నటరాజు స్వరూపమైన గుస్సాడీ నృత్యం ఆగిపోయింది. ఆదివాసీ సంస్కృతికి ప్రతీకగా నిలిచే నృత్యరూపకానికి వన్నెతెచ్చిన గజ్జెల సప్పుడు నిలిచిపోయింది. అంతరించిపోయే దశకు చేరుకున్న గుస్సాడీ నృత్యాన్ని దశాబ్దాలుగా పరిరక్షిస్తున్న పద్మశ్రీ కనకరాజు పరమపదించి ఆదివాసీ కళాలోకాన్ని శోకసంద్రంలో ముంచారు.
గిరిజనుల దేవనాట్యంగా ప్రసిద్ధిచెందిన గుస్సాడీ నృత్య పరిరక్షణకు కనకరాజు ఎంతగానో కృషిచేశారు. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ నృత్యాన్ని బతికించుకునేందుకు నాలుగు దశాబ్దాల కిందటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు గోండు పెద్దలు నడుం బిగించారు. అదే జిల్లాలోని ఉట్నూర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కీ.శే. మడావి తుకారాం.. గోండు యువకులకు గుస్సాడీ నృత్యాన్ని నేర్పించేందుకు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పిట్టగూడలో శిక్షణ తరగతులు నిర్వహించారు. నాడు యువకులకు శిక్షణ ఇచ్చినవారిలో కనకరాజు ప్రముఖులు కావడం విశేషం. ఆయన వద్ద శిక్షణ పొందిన వందకు పైగా యువకులలో లయగతులు (స్టెప్స్) వేయడంలో సుమారుగా 65 మంది మాత్ర మే సఫలమయ్యారు. అనంతరకాలంలో కనకరాజు, వారి ప్రశిష్యులు గుస్సాడీ నృత్యాన్ని ఎంతోమందికి నేర్పించి, ఆ కళను పరిరక్షించారు.
నాలుగు దశాబ్దాల క్రితమే కనకరాజు ప్రతిభ దేశానికి తెలిసింది. ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. 1982లో ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో కనకరాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఆయన నృత్యాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మంత్రముగ్ధులయ్యారు. తాను కూడా గుస్సాడీ నృత్య ప్రదర్శన చేస్తానని ఇందిరాగాంధీ ఉత్సాహం చూపగా వెంటనే తన కాళ్ల గజ్జెలను కనకరాజు ఆమెకు ఇచ్చారు. కనకరాజు బృందంతో పాటు ఆమె కూడా ఆనందోత్సాహాలతో నర్తించారు. ఆ అరుదైన సంఘటనను కనకరాజు తన తుది శ్వాస వరకు మననం చేసుకుంటూనే ఉండేవారు. 2002లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలో కనకరాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.
గుస్సాడీ నృత్యానికి కనకరాజు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2021 నవంబర్ 9న ఢిల్లీలో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై, గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖల మంత్రులు, పలు సంస్థలు ఆయనను సన్మానించాయి. కేసీఆర్ ప్రభుత్వం రూ.కోటి విలువ చేసే భూమి, ఇల్లు, వాహనం ఇచ్చి సత్కరించింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉన్న ఐటీడీఏలో పద్మశ్రీ కనకరాజు నృత్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కనకరాజు మార్గదర్శనంలో వందలాది మంది గిరిజన విద్యార్థులకు గుస్సాడీ నృత్యంలో కేసీఆర్ సర్కార్ శిక్షణ ఇప్పించింది. అలా కళను బతికించి, భావితరాలకు అందించేందుకు కనకరాజుతో కలిసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషిచేసింది.
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో జన్మించిన కనకరాజు తెలంగాణ గర్వించే స్థాయికి ఎదిగారు. కనకరాజుకు నలుగురు కుమారులు, తొమ్మిది మంది కుమార్తెలు. తండ్రి కళా వారసత్వాన్ని ఆయన రెండో కుమారుడు సుదర్శన్ కొనసాగిస్తుండటం ముదావహం. అయితే, గత కొంతకాలంగా ముదిమి వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కనకరాజు గుస్సాడీ ఉత్సవాలు జరిగే దీపావళికి ముందే ఈ లోకాన్ని వీడటం బాధాకరం. ఆయన మృతి ఆదివాసీ కళాలోకానికి తీరని లోటు. దశాబ్దాల తరబడి వ్యయప్రయాసలకోర్చి కనకరాజు పరిరక్షించిన గుస్సాడీ నృత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
-డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ
94909 57078