనే ఎన్జీటీలో కేసీఆర్ పోరాడి తెచ్చిన ‘స్టే’ వల్ల మాత్రమే” అని ఏపీ ప్రకటన చేయడంతో రేవంత్‌రెడ్డి వాదనంతా అబద్ధాల అతుకుల బొంత అని తేలిపోయింది.
తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పోరాట ఫలితాన్ని, సాధించిన విజయాన్ని పక్క రాష్ట్ర పాలకుల ప్రాపకం కోసం తక్కువ చేసి, అబద్ధాలతో ప్రజలను వంచించడం రేవంత్‌రెడ్డి వక్రీకరణకు పరాకాష్ఠ. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కొన్ని లక్షల ఎకరాల సాగునీటి స్వప్నాలు ఇవాళ రేవంత్‌రెడ్డి అపరిపక్వత, బాబుకు దాసోహమనే ద్రోహ చింతన వల్ల ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు కేసీఆర్ ఒక్కో నీటి చుక్క కోసం నిరంతరం పరితపిస్తే, రేవంత్‌రెడ్డి మాత్రం చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణ నీటి ప్రయోజనాలను ధారపోస్తున్నారు.
గుర్తుంచుకోండి రేవంత్‌రెడ్డి గారు.. పదవులు శాశ్వతం కాదు. కానీ, మీరు చేసే ప్రతి ద్రోహం తెలంగాణ చరిత్ర పుటల్లో చెరగని మచ్చగా మిగిలిపోతుంది. కేసీఆర్ పట్ల మీకున్న కక్ష.. తెలంగాణ రైతాంగం మీద కక్షగా పరిణమిస్తున్నదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ నేల మీద, నీటి మీద ఉన్న ‘కన్సర్న్’ ఒక దార్శనికతతో, గొప్ప బాధ్యతతో కూడుకున్నది. అది అర్థం చేసుకోవడానికి ‘నిజమైన తెలంగాణ తనం’ ఉండాలి. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించడమంటే.. కేసీఆర్‌ను వ్యతిరేకించడం కాదు, తెలంగాణ రైతాంగం గొంతు నులమడమే. అబద్ధాల పునాదుల మీద పాలన సాగించవచ్చు కానీ.. చరిత్రను, చారిత్రక సాక్ష్యాలను చెరిపివేయలేరు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే, తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే కాదు, జల చరిత్రలోనూ ఒక ‘విద్రోహి’గా మిగిలిపోక తప్పదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ విప్, శాసనమండలి)
దేశపతి శ్రీనివాస్