2024-25 కేంద్ర బడ్జెట్లో ఏపీ, బీహార్ రాష్ర్టాలకు కేంద్రం భారీగా కేటాయింపులు చేసింది. దశాబ్దం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఈ రెండు రాష్ర్టాలకు కలిసివచ్చింది. ఈసారి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో మిత్రపక్షాల మద్దతు అనివార్యంగా మారింది. దీంతో కేంద్ర బడ్జెట్లో బీహార్, ఏపీ రాష్ర్టాలకు ఎన్డీయే సర్కార్ నిధుల వర్షం కురిపించింది.
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని ప్రకటించింది. బీహార్‌లో రోడ్ల అభివృద్ధికే రూ.26 వేల కోట్లు కేటాయించింది. అదే సమయంలో తెలంగాణకు బడ్జెట్లో గుండుసున్నా మాత్రమే ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు పూర్తిస్థాయిలో మద్దతిచ్చి, ప్రాంతీయ పార్టీని పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది.
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం పట్టించుకోవడం లేదు. విభజన హామీలను సాధించుకునేందుకు మొదట్లో కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం సఖ్యతతోనే వ్యవహరించింది. అయినా వివక్ష చూపిస్తుండటంతో తర్వాత బహిరంగంగా నిరసన తెలపాల్సి వచ్చింది.
అయితే రాష్ట్రంలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధులు తెస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి.. మోదీని ‘పెద్దన్న’ అని సంబోధించారు. ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు వినతులను అందజేశారు. అయినా తెలంగాణకు మొండిచెయ్యే ఎదురైంది. దీంతో ఆయన కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దశాబ్ద కాలంగా తెలంగాణ డిమాండ్లను పట్టించుకోని కేంద్రం ప్రస్తుత బడ్జెట్లోనూ సరైన కేటాయింపులు చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు. ఐటీఐఆర్‌పై స్పందించలేదు. మూసీ ఆధునికీకరణకు నిధులు అందించాలని స్వయంగా సీఎం కోరినా పట్టించుకోలేదు. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) కింద ఇచ్చే నిధుల్లోనూ కోత విధిస్తున్నది. ఇలా.. ప్రతి విషయంలోనూ రాష్ర్టానికి అన్యాయమే జరుగుతుండటంతో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతున్నదని మరోసారి స్పష్టమైపోయింది.
2014, 2019 పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా ఈ సారి జాతీయ పార్టీలను ప్రజలు ఆదరించారు. అయితే రెండు పర్యాయాలు కూడా కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం పడలేదు. దీంతో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచినా.. కేంద్రంపై బీఆర్ఎస్ అనుకున్నంతగా ఒత్తిడి తేలేకపోయింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రజలు చెరో 8 స్థానాలను కట్టబెట్టారు. కేంద్రంలో మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ ప్రజలు గెలిపించిన 8 మంది ఎంపీల పాత్ర ఎంతో కీలకంగా మారింది.
అయినప్పటికీ తెలంగాణకు మాత్రం ప్రయోజనం చేకూరలేదు. నిధులు తేవడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. 8 సీట్లతో కాంగ్రెస్‌కు విపక్ష హోదా దక్కిందే తప్ప తెలంగాణకు నిధులు మాత్రం రాలేదు. అదే సమయంలో గతంలో వలె బీఆర్ఎస్ కనీసం పది సీట్లు గెలిచి ఉంటే.. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారేది. తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరేది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు నెరవేరేవి. అందుకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ను దూరం చేసుకొని తప్పు చేశామా? అని ప్రజలు మధనపడుతున్నారు.
-ఫిరోజ్ ఖాన్
96404 66464