తెలంగాణలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మనం ఎన్నుకున్నది ఎవరిని? ఎందుకు? అన్న అనుమానం రాకమానదు. ఒక వైపు బీదల ఇండ్లు, పరిశ్రమల షెడ్లు, ఫాంహౌజ్‌లు బుల్డోజర్లతో కూల్చివేతలు.. ఇంకోవైపు రైతులకు సమయానికి నీళ్లందక, రుణమాఫీ సక్రమంగా అమలుకాక ఆత్మహత్యలు, గురుకుల విద్యాలయాల్లో కలుషిత ఆహారం ఘటనలు, నేతన్నలపై ప్రభుత్వం శీతకన్ను, సర్కారు దవాఖానల్లో అంతులేని అక్రమాలు.. వంటి వాటితో ప్రభుత్వ ప్రయోజనాలు ఏవీ సగటు మనిషికి ఉపయోగపడకుండా పోతున్నాయి. అన్నింటినీ నిర్వీర్యం చేసే పనులే జోరుగా సాగుతున్నాయి.
హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ చేపలు నిండిన చెరువులా జనాలతో కళకళలాడాలని కులీకుతుబ్‌షా దేవుడ్ని ప్రార్థించాడు. అలాగే, జరిగింది కూడా. అయితే, ఇప్పటి వరకు అందుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి, ప్రజల ఇండ్లు, విద్యాలయాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నాశనం చేస్తున్నది. ఒక చిన్న ఇల్లు నిర్మాణం సగటు మనిషి జీవితకాల స్వప్నం. దానికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అది గుడిసె అయినా, ఇంద్రభవనం అయినా ఆ ఇంటిల్లిపాదికీ అది గొప్ప ఆధారం. అలాంటి ఇం డ్లను అనుమతులు లేవని కూల్చడం సబ బు కాదు. అది అక్రమమే అయితే కట్టేందు కు అనుమతులు ఎందుకు ఇచ్చినట్టు? కరెంటు, నీళ్లు వంటి వాటికి పర్మిషన్లు ఎలా ఇచ్చినట్టు? ఏండ్ల తరబడి ఉంటున్న ఇంటిని కూల్చివేసి, అక్కడి నుంచి తరిమేస్తే ఆ బాధ వర్ణనాతీతం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రోజు ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నది. ప్రభుత్వ పెద్దల్లో ఏ ఇద్దరికీ సమన్వయం లేనట్టుగా అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి దానికీ గత ప్రభుత్వమే కారణమని ఆరోపించడం చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వం కంటే వందరెట్ల మెరుగైన మార్పుతెస్తామని చెప్తేనే కదా జనం నమ్మి ఓట్లేసింది. ఇటు ఏ సంక్షేమ పథకాన్ని పొందలేక, ప్రతిదానికీ దరఖాస్తులు అంటూ కాలక్షేపం చేస్తుంటే జనం తల్లడిల్లిపోతున్నరు. అవకాశాలు మళ్లీ రావొచ్చు, రాకపోవచ్చు. కానీ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలోళ్లలా పగలు, ప్రతీకారాలకు అధికారాన్ని వాడుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉండదు. ప్రజలకు మంచి చేస్తేనే వారు గుర్తుపెట్టుకుంటారు. లేకుంటే అధఃపాతాళానికి నెడతారు.
– భోజన్నగారి అనసూయ