అతి విశ్వాసానికి, అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మన్యూనతకు తేడా తెలియని తనం కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ‘పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టు’ అనే సామెతకు అద్దం పడుతున్నది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని డేట్, టైం ఫిక్స్ చేసుకొని, కార్డులు కూడా ఊరూరా పంచుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే అది ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు చేస్తున్న ప్రయత్నమా? లేక ప్రజలను ఏమార్చే కుట్రతోనా? అన్నది లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కాదు.
నిజానికి కాంగ్రెస్ పార్టీలో మిగతా వారంతా తోలుబొమ్మలని తను మాత్రమే కీలుబొమ్మ అని తన స్వయం ప్రకటనలు, ఆర్భాటాలు, హంగులతో రేవంత్‌రెడ్డి సొంత ప్రణాళికతో ఉన్నారని స్పష్టమవుతున్నది. ఒక మీడియా అధిపతి నిర్వహించిన ఇష్టాగోష్టిలో రేవంత్‌ను డ్రైవ్ చేస్తున్న తీరు, వెనుక నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే తప్ప అసలు విషయం బోధపడదు. నిజానికి రేవంత్, సదరు మీడియాధిపతి, ఆయన వెనుక ఉన్న చంద్రబాబు నీడ భవిష్యత్తులో తెలంగాణను ఆగం చేస్తుందా? అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
2018లో మహాకూటమి ముసుగులో రేవంత్ భుజంపై తుపాకి పెట్టి తెలంగాణ జనాన్ని కాల్చాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలను తెలంగాణ సమాజం పసిగట్టి ఏ స్ఫూర్తిని ప్రదర్శించిందో, అచ్చం అదే స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించవలసిన అవసరం ఏర్పడుతున్నది. గతంలో రేవంత్‌తో చెట్టపట్టాలేసుకుని తిరిగి ఇప్పుడు టీడీపీగానీ, చంద్రబాబు గానీ పోటీలో ఉంటే రేవంత్ పార్టీ గెలువడం కష్టమని తెలంగాణలో చాప చుట్టేసింది టీడీపీ. ఆ పార్టీకి మిగిలిన కాసిన్ని కమ్మ సామాజికవర్గపు ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే చంద్రబాబు పరోక్ష సహకారం కాంగ్రెస్ పార్టీకే ఉన్నట్టు సదరు మీడియాధిపతి, రేవంత్ ఇంటర్వూలో స్పష్టమైంది.
సీల్డ్ కవర్ సీఎం సంస్కృతి గల కాంగ్రెస్ పార్టీలో తను సీల్డ్ కవర్ సీఎంను కాదని, నేనే సీఎంను అని రేవంత్ చెప్పుకున్నారు. అంతేకాదు డిసెంబర్ 9న సంతకం చేసి వస్తా సాయంత్రం నాకు మీ చానల్లో అరగంట టైం ఇవ్వండనడాన్ని ఎలా చూడాలి? రేవంత్ అహంకార ప్రవర్తనతో కాంగ్రెస్ పార్టీలో ముసలం బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో ఊదరగొడుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంటే, మరోవైపు ముఖ్యమంత్రి నేనంటే, నేననే వాదన కొత్త పంచాయతీలు సృష్టిస్తున్నది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు రేవంత్ సీఎం అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారా? నిజం గా రేవంత్‌కు ఆ హామీ ఇచ్చి ఉంటే పార్టీ సిద్ధాంతం ఎటు పోతున్నదనే చర్చ ఇప్పుడు పార్టీలో విస్తృతంగా సాగుతున్నది. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న క్రమంలో, ఆ పార్టీ సీనియర్లు గెలుపోటములపై తర్జనభర్జనపడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో నేనే సీఎం..అనే అహంకారపు ధోరణి చూస్తుంటే ‘శివ లింగం మీద తేలు’ సామెత గుర్తుకొస్తున్నది. స్వయం ప్రకటిత సీఎం ప్రకటనను విని తెలంగాణ సమాజం నివ్వెరపోతున్నది. అధికారంలోకి రాకముందే ఇన్ని మాయలు చేస్తే రేపు రాష్ర్టాన్ని ఇంకెంత మాయ చేస్తారనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
తమ పార్టీలో 85 మంది అభ్యర్థులు సీఎం అభ్యర్థులేనని ప్రకటించిన రేవంత్ ఇప్పుడు ఆ 85 మంది తోలుబొమ్మలేనని చెప్పకనే చెప్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాల్లో తన సహజ అహంకార ధోరణితో కార్యకర్తలను కాళ్లతో తొక్కుతూ, మెడలు పట్టి నెడుతూ, పిడిగుద్దులు కురిపిస్తున్నాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలను పూచిక పుల్లల్లా తీసి పారేస్తున్న రేవంత్ తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారు. సీఎం రేసులో తామున్నామని ఇప్పటికే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి ఇలా ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు.
పార్టీని ఏండ్ల తరబడి నమ్ముకున్న సీనియర్ నాయకులేం కావాలి? పారాచూట్ లీడర్ సీఎం ఎలా అవుతాడని కొంతమంది నాయకులు పార్టీ నేతలను సూటిగానే ప్రశ్నిస్తున్నారు. పదవులు కొనుక్కొనే అలవాటున్న రేవంత్ ఎందరికి డబ్బులిచ్చి ఉంటాడనే చర్చ పార్టీలో సాగుతున్నది. అంతేకాదు టీడీపీ నుంచి వచ్చిన తనవర్గాన్ని మాత్రమే గెలిపించుకొని, సీనియర్లు ఓడేలా తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తున్నది.
వెంకట్, గుంటిపల్లి
94949 41001