తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్ల పసిబిడ్డ. సహజంగా ఎక్కడైనా ఎనిమిదేండ్ల బిడ్డలను చాలా మురిపెంగ చూసుకుంటారు. అయితే నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇందుకు మినహాయింపు. ఎనిమిదేండ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. నిధుల కేటాయింపుల్లో తెలంగాణపై వివక్ష కనిపిస్తూనే ఉన్నది.
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి న తొలి రోజుల నుంచే తెలంగాణకు అన్యా యం చేస్తూ వస్తున్నది. విభజన హామీల విషయంలో కేంద్రం ఏనాడు పట్టించుకోలేదు. తెలంగాణకు అన్యా యం చేయాలని చూడటం తప్ప అభివృద్ధిని ఏనాడు పట్టించుకోలేదు. విద్యుత్, నీటి పంపిణీ విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రెండు రాష్ర్టాల మధ్య నేటికీ అనేక సమస్యలు అలాగే ఉండి పోయాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ఇస్తామన్న హామీని నెరవేర్చడంతోపాటు రాష్ట్రంలో విద్యుత్ లోటు ను తీర్చడం కోసం ఛత్తీస్‌గఢ్, తమిళనాడు నుంచి తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు చేసుకున్నది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ ను తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్. మోటార్లకు మీట ర్లు బిగించే కేంద్ర నిర్ణయానికి దూరంగా ఉన్నది.
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం పాతదే. ఎనిమిదేండ్ల కిందటే విభజన చట్టంలో బయ్యారం అం శాన్ని కేంద్రం చేర్చింది. కానీ ఆ తరువాత ఆ ఊసే మరిచింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం బయ్యారం గుట్టలను కూడా సందర్శించింది. భూమి, నీరు, ముడిసరుకు అంచనాలతో కేంద్రానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రతిపాదనలు పంపించింది. అయితే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఇప్పటికీ హామీగానే మిగిలిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పెడుతామని ఒకసారి, సింగరేణి భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తామని ఒకసారి, అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన ముడిసరుకు లేదని మరోసారి…ఇలా మెలికలు పెడుతూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంతే తప్ప పరిశ్రమ ఏర్పాటు దిశగా ఏ మాత్రం ప్రయత్నించలేదు.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదన కూడా ఇప్పటిది కాదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని 1980లోనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వాగ్దానం చేశా రు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని పొందుపరిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. విభజ న చట్టంలోని హామీలను ఆరు నెలల్లోపు అమలు చేయాలి. అయినా కేంద్రం అవేమీ పట్టించుకోలేదు. ఫ్యాక్టరీ అంశాన్ని కేంద్రం అటకెక్కించింది. ‘ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీలతోనే దేశ అవసరాలు తీరుతాయి’ అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకే నరేంద్రమోదీ సర్కారు మహారాష్ట్రలోని లాతూర్‌లో ‘మరాఠ్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’కి శంకుస్థాపన చేసింది. తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపునకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు.
యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ పథకాలకు కేంద్రం చేస్తున్న సాయం శూన్యం. మిషన్ కాకతీయతో వందల ఏండ్లనాటి గొలుసుకట్టు చెరువులు, గ్రామాల చెరువులు మరమ్మత్తులకు నోచుకొన్నాయి. అలాగే మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ చేపట్టింది. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయో గ్ సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును కేంద్రం ఏమాత్రం పట్టించుకోకుండా బుట్టదాఖలు చేసింది. ఇవి చాలవన్నట్లు కేంద్రపన్నుల పంపకాల్లో తెలంగాణ వాటా కూడా తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో 18.9శాతం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. ఇది తెలంగాణకు జరుగుతున్న మరో అన్యాయం.
ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయమే జరుగుతున్నది. అరకొర నిధులతో తెలంగాణకు ఎనిమిదేండ్లుగా కేంద్రం అన్యాయం చేస్తూనే ఉన్నది. ఈసారైనా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టాలి. హైదరాబాద్ – వరంగల్ అలాగే హైదరాబాద్ -నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లకు ఈ బడ్జెట్లో భా రీగా నిధులు కేటాయించాలి. అలాగే జడ్చర్ల ఇండస్ట్రియల్ పార్క్ కు అవసరమైన సొమ్ములిచ్చి ఆదుకోవాలి. ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉన్నది. నరేంద్రమోదీ సర్కార్ ప్రవేశపెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇదే. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. అనేక అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
రాష్ట్రం ఇంకా అభివృద్ధి సాధిం చాలంటే ఇప్పుడు కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సాయం. తెలంగాణ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధు లు, ప్రాజెక్టులను కేటాయించాలి. ఈ విషయంలో పార్టీలకతీతంగా పార్లమెంట్లో స్పందించాలి.
(వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్)
-ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320