పద్నాలుగేండ్ల పాటు స్వేదం చిందించి మలిదశ ఉద్యమాన్ని సాగు చేసిన కేసీఆర్‌కు స్వరాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యం. తెలంగాణ ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే కేసీఆర్ తొలి ప్రాధాన్యం. ఆయనను దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా నేను మీకొక ఉదాహరణ చెప్పదలచుకున్నాను. 2023, డిసెంబర్ 3వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మధ్యాహ్నం రెండు గంటల కల్లా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుతాన్ని ఏర్పాటు చేయబోతున్నదో దాదాపు ఖరారైంది. అప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హూందాగా ‘ప్రగతిభవన్’ను వీడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతలో కొందరు వ్యక్తులు (పేర్లు చెప్పదలచుకోలేదు) సార్ దగ్గరికి వచ్చారు. ‘సార్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కాంగ్రెస్ పార్టీకి సరిపడా సంఖ్యాబలం ఉన్నా… ఆ పార్టీలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కొందరికి ఇష్టం లేదు. రేవంత్ వ్యతిరేక వర్గ ఎమ్మెల్యేలు మనతో కలిసివచ్చే అవకాశాలున్నాయి, మనం మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు’నని అన్నారు.
కుర్చీలో కెళ్లి లేచి నిలబడిన కేసీఆర్ పై సూచనలు చేసిన వ్యక్తులతో ‘అలాంటి నీతిమాలిన పనులు కేసీఆర్ ఏనాడూ చేయలే. ఇప్పుడు కూడా చేయడు. అయినా ప్రజలు ఈసారి మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రజా నిర్ణయమే మనకు శిరోధార్యం. మనం ప్రతిపక్షంలోనే కూర్చుందాం. ప్రతిపక్ష హోదాలో తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకుందాం, మనం అధికా రంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ అభివృద్ధి కొనసాగాలి..’ అని చెప్తూనే నవ్వుతూ ప్రగతిభవన్‌ను వీడారు. ఆయనే స్వయంగా కారు తీసుకొని సెక్యూరిటీని కూడా వదిలి సాధారణ వ్యక్తి వలె ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌కు బయల్దేరారు. ఆ రోజు, ఆ సందర్భంలో అక్కడ నేనూ ఉన్నాను. ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం. ఇదీ కేసీఆర్ రాజకీయ హుందాతనం.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
2023, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే.. హస్తం పాలకులు గెలిచి, నిలిచి తెలంగాణను గెలిపించాలని స్వరాష్ట్ర కీర్తిని శిఖరం అంత ఎత్తున నిలబెట్టాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. అందుకే, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకు శుభం కలగాలని దీవెనార్థులిచ్చారు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌పై చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ తన కురచబుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకుంటున్నారు.
ప్రభుత్వాలు మారినా తెలంగాణ అభివృద్ధి చెందాలనేది కేసీఆర్ ఆశయం. అందుకే, అధికారం కోల్పోయాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక్కరే ప్రగతి భవన్‌ను వీడారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమం చేసి సహకరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా.. సొంత పార్టీ నేతలే పొగ పెట్టాలని చూశారు. రేవంత్ వ్యతిరేక వర్గీయులు కాలం కలసివస్తే సీఎం పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని చూశారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యతిరేకులను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు పలువురు సూచించారు. వారి సూచనలను కేసీఆర్ ఏకోన్ముఖంగా కొట్టిపారేశారు. కొన్నిరోజుల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓ ఛానల్‌కు ఇంట ర్వ్యూ ఇచ్చిన ఆయన తెలంగాణను విజయతీరాలకు చేర్చాలని ఆకాంక్షించారు. ఆయన మొదటిరోజు ఏదైతో చెప్పారో, అలాగే, హుందాగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన ఆదేశానుసారం పార్టీ శ్రేణులు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా గంతులేస్తుందో, అలా గంతులేస్తూ అందివచ్చిన అవకాశాన్ని అరికాళ్లతో తన్నేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై దుర్భాషలాడటానికే పరిమితమవుతున్నారు. మైక్ కనిపిస్తే చాలు వేదిక, సందర్భంతో సంబంధం లేకుండా బూతు పురాణం మొదలుపెడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే సోయి మరిచి వ్యవహరిస్తున్నారు.
గతంలో కేటీఆర్, హరీశ్‌రావు, కేసీఆర్ మనుమడు హిమాన్షుపై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి.. తాజాగా మంచీ చెడు మరిచి, కన్ను మిన్ను కానరాక.. ‘కట్టె లేకుండా నిలబడు చాలు’ అంటూ యావత్ దివ్యాంగ లోకాన్ని అవమానించారు.కట్టె పట్టుకున్నవాళ్లంతా పనికిరానివాళ్లని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇది ఆయన కురచ బుద్ధికి నిదర్శనం. కట్టె పట్టుకొని చరిత్రకు పట్టిన చెదను దులిపిన ఎందరో కారణజన్ముల గురించి రేవంత్‌కు తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కట్టెతోనే జాతిపిత మహాత్మా గాంధీ బ్రిటిషర్లను తరిమి తరిమి కొట్టారు. కట్టెతో జరిగిన కదనాన్ని జయించిన మహాత్ముడి గురించి రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్‌కు ఎరుక లేకపోవడం విడ్డూరమేమీ కాదు.
ప్రపంచ యవనికపై తెలంగాణ పరువు తీస్తున్న ఆయనకు.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కట్టె సాయంతోనే తరిమికొట్టి దక్షిణాఫ్రికాను నిశీధి నుంచి వెలుగులోకి నడిపించిన నల్ల సూరీడు నెల్సన్ మండేలా గురించి తెలుస్తుందనుకోవడం మన తప్పు. కండబలం ఉన్నదని విర్రవీగే రేవంత్‌కు బుద్ధిబలంతో ప్రపంచానికి దారిచూపిన స్టీఫెన్ హ్యాకింగ్ గురించి ఏ మాత్రం తెలియదనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా వెరవకుండా సంప్రదాయ నృత్యానికే వన్నె తెచ్చిన సుధా చంద్రన్ గురించి రేవంత్ తెలుసుకోవాలి. పోలియోతో కుర్చీకే పరిమితమైనప్పటికీ ప్రముఖ వైద్యుడు సురేష్ హెచ్ అద్వానీ మన దేశంలో మొదటి బోన్ మ్యారో చికిత్సను చేయలేదా? పక్షవాతంతో బాధపడుతున్న అజిత్ జోగి ఛత్తీస్‌గఢ్ సీఎం పీఠాన్ని అధిరోహించలేదా? వీల్‌చైర్‌లోనే ఉంటూ తమిళనాడుకు కరుణానిధి దశ దిశ చూపలేదా? అంతెందుకు రేవంత్‌రెడ్డి మామ జైపాల్‌రెడ్డి గురించి ఆయనకే తెలియకపోవడం బాధాకరం. పోలియో బారినపడిన జైపాల్‌రెడ్డి కట్టె సాయంతోనే పార్లమెంటు బాట పట్టారు.
నాయకత్వం అనేది వ్యక్తిత్వం, వ్యక్తుల ఆలోచనలు, ఆశయాలను బట్టి ఉంటుంది తప్ప, శరీరాకృతిని బట్టి కాదు. నాయకుడికి కండబలం ఉంటేనే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ ఇలా తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన కేసీఆర్‌ను దూషించడం ఆయనకు ఏ మాత్రం శోభనివ్వదు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి అధికారం కోల్పోయాక ఆయనను కూడా ఇలాగే దుర్భాషలాడితే ఒప్పుకొంటారా? ఆయన అనేది ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీని 70 అంగుళాల ఛాతి గల మనిషి అని అందరూ అంటున్నారు. ఈ విషయంలో శారీరకంగా పోలిస్తే మోదీతో రాహుల్ సరితూగగలరా? ఈ విషయం రాహుల్‌కు రేవంత్‌రెడ్డి చెప్పగలరా? ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కేసీఆర్‌కు పోరాటం కొత్త కాదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో పదవులను ఆయన అధిరోహించారు. ఎన్నో పదవులను త్యజించారు కూడా. రాజీనామాను అస్ర్తాలుగా సం ధించి సమైక్యవాదులను, తెలంగాణ వ్యతిరేకులనెందరినో పడగొట్టారు. తెలంగాణ వాదాన్ని నిత్యం, సజీవంగా నిలబెట్టారు.
తెలంగాణ ఉన్నంతవరకు కేసీఆర్ చరిత్ర చెరిగిపోదు. పోతుందనుకోవడం మందబుద్ధి గల మనుషుల భ్రమ. గెలుపోటములతో సంబంధం లేని మహా మనీషి కేసీఆర్. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఆయన కీర్తికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. రాజ్యాంగ రచన చేసి, బడుగు బలహీనులకు బాట చూపిన అంబేద్కర్ కూడా కుత్సితబుద్ధి గల మనుషులతో ఇమడలేక, వారు చేసిన కుట్రలు, కుతంత్రాల ఎన్నికల్లో ఓడిపోయారు. అంతమాత్రాన ఆయన కీర్తి చెరిగిపోయిందా? బడుగులతో పెనవేసుకున్న బంధం తెగిపోయిందా?
కేసీఆర్ కట్టె లేకుండా నిలబడుడు కాదు, తెలంగాణను యావత్ ప్రపంచ చిత్రపటంలో నిటారుగా నిలబెట్టిండు. తెలంగాణను అభివృద్ధిలో అంగలు వేయించి, సంక్షేమంలో తనకెవరు సాటిలేరని నిరూపించిండు. తెలంగాణ ప్రతిష్ఠను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలబెట్టిండు. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ కీర్తి, ప్రతిష్ఠలను అధః పాతాళానికి అణచివేస్తున్నడు. అందుకే, కేసీఆర్ నిలబెట్టిన తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడగొట్టకుంటే చాలు. అదే తెలంగాణ ప్రజలకు మహాభాగ్యం.