ఇంగ్లీష్‌లో poetic justice అనే పదబంధం ఉన్నది. కవితా న్యాయం అని అర్థం. ఆధ్యాత్మికులు దీన్ని law of karma అని కూడా అంటారు. ఘనత వహించిన సీబీఐ, ఈడీకి దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం చేసిన వ్యాఖ్యలు కవితా న్యాయం! రాజ్యాంగబద్ధ వ్యవస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకొని దుష్ట రాజకీయానికి తెగబడిన బీజేపీకి కొట్టిన సుప్రీం దెబ్బ నిశ్చయంగా గొప్ప ప్రజాస్వామ్య విజయం. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ధ్వంసం చేద్దామనే బీజేపీ కూహకాన్ని విధ్వంసం చేసిన చారిత్రక ఘటన తెలంగాణ ఉద్యమకారిణి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం! Nothing more, nothing less!!‘
MLC Kavitha | మీ ఇష్టారాజ్యం నడువదు’ అన్న సుప్రీం హెచ్చరిక పొయెటిక్ జస్టిస్ లాంటి కర్మ ఫలమే. ‘మొండిదానిని జగమొండి చేసిన్ర’ని కవిత అన్న మాటలు మనకు సంకేతం, స్ఫూర్తి కావాలి. తమపై కక్ష గట్టిన బీజేపీపై తెలంగాణ సమాజం జగమొండిగా కొట్లాడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే కేసీఆర్‌కు కవిత ఒక్కరే బిడ్డ కాదు. రాష్ట్ర సాధకుని పిల్లలమే మనమంతా! మన చైతన్యమే అసలు సిసలు కవితా న్యాయం!
‘సామాజిక సేవారంగంలో కృషిచేస్తూ, ఎంపీగా, ఎమ్మెల్సీగా సేవలందించే మహిళ ఎక్కడికీ పారిపోదు. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని ఈ విచారణ కోసం ఆమెను నిరంతరం జైలులో ఉంచడం తగదు’ అని కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
తెలంగాణలో ఏ మూలకు పోయినా బతుక మ్మ అనగానే గుర్తొచ్చే రూపం కల్వకుంట్ల కవిత. ‘జాగృతి’ ద్వారా సమాజాన్ని తట్టిలేపడం ముమ్మాటికీ సామాజిక సేవయే. సేవ కంటే సామాజిక సంస్కరణ అనడం సమంజసం. నది తను ప్రవహించే నేలంతా సారవంతం చేసినట్టు… కేసీఆర్ తెలంగాణను చైతన్యపరుస్తూ, తానూ పులకిస్తూ మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించిన్రు. ఆయన తనయగా, బాధ్యత గల్ల తెలంగాణ బిడ్డగా కవిత తన వంతు పాత్ర అజేయంగా పోషించిన్రు. సాధించుకున్న తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన్రు కేసీఆర్. ‘ప్రగతిలో మీరు నెంబర్ వన్’ అంటూ అలుపు లేకుండా ప్రతిరోజూ తెలంగాణకు అవార్డులు, రివార్డులు పదేండ్ల పాటు ఇచ్చిన ఆర్బీఐ, నీతి ఆయోగ్, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల దగ్గర ఆ సమాచారం ఉంటుంది, ఎవరైనా తెప్పించుకోవచ్చు!
అట్లా ధగద్ధగాయమానంగా, జగజ్జేయంగా వెలుగుతున్న తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తం చేయాలని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన్రు కేసీఆర్. రాజకీయాల్లో గుణాత్మక మార్పు ద్వారా దేశ నవ నిర్మాణం కోసం కేసీఆర్ ఎత్తుకున్న ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ యజ్ఞం నుంచి పైకి రేగిన నిప్పు రవ్వలు బీజేపీకి కలవరం పుట్టించినై! పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల్లాగ భిక్షుక దేశం కాదు.. చైనా, సింగపూర్, మలేషియాల్లాగ సుభిక్ష దేశం కావాలని ఆశించే మీరూ, నేనూ, మనందరి లాగ కవిత కూడా బీఆర్ఎస్ యజ్ఞంలో భాగస్వామి.
మరోవైపు మోదీకి పక్కనే బల్లెంలా కేజ్రీవాల్ మారిన్రు. మొహల్లా క్లినిక్‌లు, అందరికీ స్వచ్ఛమైన నీళ్లు, నాణ్యమైన విద్యుత్తు, దేశం అంతకు ముందు ఎప్పుడూ చూడని స్థాయిలో విద్యాల యాల ద్వారా ఢిల్లీ ప్రజల జీవన ప్రమాణాలు ‘ఆప్’ సర్కార్ పెంచడం, ప్రజల మద్దతుతో వెలిగిపోతున్న ‘ఆప్’ ప్రభ బీజేపీకి కంటగింపైంది.
తన మాట వినని, తనకు నచ్చని ప్రభుత్వాలను తొమ్మిదింటిని కూల్చింది బీజేపీ. ఆ పనే చేయబోయి తెలంగాణలో చేతులూ, మూతీ అన్నీ కాల్చుకున్నది. ఇక అప్పటి నుంచి వారికి కునుకు లేదు. కేసీఆర్, కేజ్రీవాల్‌ను కట్టడి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నది. ‘లిక్కర్ కేసు’ పేర అభియోగం మోపి కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి, 165 రోజులు జైలులో ఉంచింది. నిన్న సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీలపై చేసిన వ్యాఖ్యలు నిజానికి నరేంద్ర మోదీకి తగులుతయి.
మనం ఏయే అభివృద్ధి సూచీలలో ఎంతెంత వెనుకబడి ఉన్నామో, ఎట్లా మన దేశాన్ని ప్రపంచంలో మేటి శక్తిగా తయారు చేయవచ్చో మీకందరికీ తెలుసు. గణాంకాల సైతంగా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పి ఉన్నరు. అవన్నీ ఒక్క క్లిక్‌తో మీకు దొరుకుతయి కాబట్టి ఆ వివరాల్లోకి పోవడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు.
సకల వనరులు ఉన్నై, వాటిని ఉపయోగంలో పెట్టే సకల జనమూ ఉన్నరు, ప్రపంచం ఆశ్చర్యపోయే అభివృద్ధి సాధ్యమే, పదేండ్ల తెలంగాణ నిలువెత్తు ఉదాహరణగా ఉన్నది, దేశానికి దివిటీ చూపిస్తున్నది… పదండి దేశాన్ని బాగు చేసుకుందాం’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చిన్రు. దేశభక్తి మీద భక్తి తప్ప దేశం మీద భక్తి లేని మూకలు సహజంగానే సహించలేని రాజకీయం కేసీఆర్‌ది. ఆ టాస్క్ మాస్టర్ గొంతు నులమాలని బీజేపీ కంకణం కట్టుకున్నది. అందులో భాగమే ఎమ్మెల్సీ కవిత అరెస్టు.
https://www.indiabudget.gov.in/doc/rec/annex9.pdf ఈ ఫైల్ ఓపెన్ చేయండి విజ్ఞులారా. భారత ప్రభుత్వ ఆర్థికశాఖ వెబ్సైట్లో ఉన్న అధికార అప్పుల చిట్టా అది. మన దేశ అప్పు రూ.1,81,68,456 కోట్లు!. ఈ తెచ్చిన పైసలన్నీ ఏమైనయి? ఎవరికి పెట్టిన్రు? మీకు ఎవరికన్నా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపునకు వాడిండా మోదీ? జేబులో పర్సును చూసి రెండొందలా లేక ఒక వంద చాలేమో అంటూ చింతలు పడుతూ బండిలో పెట్రోల్ పోయించే మిమ్మల్ని ఏమన్నా ఆదుకోవడానికి విదిలిస్తున్నడా ఆ పైసలు? పెన్సిల్, షార్ప్‌నర్‌పై జీఎస్టీ వేసి మీ చిన్నారుల చదువును మొద్దుబార్చడం తప్ప వారికేమన్న తాతలా సహాయపడుతున్నడా? ‘యోగక్షేమం వహామ్యహమ్’ అని లోగో పెట్టుకుని జీవనంలోనూ, జీవనం అనంతరమూ భరోసా పడే ఎల్ఐసీని భక్షిస్తూ మీ భద్ర జీవనానికి తూట్లు పొడిచే పాలసీ ఎందుకు తెచ్చిండు? అన్నేసి కోట్ల అప్పు లు మన మీద రుద్ది ఇంకా కక్కుర్తి ఎందుకు? మీ అవ్వాతాతలకు రైళ్లలో రాయితీ ఎత్తేసి మిగిల్చిన పైసలు ఏమి చేస్తున్నడు? ఎందుకు అందరికీ తాగునీరు లేదు. ఎందుకు వ్యవసాయ భూము లు ఎండిపోతున్నయి? ఎందుకు కరెంటు లేక చీక ట్లో వేలాది గ్రామాలు మగ్గుతున్నయి? ఏమి చేస్తున్నరు ఆ పైసలన్నీ? ఎవరికి దోచిపెడుతున్నరు?
ఇగో… ఈ ప్రశ్నలడిగిండు కేసీఆర్. ఆ ప్రశ్నలను సమాధి చేయడానికి, అడుగుతున్నవారిని దెబ్బ కొట్టడానికి సినిమాలో చీప్ విలన్ చేసే పనే మోదీ చేస్తున్నడు. అదే కల్వకుంట్ల కవితపై దాడి. దేశం నివ్వెరపోయే మహా దోపిడీ వ్యవహారం నుంచి అదానీని రక్షించే పనిలో ఉన్న మోదీ… పార్లమెంట్లో సరైన ప్రశ్నలు రావొద్దు అనుకుంటున్నడు. అందుకే కుత్సితమైన ప్రశ్నలు ఈడీ ద్వారా వేయిస్తున్నడు. మనమైనా ఆలోచించవద్దా, ప్రశ్నలు ఏవి, ప్రశ్నలను ప్రశ్నించాల్సిన ప్రశ్నలేవి అని, మేధావులారా?!
‘20 నెలల పాటు విచారణ జరిపి, 493 మంది సాక్షులను, 57 మంది నిందితులను విచారించామని చెప్తున్నరు. 50 వేల పేజీల కొద్దీ సాక్ష్యాలు సేకరించినట్టు రికార్డుల్లో పేర్కొన్నరు. మీరన్నట్టు.. ఇంత పెద్ద స్కామ్ జరిగితే, ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకపోవడమేంటి? అసలు స్కామ్ జరిగినట్టు రుజువులేమిటి? పిటిషనర్ అయిన మహిళ ఐదు నెలలుగా విచారణ ఖైదీగా జైల్లోనే ఉన్నరు. పూర్తి కేసు తేలేందుకు చాలా సమయం పడుతుంది. విచారణ భవిష్యత్తులో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఈడీ దాడులకు గురై ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకొని కేసులలోంచి బయటపడ్డ ఎందరో నాయకుల పేర్లు ఈ వాక్యాలు చదువుతుండగానే మీకు స్ఫురిస్తాయి. అంటే బీజేపీ రిక్రూట్మెంట్ సెల్‌గా ఈడీ ఎంతటి నీచ పాత్ర పోషిస్తున్నదో తెలుస్తున్నది కదా. సుప్రీం కొరడా ఝళిపింపు అందుకే!
‘నిందితులను ఇష్టమొచ్చిన రీతిలో అప్రూవర్లుగా మార్చి, వారిచే అనైతిక స్టేట్మెంట్లు ఇప్పించారంటూ సుప్రీం వాడిన పదజాలం బీజేపీకి సిగ్గుచేటు. అయినా కేంద్ర మంత్రి బండి సంజయ్ వదరుబోతు మాటలు మానలేదు. సుప్రీంకోర్టుకే తప్పుడు ఉద్దేశాలు ఆపాదిస్తూ రాజకీయ పార్టీలకు తలొగ్గుతోందనే ధ్వని వచ్చేట్టు బాధ్యతారాహిత్యంగా మాటలాడిండు! అటు కాంగ్రెస్ ఏమీ తక్కువ తినలేదు. సోనియా, రాహుల్, రేవంత్‌ల బెయిళ్లు కూడా సుప్రీం రాజకీయమేనా? ఇంత వాచాలతను సహించాలా? సుప్రీంకోర్టుపై ప్రజల విశ్వాసం సన్నగిల్లితే రాజ్యాంగానికే ప్రమాదం కదా? వీధి రౌడీల్లాంటి ఈ రెండు పార్టీలపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టాలి. మినుకు మినుకుమనే ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయాలి.
ఒకటే కేసులో కేజ్రీవాల్‌పై ఒకరకంగా, కవితపై మరొక రకంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్. ఇలాంటి చిల్లర పార్టీలతో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని ఇద్దరూ పోటీ పడి ప్రచారం చేయడం హాస్యాస్పదం. మురికి కూపాలలో మునిగి తేలడానికి బీఆర్ఎస్ చరిత్ర లేని పార్టీ కాదు, చరిత్రా, భూగోళమూ సృష్టించిన సునామీ బీఆర్ఎస్! అలాంటి పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై రాజకీయ పార్టీలకంటే అధ్వాన్నపు విష ప్రచారానికి ఒడిగట్టిన యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికలు పునరాలోచించుకోవాలి. మీ వ్యక్తిగత కోపాలు వ్యవస్థలను నాశనం చేసే శక్తులకు ఆయుధాలైతున్నయి. ఆయుధాలకు విచక్షణ ఉండదు. అవి రేపు మీపై కూడా విరుచుకుపడుతయి. చరిత్రలో అలాంటి దృష్టాంతాలు కోకొల్లలుగా ఉన్నయి. గమనించండి, తెలివి తెచ్చుకోండి, బాధ్యతగా మెలగండి.
విజ్ఞులైన ప్రజావళి లోతుగా ఆలోచించాలి. తెలంగాణను, దేశాన్ని కబళించాలని చూస్తున్న రెండు జాతీయపార్టీల పట్ల అప్రమత్తత అవసరం. అందుకోసమైనా పార్టీలకతీతంగా కవితకు దన్నుగా నిలవాలి, కేసీఆర్‌కు అండగా ఉండాలి.
సుప్రీం ఒక దారి చూపించింది. ముళ్లుంటై ముప్పులుంటై, కానీ తప్పదు- ఈ దేశం కోసం! సిద్ధమే కదా?! జై భారత్!!
-శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371