తెలంగాణ పరిణామాలు, ఘటనల పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ స్పందించాలనే మాటలు వేర్వేరు వైపుల నుంచి కొన్ని నెలలుగా వినవస్తున్నాయి. కానీ ఆయన నుంచి ఎటువంటి కదలికలు కన్పించటం లేదు. అందుకు కారణాలు ఏమై ఉంటాయని ఆలోచించగా ప్రధానమైనవి మూడు కనిపిస్తున్నాయి. ఒకటి, తమకు ఇక్కడ కావలసింది అధికారమే తప్ప ప్రజల బాగోగులు కాదు. రెండు, ఏ జోక్యం చేసుకున్నా పార్టీలో బలమైన వర్గాలు చెదిరిపోయి తమ పార్టీ ప్రభుత్వానికి ముప్పు రాగలదేమోననే భయం. మూడు, మౌలికమైన స్థాయిలో తన అసమర్థత. ఇటువంటివి లేనట్లయితే ఆయన జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తన పరిపాలనను చక్కదిద్దేందుకు ఎప్పుడో పూనుకోవలసింది.
Rahul Gandhi | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచింది. ఒకవైపు పరిపాలన అస్తవ్యస్తంగా మారుతూ ప్రజల్లో అసంతృప్తి తలెత్తటం, మరొకవైపు ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహరణపై విమర్శలు రావటం నాలుగైదు నెలలు గడిచేసరికి కనిపించసాగాయి. ప్రతిపక్షాలను పక్కన ఉంచుదాం. కేవలం వాటిని విస్మరించినట్లయితే రాహుల్‌గాంధీని అంతగా అనవలసింది ఉండదు. ప్రతిపక్షాలు ఎప్పుడూ అంతే లెమ్మని తోసివేసే వీలు ఆయనకు ఉంటుంది. కాని జరుగుతూ వచ్చింది అది కాదు. వాస్తవానికి ప్రతిపక్షాలు వెంటనే విమర్శలు చేసినట్టయితే, కొత్త ప్రభుత్వాన్ని కాస్త కుదురుకోనివ్వరా అనే మాట ప్రజల నుంచి రాగలదు గనుకనే అవి తగినంతకాలం చెదురుమదురుగా తప్ప విమర్శలు చేయలేదు. ప్రజలకు కూడా అది ఇంకా వేచి చూసే దశగానే గడిచింది. ఆ కాలమంతా ఎవరూ రాహుల్‌గాంధీ ఎక్కడనే ప్రశ్నలు వేయలేదు కూడా.
ఆ తర్వాత పరిస్థితి మారటం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటల తీరు సరేసరి కాగా, అంతకన్న ముందుగా ప్రజలు మాట్లాడటం మొదలైంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవటం గురించి. అవి వారి నిత్య జీవిత సమస్యలు గనుక. వాటిని నమ్మినందువల్లనే కాంగ్రెస్‌కు ఓటు వేశారు గనుక. హామీలు సాధారణమైనవి కావు. వాటిని ఎప్పుడూ ఏ పార్టీ చేయనివిధంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇంటింటికి తిరిగి పంచారు. ఆ ప్రకటనలు స్థానిక నాయకులు గాక సాక్షాత్తూ నెహ్రూ-గాంధీ వంశానికి చెందిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలు తెలంగాణలో పర్యటించి సభలలో పాల్గొంటూ డిక్లరేషన్ల రూపంలో, మ్యానిఫెస్టో రూపంలో, బాండ్ల రూపంలో చేశారు. హామీల అమలుకు నిర్దిష్టమైన గడువులు విధించారు. వాటి అమలు బాధ్యత స్వయంగా తమదన్నారు. ఆ విషయంలో తాము ఢిల్లీలో తెలంగాణ ప్రజల ప్రతినిధుల వలె వ్యవహరించగలమన్నారు. ఒక చిన్న పిల్లవాడికి ఫిర్యాదున్నా వెంటనే హైదరాబాద్‌కు రాగలమని భరోసా ఇచ్చారు. మనకు తెలిసి ఒక ఎన్నిక విషయంలో ఏ పార్టీ అయినా సరే ఇన్నిన్ని చేయటం ఎప్పుడూ, ఎక్కడా జరగలేదు. ఇవన్నీ కలగలసినప్పుడు ప్రజలు నమ్మకుండా ఉండటం తేలిక కాదు. అందువల్లనే కాంగ్రెస్ గెలిచింది.
అందరికీ తెలిసిన విషయాలనే ఇట్లా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అందుకు ఒక సందర్భం ఉన్నది గనుక. అది, ప్రజలకు ఇన్నిన్ని నమ్మబలికిన రాహుల్‌గాంధీ, ఈ విషయాలపై ప్రజల నుంచి నిరంతరం ఫిర్యాదులు, విమర్శలు వస్తున్నా, ఇటువైపు ఒక్కటంటే ఒక్కసారైనా మొహం చూపకపోవటం. వాస్తవానికి ప్రజలతో నమ్మబలికింది మొత్తం కుటుంబం కలిసికట్టుగా అయినందున వారంతా ఇటురావటం ప్రజల పట్ల రాజకీయ బాధ్యతే గాక నైతిక బాధ్యత కూడా. కనీసం రాహుల్‌గాంధీ అయినా ఆ పని చేయాలి. ఒక్కసారి కాదు, తరచుగా. అయినప్పటికీ ఒక్కసారైనా ఆ పని చేయలేదు. ఇక్కడ హామీలు అమలు కాకపోవటం విషయంలోనే కాదు.
మూసీ జేసీబీలు, గిరిజనుల భూముల ఆక్రమణలు, వారిపై అర్ధరాత్రి దాడులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆందోళనల నుంచి మొదలుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వందలాది ఎకరాల అర్ధరాత్రి విధ్వంసం, వన్యప్రాణులపై హింస వరకు తరచు చోటుచేసుకుంటూ వస్తున్న అనేక సందర్భాల్లో కూడా రాహుల్ ఎక్కడ అనే ప్రశ్నలు వినరావటం ఎక్కువవుతున్నది. ఈ మాట మొదట ప్రతిపక్షాల నుంచి రాగా, తర్వాత వివిధ ప్రజా వర్గాల నుంచి అంతకుమించి వస్తున్నది.
అయినప్పటికీ రాహుల్‌గాంధీ ఇటు రాకపోవటం సరి కదా, కనీసం ఢిల్లీ నుంచి ఒకమాటైనా పల్లెత్తి అనటం లేదు. ప్రజలు మంచివారు, అల్ప సంతోషులు. రాహుల్ ఇక్కడకు రావటం వల్ల సమస్యలు తీరకపోయినా, తీరేటట్లు చూస్తానని మాట్లాడిపోతే నెమ్మదిస్తారు. అట్లా రానప్పుడు కనీసం రానైనా లేదని నొచ్చుకుంటారు. నిరసనభావం పెరుగుతుంది. ఆ నిరసన రాష్ట్ర నాయకత్వానికి పరిమితమయ్యే బదులు గాంధీ కుటుంబానికి విస్తరిస్తుంది. ఇప్పుడది జరుగుతున్నది. ఎన్నికల సమయంలో ఆ కుటుంబానికి చెందిన తల్లీ పిల్లలంతా వచ్చినప్పుడు ప్రజలకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గుర్తుకువచ్చి కొంత మురిశారు కూడా. తర్వాత ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచే కొద్దీ ఆ మురిపెం, నమ్మకం నిరసనగా మారుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంతో పాటు అధిష్ఠానం పట్ల కూడా నిరసన కలిగితే ఇక మిగిలేదేమున్నది. దీనంతటికీ రేవంత్ రెడ్డి అసభ్యకరమైన మాటలు తోడవుతున్నాయి. అందుగురించి నగరాల నుంచి గ్రామాల వరకు, ఉన్నతవర్గాల నుంచి సాధారణ ప్రజల దాకా ఆయనను విమర్శించనివారు కనిపించటం లేదు.
ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి వ్యక్తిగత లోటుపాట్లతో పాటు స్వయంగా తమపై వస్తున్న విమర్శల గురించి సోనియా, రాహుల్, ప్రియాంకలకు తెలియదా? అట్లా ఎంతమాత్రం అనుకోలేము. వారికి సమాచారాలు ఎప్పటికప్పుడు వేర్వేరు మార్గాలలో తెలుస్తూనే ఉంటాయి. పైగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణకు ఒకరిని ఏఐసీసీ నుంచి ప్రత్యేకంగా నియమిస్తారన్నది తెలిసిందే. ప్రస్తుతం ఒక సోకాల్డ్ గాంధియన్ మహిళ ఆ పనిలో ఉన్నారు. కనుక ఇందులో సమస్య లేదు. సమస్యంతా తమకు చేరే సమాచారాన్ని బట్టి ఏమి చేస్తున్నారన్నదే. మంచో, చెడో ఏదైనా చేస్తుండినట్లయితే ప్రస్తుత చర్చ అవసరమయ్యేదే కాదు. ‘రాహుల్ రావయ్యా, ఏం చేస్తున్నావయ్యా’ అంటూ ప్రజలు గాని, ప్రతిపక్షాలు గాని ప్రశ్నించవలసిన పరిస్థితి వచ్చేదీ కాదు. ఇంతకూ ఆయన మాట్లాడనిది, రానిది ఎందుకన్నది ప్రశ్న. సరిగా ఇదే విధమైన ప్రశ్నలు కర్ణాటకలోనూ వినవస్తుండటం విశేషం. హిమాచల్ గురించి మనకు తెలియదు. విచిత్రం ఏమంటే ఆయన తాము అధికారంలో లేని రాష్ర్టాలన్నీ కలియతిరుగుతున్నారు. కానీ, అధికారం ఉన్నచోట్లకు వెళ్లకుండా మొహం చాటేస్తున్నారు. అందుకు కారణాలేమిటన్నది ఆలోచించవలసిన విషయం.
అందుకు మనకు తోస్తున్నది మొదట పేర్కొన్న మూడు కారణాలు. అవి సరికాదంటే, సరైనవి ఏవో ఆ పార్టీ వారు చెప్పినట్లయితే తెలుసుకోవచ్చు. మొదటిది, నెహ్రూ-గాంధీ కుటుంబం దేశంపై తమ ఏకచ్ఛత్రాధిపత్యం ఎన్నడో చెదిరిపోగా, హిమాచల్, కర్ణాటకల తర్వాత మూడవ రాష్ట్రంగా తెలంగాణలో గెలవాలని తహతహలాడుతూ, పైన పేర్కొన్న నానా విన్యాసాలు చేసి అధికారాన్ని సంపాదించింది. అంతటితో సంతృప్తి చెంది తద్వారా లభించే ప్రయోజనాలు పొందుతున్నది. వారి లక్ష్యమే అది గనుక, అది నెరవేరిన వెనుక ఇక ప్రజలను పట్టించుకోవలసిన అవసరం లేదు.
రెండు, తమ బలహీనతలు తెలిసినందున, అవసరాలు మాత్రం తీరాలి గనుక, పార్టీ నాయకులనూ ప్రభుత్వాలనూ ఒకప్పుడు ఇందిరా గాంధీ తరహాలో దృఢంగా నియంత్రించలేరు గనుక, ఇక్కడి ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ఏమైనా అనజూస్తే ఎక్కడ వ్యవహారం బెడిసి అధికారం చేజారుతుందోనన్న భయం. ఒక వర్గం బీజేపీలోకి మారవచ్చుననే వదంతులు ఎప్పుడూ ఉన్నవే. కర్ణాటకలోనూ ఇవే భయాలు, వదంతులు ఉన్నందునే గాంధీ కుటుంబం అక్కడ ఎన్నెన్ని జరుగుతున్నా అటుపోవడం లేదు, పరిస్థితులను చక్కబెట్టడం లేదు. మూడు, దేశమంతటా ఎప్పటినుంచో ప్రసిద్ధి చెందిన రాహుల్ గాంధీ అసమర్థత.
2004లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన ఆయన, అంత గొప్ప సుదీర్ఘ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చి కూడా, ఈ 21 సంవత్సరాల కాలంలో కుటుంబ నేపథ్యాన్ని బట్టి హోదాలు అనుభవించటం మినహా తన శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ నిరూపించుకోలేదు. అందుకే ఒక దశలో తనను తప్పించి ప్రియాంకను ముందుకు తేవాలనే ఆలోచనలు ఆ పార్టీలోనే సాగాయి. ప్రియాంక సామర్థ్యం మాత్రం ఏమిటన్నది వేరే చర్చ.
కానీ, రాహుల్ గురించి అటువంటి అభిప్రాయం ఏర్పడటమన్నది గమనించవలసిన విషయం. ఏవైనా కలసివచ్చినప్పుడో, ఇతర పార్టీలతో పొత్తు కారణంగానో ఆయన సాధించిన విజయాలే అన్నీ. ఆ వివరాలలోకి ప్రస్తుతం వెళ్లనక్కరలేదు గాని, విషయమేమంటే, తనకెవరో ఇచ్చిన ‘పప్పూ’ బిరుదు పూర్తిగా అర్థవంతమైనదే.
ఈ విధమైన కారణాలు రాహుల్‌గాంధీని బలంగా నిలువరిస్తున్నప్పుడు, ఆయన తెలంగాణ ప్రజలకు ఎందువల్ల మొహం చూపటం లేదన్న సందేహానికి బహుశా ఆస్కారమే లేదు. తను అటువంటి సాహసం చేస్తేనే ఆశ్చర్యపోవలసి వస్తుంది. నెహ్రూ-గాంధీ వంశంలో ఆయన ఐదవతరం నాయకుడు. ఆ మొత్తం వంశ చరిత్రను ఎవరైనా రాసినట్లయితే, అందరిలోకి అతి బలహీనునిగా, అత్యంత అసమర్థునిగా తన పేరు నమోదవుతుంది. కేవలం పాదయాత్రలు, లోక్‌సభ డ్రామాలు ఎవరినీ సమర్థులుగా చేయవు. కనుక తెలంగాణ ప్రజలు ఆయనవైపు చూడటమన్నదే వృథా ప్రయాస.
-టంకశాల అశోక్