దేశంలో కులగణన నిజంగా జరిగితే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కులగణనగా చరిత్రలో నిలువబోతున్నది. మెజారిటీగా ఉన్న బీసీ సామాజిక వర్గాల ప్రజలు జనగణనలో భాగంగా సాగుతున్న కులగణనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 96 ఏండ్లుగా ఎదురుచూస్తున్న కులగణనను సక్రమంగా పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ఆ కులగణన అందించే గణాంకాల వెలుగులో ఏండ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన బీసీ సామాజిక వర్గాల ప్రజల సంక్షేమం గురించి ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు. అయితే, కులగణన కోసం కేంద్రం అమలు చేస్తున్న చర్యలు మాత్రం..బీసీ సామాజిక వర్గాల ఆశలపై నీళ్లు చల్లే విధంగా ఉన్నదన్న అనుమానంతో ఆవేదన చెందుతున్నారు.
2011లో నాటి కేంద్ర ప్రభుత్వం కులాల సర్వే చేసి అందించిన కులగణన వివరాలు ప్రామాణికంగా లేవని సుప్రీంకోర్టు చెత్తబుట్టలో వేచింది. 2027 కులగణన అందించే లెక్కలు కూడా అదేవిధంగా ఉండబోతున్నాయా అనే అనుమానం మళ్లీ తలెత్తుతున్నది. దేశవ్యాప్తంగా జనగణన మొదటి దశ ప్రారంభమైంది. ఏప్రిల్ 2026లో మొదలైన ఈ ప్రక్రియ ఈ యేడాది సెప్టెంబర్‌లో ముగియనున్నది. దేశ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా కులగణన వివరాలను మొదటి దశలోనే సేకరించాలని బీసీ సంఘాలు, మేధావులు విన్నవించగా..మొదటి దశలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వివరాలకే పరిమితం చేశారు. బీసీ వర్గాలకు హామీ ఇచ్చిన సమగ్ర కులగణన సంగతేందని అడిగితే.. రెండవ దశలో తప్పకుండా చేపడుతామని మళ్లీ హామీ ఇచ్చారు. ఇప్పుడు.. మొత్తం 16 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండవ దశ జనగణనలో సేకరించనున్న వివరాల నమూనా పత్రాలను కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జూన్ 27న విడుదల చేసింది.
డిజిటల్ పద్ధతిలో జరుగనున్న జనగణనలో భాగంగా..ప్రజలు స్వచ్ఛందంగా తమ కులాన్ని తామే నమోదు చేసుకోవడానికి ప్రత్యేక కాలమ్‌ను సర్వే కాలమ్‌లో చేర్చారు. కుటుంబ పెద్ద తమ కులం ఇదని తానే స్వయంగా తెలిపితే దానిని ఎన్యుమరేటర్ రికార్డ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ముందే నోటిఫై చేసిన కమ్యూనిటీ కోడ్ నంబర్లను వాడుతారు. మిగతా కులాల వారు మాత్రం తమ కులం ఇది అని చెప్పడం కోసం ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేశారు.
కులగణనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం ఇందుకోసం ప్రతికులానికీ ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను కేటాయిస్తుందని సామాజిక శాస్త్రవేత్తలు, బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. 1931లో జరిగిన చివరి కులగణనలో తేలిన కులాల సంఖ్య సైతం 4,147 మాత్రమేనని తెలిసి కూడా తప్పుడు పద్ధతిలో గణాంకాలను చేసి విశ్వాసం లేకుండా చేశారని సుప్రీంకోర్టు ఆనాడు ఆ కులగణన నివేదికలను పూర్తిగా తిరస్కరించింది. నేడు ప్రత్యేక కాలమ్ పేరుతో శాస్త్రీయత లేని విధానంలో జరుగుతున్న కులగణననూ పాత విధంగానే చేస్తున్నారని బీసీ సామాజికవేత్తలు, ఉద్యమ నేతలు, మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్యన బిహార్, తెలంగాణ రాష్ర్టాల్లో జరిగిన కులగణన ఒక శాస్త్రీయ నమూనా ప్రకారం చేసినట్టు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ పద్ధతిలో ఎందుకు కులగణన చేయడం లేదోనని మేధావుల అనుమానం. ప్రతి కులానికీ ఒక నెంబర్ కేటాయిస్తూ కులాల పట్టిక ముందే ఎన్యుమరేటర్‌కు అందిస్తే ప్రజా వ్యవహారంలో ఒక కులానికి ఉన్న అనేక మారుపేర్లన్నింటినీ కలిపి ఒకే నెంబర్ ఉంటుంది. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని బట్టి ఎన్యుమరేటర్ సరైన నెంబర్‌ను కులం కాలమ్‌లో రాస్తారు. అలా చేయడం వల్ల సరైన శాస్త్రీయ పద్ధతిలో చేసినట్టు కనబడుతుంది. కానీ దానిని తిరస్కరించి ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేసి నేడు బీసీ సామాజిక వర్గాల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.
సామాజిక ఉద్యమకారుల ఆలోచన మేరకు మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ 2027 జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలి. బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కోర్టులు గుర్తించగలిగే ప్రామాణిక గణాంకాలను ఈ కులగణన సాధించి, ప్రజా సంక్షేమానికి బాటలు వేయాలని బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజాస్వామిక పాలన అంటే మెజారిటీ వర్గాల ఆకాంక్షలకు అండగా నిలబడడమేనని వారు అభిప్రాయపడుతున్నారు.