విద్యార్థులు, నిరుద్యోగుల పోరాట పునాదుల మీద అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను రేవంత్ సర్కార్ అటకెక్కించింది. నామమాత్రంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నది. అంతేకాదు, ఏడాది పూర్తయినా కీలకమైన విద్యాశాఖకు మంత్రిని నియమించకపోవడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రస్తుత ఎంపీ ప్రియాంకాగాంధీ స్వయంగా యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, అమరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేలు పింఛన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ వంటి అనేక హామీలు గుప్పించారు. సిటీ సెంట్రల్ లైబ్రరీని సందర్శించిన రాహుల్ వీటి అమలుపై వాగ్దానం చేశారు. ఈ హామీలను విశ్వసించిన నిరుద్యోగులు ప్రభుత్వ మార్పులో కీలక భూమిక పోషించారు. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ వ్యవహారశైలిలో ‘మార్పు’ వచ్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. తమ ప్రభుత్వం ఏడాదిలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసిందని నిస్సిగ్గుగా అబద్ధపు ప్రచారం చేసుకోవడం విడ్డూరం.
ప్రశ్నించే గొంతుకలం, మేధావి వర్గం అంటూ నాడు బీఆర్ఎస్ సర్కార్‌పై విషం చిమ్మినవారు నేడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. పదవులు రాగానే వారి పెదవులు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఏరుదాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలపడం కాదు, పాలకులను నిలదీయాల్సిన అవసరం ఉంది.
– నరేష్ పాపట్ల, 95054 75431