ఆక్రమించుకున్న హైదరాబాద్ తమదే అని వాదించే అజ్ఞానులకు అత్యున్నత మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కని సమాధానం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న గుజరాత్, మహారాష్ట్ర విడిపోయినప్పుడు కూడా దురాశాపరులైన గుజరాతీలు అచ్చం ఆంధ్రావారి లాగే మాట్లాడారు. ‘మరాఠీ ప్రజలు సమర్థులు కారు, బొంబాయిలో వ్యాపారాలు పెట్టి ఆ నగరాన్ని మేము అభివృద్ధి చేశాం. కాబట్టి బొంబాయి మాకు ఇవ్వాలి’ అని. దానికి అంబేద్కర్ ఇలా సమాధానం చెప్పారు. ‘మీరు కట్టిన ఇళ్లల్లోకి అద్దెకు వచ్చినవాళ్లు ఇంట్లో చక్కని కర్టెన్సు వేసి, ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టి కొంతకాలం ఆ ఇళ్లల్లో నివసిస్తారనుకోండి. మరి ఆ ఇళ్ళు వాళ్లకే ఇచ్చేస్తారా’ అని! ఇక భారతదేశం అక్రమ సైనిక చర్య జరిపినప్పటి నుంచి తెలంగాణ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నదో చూద్దాం!
తెలంగాణ- నిజాం రాజ్యం భారతదేశంలో విలీనమయ్యాక జరిగిన సంఘటనలను ఈ కింది విధంగా విభజించవచ్చు. 1956 దాకా మూడు రకాల పాలనను చూశారు ప్రజలు. 1948లో భారతదేశంలో విలీనమయ్యాక సైనిక చర్య జరిపిన జనరల్ చౌధురీ కొన్నాళ్లు, తర్వాత 1949, డిసెంబర్ నుంచి వెల్లోడి ముఖ్యమంత్రిగా 1952 మార్చి వరకు నిరంకుశ పాలన సాగించారు. ముల్కీ నిబంధనలు పాటించకుండా, స్థానికులకు ఏ రకమైన హక్కులు లేకుండా వారి ఇష్టానుసారం పరిపాలన సాగింది. ఒక్క ఉదాహరణ చెప్పుకోవాలంటే పోలీసు శాఖలోనే 4,981 మంది ముల్కీ లేని తెలంగాణేతరులను నియమించారు. పైగా అందులో 3,111 మంది ఆంధ్రులను మద్రాసు రాష్ట్రం నుంచి రప్పించి నియమించారు. అట్లాగే అన్ని శాఖల్లోనూ స్థానికులకు మొండిచెయ్యిచ్చి, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలిచ్చి ఆదరించారు. పైగా అంతకుముందు వందేండ్ల పాటు వివిధ భాషా మాధ్యమాలలో ఉన్నత విద్య అందించిన తెలంగాణలో విద్యార్హతలున్న వారు లేరు కనుక, బయటివారిని రప్పించామని అబద్ధాలు ప్రచారం చేశారు. అప్పటిదాకా రాష్ట్ర మంత్రులుగా, ఉన్నతాధికారులుగా ఉన్న ముస్లింలను అకారణంగా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. జడ్జీల దగ్గరి నుంచి, తహసీల్దార్ల దాకా వేల మంది ఈ రకమైన వివక్షకు, క్రూరత్వానికి బలయ్యారు.
అన్నింటి కంటే విస్మయం కలిగించే విషయం ఈ 57 ఏండ్లు తెలంగాణ వారికి అటు ముఖ్యమంత్రులుగా స్థానం ఇవ్వకపోగా, అన్ని సంవత్సరాలు ఆంధ్ర, రాయలసీమ వారే ముఖ్యమంత్రులుగా ఉన్నా, తెలంగాణ వారికి పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఉపముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవం, కొద్దిగా అధికారం ఇవ్వడం గాని కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు.
1971లో కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత ఏడాది పాటు జరిగిన మహోద్యమాన్ని చల్లార్చడానికి పీవీ నరసింహారావును ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటిదాకా జరిగిన అన్యాయాలను చక్కదిద్దడానికి ముల్కీ నిబంధనలను అమలు చేయాలని చిన్న ప్రయత్నం మొదలుపెట్టగానే ఆంధ్ర రాజకీయ నాయకుల కుట్రలు మళ్లీ ప్రారంభమయ్యాయి.
ఒక ఏడాది 3 నెలల 12 రోజులకే తమ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ పీవీని ముఖ్యమంత్రిగా తొలగించేటట్టు చేశారు. తర్వాత 1978లో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిగా నియమిస్తే, 2 ఏండ్లు 7 నెలల 9 రోజులకే ఆయన దిగిపోయేటట్టు పాచికలు వేశారు శకుని వారసులు. ఆయనను మళ్లీ 1989 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా పార్టీ నియమించగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన నేపథ్యానికి తగ్గట్టు హైదరాబాద్‌లో ఎప్పుడూ లేనట్టి మత కల్లోలాలు సృష్టించి చెన్నారెడ్డిని అధిష్ఠానం పదవీచ్యుతుడిని చేసేదాకా వదలలేదు. రాయలసీమ హంతకులను హైదరాబాద్‌కు రప్పించి పాత బస్తీలో సుమారు 300 మందిని ఊచకోత కోయించాడు వైఎస్ఆర్. కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత అంత విలయం సృష్టించాడు. అప్పుడు చెన్నారెడ్డి ఒక ఏడాది 14 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. టంగుటూరి అంజయ్య పాలించిన సమయం ఒక ఏడాది 4 నెలల 16 రోజులే. వలస పాలకుల ఆక్రమణలో తెలంగాణ ఉన్న 57 ఏండ్ల 7 నెలల కాలంలో స్థానిక ముఖ్యమంత్రుల పదవీకాలం ముగ్గురిదీ కలిపి ఐదున్నరేండ్లు మాత్రమే.
ఇక ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇరవై మూడున్నరేండ్లు, రాయలసీమ ముఖ్యమంత్రులు ఇరవై ఏడున్నర ఏండ్లు యథేచ్ఛగా అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, వివక్ష విధానాలతో తెలంగాణను పీడించారు. ఆంధ్ర ప్రజల దురదృష్టం ఏమంటే, ఈ వలస పాలకులు అవినీతితో తాము స్వయంగా లబ్ధి పొందారు తెలంగాణ సంపదతో, అంతేకానీ ఆంధ్ర ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదు. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఈ రోజుకూ ఒక రాజధాని లేకుండా, మంచి పరిశ్రమలు, ఎదుగుదల లేకుండా అట్లానే ఉండిపోయింది ఆంధ్ర ప్రాంతం. వారి నాయకుల దురాశతో, ఇటు తెలంగాణ కూడా నాశనమైంది, సంపన్న ప్రాంతమై ఉండి కూడా!
ఇక 1971 తర్వాత ఉద్యమం కొంత చల్లారినా, ప్రజలు మాత్రం తమ ప్రత్యేక రాష్ట్రం కోసం తపిస్తూనే ఉన్నారు. ముల్కీపై చాలాసార్లు హైకోర్టు, సుప్రీంకోర్టుల మధ్యలో నలిగి చివరికి 1972 ‘ముల్కీ నిబంధనలు సక్రమమే’ అని తీర్పు వచ్చాక ఆంధ్రలో ఉద్యమం మొదలైంది. తీర్పు పట్ల హర్షం వెలిబుచ్చిన పీవీ నరసింహారావు తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు.
ఇక వలస పాలకుల హయాంలో ఆంధ్ర పెట్టుబడిదారులు ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలతో రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, ఫైనాన్స్ కంపెనీలు, ఫిల్మ్, మీడియా, వినోద పరిశ్రమలు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, హోటళ్లను ఇబ్బడిముబ్బడిగా స్థాపించారు. ఆంధ్ర వ్యాపారస్థులు తెలంగాణలో వ్యాపారాలను దెబ్బతీయడమే కాకుండా, స్థానిక భాష, సంస్కృతిని కూడా హేళన చేస్తూ మరింతగా విస్తరిస్తూ చెలరేగారు. 1986లో అప్పటిదాకా లేని కోచింగ్ సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టాలని అప్పటి ముఖ్యమంత్రి ఎంసెట్ పరీక్షను ప్రవేశపెట్టాడు. దానివల్ల కార్పొరేట్ సంస్కృతి ప్రబలిపోయి, అప్పటిదాకా ఉన్న జూనియర్ కాలేజీల ప్రభ తగ్గింది. పెరిగిన ఫీజులతో ప్రజలను దోచుకొని ఆంధ్ర ప్రైవేటు సంస్థలు లాభపడ్డాయి.
వ్యవసాయరంగం కుదేలై, తెలంగాణ చేతివృత్తులు మరుగునపడి, ఆంధ్ర స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్ల దోపిడీ విపరీతమై తెలంగాణ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఇక్కడి యువతకు రావలసిన ఉద్యోగాలు ఆంధ్రవారు ఎగరేసుకుపోయారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య అన్ని విషయాల్లో అసమానతలు పెరిగిపోయాయి. 1988-89 మధ్య ట్యాంక్‌బండ్ మీద వెలసిన 33 విగ్రహాల్లో మూడు మాత్రమే తెలంగాణవారివి ఉండటం ఆంధ్ర వలస పాలకుల వివక్షకు తార్కాణం. వారి పేర్లు అక్కడ చెక్కినా, వాడెవడో, ఎక్కడ పుట్టాడో, కనీసం పేరు కూడా ఒక్క తెలంగాణవాడికి తెలియదు. అన్ని రంగాల్లో ఇదే వివక్ష! ఆంధ్ర వారితో కలిసి ఉండబోమన్న రాయలసీమ నాయకులు కూడా వారి స్వలాభం కోసం తోడుదొంగల్లా ప్రవర్తించారు. ఏండ్ల తరబడి 22 కోట్లు మాత్రమే ఆదాయం ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని 120 కోట్లు రాబడి ఉన్న సంపన్న తెలంగాణ ప్రాంతంతో కలిపితే ఏమవుతుందని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందో, సరిగ్గా అదే జరిగింది. కేవలం మోసపూరిత విధానాలు, అసెంబ్లీలో ఉన్న మెజారిటీ ఆంధ్ర రాయలసీమ సభ్యుల పశుబలంతో మాత్రమే సాధ్యమైంది. ఇక విడిపడటం తప్ప పీడిత తెలంగాణ ప్రజానీకానికి వేరే మార్గం కనిపించలేదు!
-కనకదుర్గ దంటు
89772 43484