సందర్భం ఉన్నా, లేకున్నా ప్రతిపక్షాలను ప్రధాని మోదీ విమర్శిస్తుంటారు. అది బహిరంగ సభనా? ఎన్నికల ప్రచారమా? లేదా పార్లమెంటా? అనేది ఆయనకు అనవసరం. విపక్షాలపై విరుచుకుపడటమే ఆయనకు తెలుసు. 2014 నుంచి మొదలుకొని తాజా సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన ఇదే పద్ధతిని అవలంబించారు. అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు ఆ విమర్శల్లో ప్రధానమైనవి. అయితే అలా విమర్శలు గుప్పించే ప్రయత్నంలో సొంత పార్టీ బీజేపీలో, ఎన్డీయే కూటమిలో అందరూ సత్యసంధులు, త్యాగధనులు, ఉత్తములే ఉన్నట్టు నీతి ప్రవచనాలూ వల్లిస్తుంటారు. వారసత్వానికి, బంధుప్రీతికి, నేర చరిత్రకు వారు అతీతులన్నట్టు పోజులు కొడుతుంటారు. కానీ, వాస్తవానికి బీజేపీ, ఎన్డీయే అందుకు అతీతమేమీ కాదన్నది జగమెరిగిన సత్యం.
మోదీ తన తాజా మంత్రివర్గంలో వారసత్వానికి పెద్దపీట వేశారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయన మాటలకు, చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుందని మోదీ మరోసారి నిరూపించుకున్నారు. గతంలోనూ ఎంతోమంది పరివార్ నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించిన మోదీ.. ఈసారి కూడా అదే పంథాలో పయనించారు. మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు కుమారస్వామి, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా, అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ రించిన్ ఖరు కుమారుడు కిరణ్ రిజిజు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఏకనాథ్ ఖడ్సే కోడలు రక్ష ఖడ్సే, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ మనవడు జయంత్ చౌదరికి తాజా మంత్రివర్గంలో స్థానం దక్కడం గమనార్హం.
వారితో పాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి వేద్ ప్రకాశ్ గోయల్ కుమారుడు పీయూష్ గోయల్, హర్యానా మాజీ మంత్రి రావు బిరేంద్ర సింగ్ కుమారుడు ఇంద్రజీత్ సింగ్‌కు మంత్రులుగా అవకాశం ఇవ్వడం తెలిసిందే. మరి వీరంతా పరివార్ నేతలు కాదంటారా? ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా ప్రస్తావించారు. మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసం ఉంటే.. ఆ వ్యక్తిని మోదీ అంటారని తీవ్రంగా విమర్శించారు.
ఈ నేపథ్యంలో మోదీ నూతన మంత్రివర్గంలో నేరచరిత్ర కలవారు, కోటీశ్వరుల జాబితాను ఏడీఆర్ తాజా నివేదికలో ప్రకటించింది. ఆ వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
నేర చరిత్ర కలవారు: ఏడీఆర్ ప్రకారం.. మోదీ నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారిలో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారిలో 19 మంది హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు.. వంటి తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
ఇద్దరు మంత్రులపై హత్యాయత్నం ఆరోపణలున్నాయి. నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతనూ ఠాకూర్, విద్యా శాఖ, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుఖాంత మజుందార్‌పై ఈ కేసులున్నాయి. హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఠాకూర్, మజుందార్, సురేష్ గోపి, ఓరంలు మహిళలపై వేధింపుల కేసులను ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది మంత్రులపై విద్వేష ప్రసంగాల కేసులున్నాయని ఏడీఆర్ తెలిపింది. మొత్తం 71 మంత్రుల్లో 28 మంది (39 శాతం)పై క్రిమినల్ కేసులున్నాయని ఆ సంస్థ వెల్లడించింది.
కేంద్ర మంత్రులు-కోటీశ్వరులు: నూతన కేంద్ర మంత్రివర్గంలోని 71 మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులే. 71 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.107.94 కోట్లు. ఆరుగురు మంత్రులకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. టీడీపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ మోదీ టీమ్‌లో అత్యంత ధనిక మంత్రిగా నిలిచారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రెండో స్థానంలో, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి మూడో స్థానంలో, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ నాలుగో స్థానంలో, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఐదో స్థానంలో నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది.
తన టీమ్‌లోనే ఎంతో మంది పరివార్ నేతలను ఉంచుకొని ఇతరులపై దుమ్మెత్తి పోయడం ఏ మాత్రం సమంజసం కాదు. బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, అవినీతి గురించి విమర్శించే ముందు మోదీ ఇకనైనా తన టీమ్‌లోనూ అలాంటి వారు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వపక్షంలోనే అలాంటివారిని పెట్టుకొని ఇతరులకు నీతులు చెప్పటం, చౌకబారు విమర్శలు చేయటంలో ఔచిత్యం లేదు. ముందు తమ పార్టీలో, మిత్రపక్షాల్లో ఉన్న లోపాలను సవరించుకొని ఇతరులపై విమర్శలు చేస్తే బాగుంటుంది. అప్పుడు ఆ మాటలకు విలువ కూడా ఉంటుంది.
డా.కోలాహలం రామ్‌కిశోర్
98493 28496