తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూడలేక, ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప మన కష్టాలు తీరవని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన ఉద్యమంలో ముందు నిలబడి, ప్రజలను భాగస్వాములను చేశారు. తద్వారా యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూసింది. తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీదకి ఎత్తుకున్న మహా మనీషి కేసీఆర్. అంతటి మహా మనీషిపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవాకులు చెవాకులు పేలుతుండటం అత్యంత ఖండనీయం.
నిజానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజభోగాలు అనుభవిస్తున్న ఏ ఒక్క నాయకుడూ తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించలేదు. అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేసింది. ఎందుకంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ ఆ విషయాన్ని పదే పదే గుర్తుచేస్తుండటమే కారణం. ఆరు గ్యారెంటీలను నెరవేర్చకపోవడంతో కేటీఆర్ ప్రజల గొంతుకగా మారి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను గుర్తుచేస్తూ 420 హామీల లిస్ట్‌ను రిలీజ్ చేయడం, ప్రభుత్వాన్ని తరచూ ప్రశ్నిస్తుండటంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారారు.
అధికారంలోకి వచ్చి నెల కూడా తిరగకముందే పౌర సరఫరాల శాఖలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణంతో బోణీ చేసిన కాంగ్రెస్ బాగోతాన్ని కేటీఆర్ బట్టబయలు చేశారు. అమృత్ టెండర్ల పేరిట తన బామ్మర్దికి అడ్డగోలుగా దోచిపెట్టి రూ.2 వేల కోట్ల స్కాం చేస్తే దాన్నీ బయటపెట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల కడుపు కొట్టి తమ జేబు నింపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించినందుకు కేటీఆర్ టార్గెట్ అయ్యారు. పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు జరిగి నెల గడుస్తున్నా మోదీ భక్తులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించినందుకు కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందాన్ని ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ టార్గెట్ అయ్యారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట చేస్తున్న రూ.4 వేల కోట్ల స్కామ్‌ను ప్రజల ముందు పెట్టినందుకు కేటీఆర్ టార్గెట్ అయ్యారు. హైదరాబాద్‌కు తాగునీరు తీసుకువచ్చే ప్లాన్ పేరిట, ప్రాజెక్టు ప్లాన్ మార్చి ప్రజల సొమ్ము రూ.4 వేల కోట్లు కొట్టేయాలని చూస్తున్న రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టినందుకు కేటీఆర్ టార్గెట్ అయ్యారు.
ధాన్యం కొనాలంటూ నెలరోజులుగా కల్లాల వద్ద కర్షకులు పడిగాపులు కాస్తుంటే, సమీక్ష చేసి సమస్యను పరిష్కరించే సమయం సీఎం రేవంత్‌కు లేదు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో రోగాల పాలవుతుంటే వెళ్లి పరామర్శించే తీరికా ఆయనకు లేదు. కానీ అడుగడుగునా తన అవినీతిని, ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతున్న కేటీఆర్‌ను వెంటనే ఏదో ఒక కేసులో ఇరికించి జైలు పాలు చేయాలని మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. ఫార్ములా ఈ-రేస్‌లో ఎలాంటి అవినీతి జరగకపోయినా కేటీఆర్ మీద కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ దగ్గరికి వెళ్లటానికి మాత్రం ముఖ్యమంత్రికి సమయం ఉన్నది. నాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను తీసుకువచ్చేందుకు గాను అహర్నిశలు కృషిచేయడమే కేటీఆర్ చేసిన నేరమా? కేటీఆర్ ఒక ఉద్యమ నాయకుడు. ప్రజల పక్షాన పోరాడే తత్త్వం అతని రక్తంలోనే ఉన్నది. రేవంత్‌రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని చూసినా కేటీఆర్ భయపడే వ్యక్తి కాదు. నిప్పుకు చెద పట్టదనేది ఎంత నిజమో కేటీఆర్ నిజాయితీపరుడనేది కూడా అంతే నిజం.