అగ్రరాజ్యమైన అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఎన్నో ప్రశ్నలకు, అనేక సందేహాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. చివరి నిమిషం వరకు సర్వశక్తులొడ్డి పోరాడిన నల్ల కలువ కమలా హ్యారిస్ ఓటమి వెనుక పైకి కనిపించని కారణాలెన్నో ఉన్నాయన్న విషయం ఈ ఎన్నికల ద్వారా మనకు అవగతమైంది. వ్యవస్థీకృతమైన లింగవివక్ష, పురుషాధిక్య రాజకీయ వ్యవస్థ, మహిళా నాయకత్వం పట్ల చిన్నచూపు లాంటి అంశాలు కమలా హ్యారిస్ ఓటమికి ప్రత్యక్షంగా దోహదపడ్డాయి. రాజకీయ అర్హత, పరిపాలనా అనుభవం, విద్యార్హతల వంటి అనేక అంశాలను దాటుకొని అధ్యక్ష రేసులో నిలిచిన కమలా హ్యారిస్‌పై లింగవివక్ష పైచేయి సాధించింది.
కమలా హ్యారిస్ ఓటమి ఆమె వ్యక్తిగతం కాదు. అది ప్రపంచంలోని యావత్ మహిళా లోకానిది. ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి, అభ్యుద య భావాలకు నిలయమని చెప్పుకునే అమెరికాలో ఒక మహిళ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు, వైట్‌హౌజ్‌లో అడుగు పెట్టేందుకు ఆపసోపాలు పడుతుండటం దేనికి సంకేతం? అమెరికా రాజకీయాల్లో మహిళలు ఏం సాధించలేదని కాదు, ప్రజాప్రతినిధులుగా మహిళామణులు ఎంతో మంది తమ పదవులకు వన్నె తీసుకువచ్చారు. కానీ, అధ్యక్షురాలి పీఠం మాత్రం వారికి అందని ద్రాక్షగానే మిగులుతున్నది. ఇప్పటివరకు ఒక్క మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కాకపోవడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒక మహిళను తమ దేశ అధ్యక్షురాలిగా అమెరికా ప్రజలు ఎందుకు ఇష్టపడటం లేదు. ఇది మహిళా నాయకత్వం పట్ల వారికున్న అశక్తతకు నిదర్శనంగానే చెప్పవచ్చు.
మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకునే అవకాశాన్ని అమెరికా రెండుసార్లు కోల్పోయింది. 2016లో హిల్లరీ క్లింటన్, 2024లో కమలాహ్యారిస్ చివరి వరకు పోరాడి ఓటమి పాలయ్యారు. వారి ఓటమికి ప్రధాన కారణం లింగ వివక్షే. ప్రపంచ పెదన్నగా పిలిచే అమెరికాలో లింగ వివక్ష నేటిది కాదు. అన్ని దేశాల్లో వలె 1920 వరకు అమెరికాలో కూడా మహిళలకు ఓటు హక్కు లేదు. సుసాన్ బీ ఆంథోని నాయకత్వంలో జరిగిన ఉద్యమ ఫలితంగా అమెరికా మహిళలకు ఓటు హక్కు లభించింది. ఆ తర్వాత అనేక మంది నారీమణులు ప్రజాప్రతినిధులయ్యారు. మొదటి మహిళా స్పీకర్‌గా నాన్సీ ఫెలోసీ రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడే స్థాయికి ఎదిగారు. అయితే, పురుషాధిక్యత, లింగవివక్ష కారణంగా వారు విజయతీరాలకు చేరలేకపోయారు. అయితే, అమెరికాతో పోలిస్తే ఆసియా ఖండంలో, ప్రత్యేకించి దక్షిణాసియాలో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉంటాయనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతానికి చెందిన చాలామంది మహిళలు తమ దేశాధినేతలుగా సేవలందించారు. భారత్‌లో ఇందిరాగాంధీ, శ్రీలంకలో సిరిమావో బండారనాయకే, పాకిస్థాన్‌లో బెనజీర్ భుట్టో, బంగ్లాదేశ్‌లో ఖలేదా జియా, షేక్ హసీనా, మయన్మార్‌లో ఆంగ్‌సాన్ సూకీ ఆయా దేశాధినేతలుగా రాణించారు.
ఇక మన దేశం విషయానికి వస్తే.. దేశ రాజకీయాల్లో ఎంతోమంది మహిళలు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. 1925లో జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సరోజినీ నాయుడు ఎన్నిక కావడంతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతున్నది. అయితే, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి. ఆమె మన దేశ ఏకైక మహిళా ప్రధాని. ఆమె మరణం తర్వాత ఇప్పటివరకు మరో మహిళ ప్రధాని పీఠాన్ని అధిరోహించలేదు. నందినీ సత్పతి, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, తాజాగా మర్లేనా ఆతిశీ ముఖ్యమంత్రులుగా రాణించినప్పటికీ ప్రధాని స్థాయికి మాత్రం చేరుకోలేకపోయారు.
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నప్పటికీ అవకాశాలు మాత్రం కొందరికే దక్కాయి.
పితృస్వామ్య రాజకీయ వ్యవస్థ ఉండటమే అందుకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పురుషాధిక్యతే కొనసాగుతున్నది. మహిళల సామర్థ్యాన్ని కూడా పురుషులే నిర్ణయిస్తుండటంతో అతివలు ఇప్పటికీ వివక్షకు గురవుతునే ఉన్నారు.
అయితే, మన దేశంలో జాతీయోద్యమం మొదలు తెలంగాణ సాయు ధ పోరాటం, తొలి దశ, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో పురుషులతో దీటుగా మహిళలు కదం తొక్కారు. కానీ, రాజకీయ అవకాశాలు మాత్రం పురుషులకే ఎక్కువగా లభించాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్ల పరిస్థితి కొంతవరకు మెరుగైనప్పటికీ ఇంకా మహిళలు స్వతంత్రంగా బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితులు లేవు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా మహిళలు ఎన్నికవుతున్నా.. వారిని నామమాత్రంగా చూపిస్తూ భర్తలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత పార్లమెంట్ మహిళా బిల్లును ఆమోదించడం శుభ పరిణామం. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు దక్కుతాయి. మహిళలకు హక్కుగా దక్కాల్సిన సీట్లను వారికే రాజకీయ పార్టీలు కచ్చితంగా కేటాయించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే 2025లో జనగణన చేయనున్న కేంద్ర ప్రభుత్వం 2026లో డీలిమిటేషన్ ప్రక్రియను షురూ చేయనున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళామణులు సంసిద్ధంగా ఉండాలి. ప్రతి అవకాశాన్ని ఒక మెట్టుగా మలుచుకొని అతివలు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి మహిళలు మానసికంగా దృఢంగా తయారవ్వాలి. రాజకీయంగా బలోపేతమవ్వాలి.
ప్రతి పురుషుని విజయం వెనుక మహిళే ఉంటుందని అనాదిగా పెద్దలు చెప్తూనే ఉన్నారు. అలాంటి మహిళను ముందువరుసలో నిలబెట్టేందుకు పురుషాధికత్య, లింగవివక్షలు ఎందుకు అడ్డు వస్తున్నాయో అర్థం కాని స్థితి యావత్ ప్రపంచంలో నెలకొన్నది. ఇకనైనా ఆ స్థితి కనుమరుగు కావాలి. అందుకు అగ్రరాజ్యమైన అమెరికానే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాలు మహిళలకు పెద్దపీట వేయాలి. ఇక మన విషయానికి వస్తే.. స్థానిక సంస్థలు, చట్టసభలు, విధానపరమైన నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములయ్యే దాకా మహిళా సాధికారిత సంపూర్ణం కాదనే విషయాన్ని మహిళలు గుర్తుంచుకోవాలి. మాట్లాడితే చాలు మహిళల కోసం ఇది చేశాం, అది చేశాం అని గొప్పలకు పోయే ప్రభుత్వాలు ఇకనైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకురాలు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్)
-తుల ఉమ